చిత్రం: క్షణ క్షణం
నటీనటులు: ఉదయ్ శంకర్, జియా శర్మ, శ్రుతిసింగ్, కోటి, రఘుకుంచె తదితరులు
సంగీతం: రోషన్ సాలూర్
నిర్మాతలు: డాక్టర్ వర్లు, మన్నం చంద్రమౌళి
దర్శకుడు: మేడికొండ కార్తీక్
విడుదల తేదీ: 26-02-2021
'ఆటగదరా శివ' చిత్రంతో తొలి అడుగులోనే ఓ వైవిధ్యభరిత కథాంశాన్ని రుచి చూపించి సినీప్రియుల దృష్టిని ఆకర్షించారు హీరో ఉదయ్ శంకర్. రెండో ప్రయత్నంగా 'మిస్‌మ్యాచ్'తో పర్వాలేదనిపించారు. ఈ నేపథ్యంలోనే ఓ బలమైన విజయాన్ని అందుకునేందుకు 'క్షణ క్షణం' చిత్రంతో ప్రేక్షకుల ముందుకొచ్చారు. కార్తీక్ మేడికొండ దర్శకుడిగా పరిచమయ్యారు. టీజర్లు, ట్రైలర్లు ఆసక్తిరేకెత్తించేలా ఉండటం.. గీతా ఆర్ట్స్ బ్యానర్ నుంచి విడుదలవుతున్న చిత్రమవడం వల్ల ప్రేక్షకుల్లో మంచి అంచనాలు ఏర్పడ్డాయి. మరి ఈ థ్రిల్లర్ ప్రేక్షకులకు ఎలాంటి అనుభూతి అందించింది? ఉదయ్‌కు విజయాన్ని అందించిందా?
కథేంటంటే: సత్య (ఉదయ్ శంకర్), ప్రీతి (జియా శర్మ) అనాథలు. ఇద్దరికీ ఒకానొక సందర్భంలో పరిచయం ఏర్పడుతుంది. తర్వాత ఆ పరిచయం ప్రేమగా మారి... పెళ్లి పీటలెక్కుతుంది. కానీ, పెళ్లి తర్వాత ఇద్దరి మధ్య ఆ ప్రేమ కనుమరుగవుతుంది. డబ్బు విషయమై ఇద్దరి మధ్య తరచూ గొడవలు జరుగుతుంటాయి. మరోవైపు డబ్బు సంపాదన కోసం సత్య చేపల వ్యాపారంలో పెట్టుబడులు పెట్టగా.. అక్కడా నష్టాలే ఎదురవుతాయి. ఇలా అనేక సమస్యలతో సతమతమవుతున్న అతని జీవితంలోకి అనుకోకుండా మాయా (శ్రుతిసింగ్) ప్రవేశిస్తుంది. ఓ డేటింగ్ యాప్ ద్వారా ఏర్పడిన ఈ పరిచయం వల్ల సత్య జీవితం ఊహించని సమస్యల్లో చిక్కుకుంటుంది. మరి మాయా ఎవరు? ఆమె వల్ల సత్యకు ఎదరురైన సమస్యలేంటి? వాటి నుంచి అతనెలా బయటపడ్డాడన్నది మిగతా చిత్ర కథ.
ఎలా ఉందంటే: రెండు గంటల లోపే నిడివున్న చిన్న చిత్రమిది. విశాఖపట్టణం నేపథ్యంగా కథ సాగుతుంటుంది. ప్రధమార్ధంలో సత్య జీవితం ఏంటి? ప్రీతీ అతని జీవితంలోకి ఎలా వచ్చింది. వాళ్లిద్దరి మధ్య గొడవలకు కారణమేంటి? వంటి అంశాలను చూపిస్తూ.. ప్రేక్షకులను మెల్లగా కథలోకి తీసుకెళ్లే ప్రయత్నం చేశారు దర్శకుడు. తర్వాత సత్యకు ఓ డేటింగ్ యాప్‌లో మాయా పరిచయమవడం.. వాళ్లిద్దరి మధ్య నడిచే ఛాటింగ్‌తో కథలో మలుపు తిరుగుతుంది. మధ్యలో సత్య వ్యాపార జీవితానికి సంబంధించి వచ్చే సన్నివేశాలు.. ఆ నేపథ్యంగా సాగే సంభాషణలు అలరించేలా తీర్చిద్దాల్సింది. ఇక విరామ సమయానికి మాయా హత్యకు గురవడం వల్ల ద్వితీయార్ధంపై ఆసక్తి పెంచే ప్రయత్నం చేశాడు.
పోలీసులు మాయా హత్య కేసును విచారించే క్రమంతో కథనంలో వేగం పెరుగుతుంది. ఆ సమయంలో దర్శకుడు మరో ట్విస్ట్ ఇచ్చాడు. ఈ కేసుల నుంచి బయటపడటానికి సత్య ఎలాంటి ఎత్తులు వేస్తాడు? అన్న ఆసక్తి ప్రేక్షకుల్లోనూ మొదలవుతుంది. అక్కడి నుంచి కథ, కథనాలు పరుగులు పెడతాయని ఆశించిన ప్రేక్షకుడికి నిరాశే ఎదురువుతుంది. హత్య కేసు నుంచి బయట పడేందుకు హీరో చేసే ప్రయత్నాలు, దాన్ని ఛేదించే క్రమంలో పోలీసులు చేసే పరిశోధనలతో సన్నివేశాలు నెమ్మదిగా సాగుతాయి. ఆయా సన్నివేశాల్లో వచ్చే సంభాషణలు కూడా ఏమాత్రం ఆసక్తికరంగా అనిపించవు. పతాక సన్నివేశాలు కూడా ఆసక్తికరంగా మలచడంలో దర్శకుడు విఫలమయ్యాడు.
ఎవరెలా చేశారంటే: తొలి చిత్రం 'ఆటగదరా శివ'తోనే మంచి నటుడిగా ప్రేక్షకుల మెప్పు పొందారు ఉదయ్ శంకర్. ఈ సినిమాలోనూ కథకు తగ్గట్లుగా తనదైన నటనతో ఆకట్టుకునే ప్రయత్నం చేశారు. ముఖ్యంగా నిరాశ నిస్పృహల మధ్య భారంగా జీవితాన్ని వెళ్లదీస్తున్న కుర్రాడిగా ఆయన నటన ఎంతో సహజంగా అనిపించింది. ఆయన భార్యగా జియా శర్మ పర్వాలేదనిపించింది. ద్వితీయార్ధంలో ఉదయ్, జియా పాత్రల్లో కనిపించే మరో కొత్త కోణం ప్రేక్షకులకు సర్‌ప్రైజింగ్‌గా అనిపిస్తుంది. మాయ పాత్రలో శ్రుతి సింగ్ అందాలు ఒలికించింది. తెరపై కనిపించేది కొద్దిసేపే అయినా ప్రేక్షకులకు కావాల్సినంత కనుల విందు అందిస్తుంది. సంగీత దర్శకులు కోటి, రఘుకుంచె, రవి ప్రకాష్, గిప్టన్.. తదితరులంతా పాత్రల పరిధి మేరకు నటించారు. దర్శకుడు ఎంచుకున్న కథను ఆసక్తికరంగా మలచడంలో తడబడ్డాడు. కథలో ట్విస్ట్‌లు బాగున్నా, వాటిని తెరపై ఆవిష్కరించడంలో విఫలమయ్యాడు. రోషన్ సాలూర్ అందించిన నేపథ్య సంగీతం, పాటలు పర్వాలేదనిపిస్తుంది.
బలాలు
+ ఉదయ్ శంకర్ నటన
+ ద్వితీయార్ధం
బలహీనతలు
- కథ.. కథనాలు సాగిన తీరు
- ప్రథమార్ధం, ముగింపు
చివరిగా: ద్వితీయార్ధంలో 'క్షణ క్షణం' ఉత్కంఠే!
గమనిక: ఈ సమీక్ష సమీక్షకుడి దృష్టి కోణానికి సంబంధించింది. ఇది సమీక్షకుడి వ్యక్తిగత అభిప్రాయం మాత్రమే!
- " class="align-text-top noRightClick twitterSection" data="">