సామాన్యుడిగా సినీ పరిశ్రమలోకి అడుగుపెట్టి క్యారెక్టర్ ఆర్టిస్ట్, విలన్ పాత్రల్లో నటించి తెలుగువారికి చేరువయ్యారు ప్రముఖ నటుడు కోటా శ్రీనివాసరావు. నటన మీద ఉన్న ఆసక్తితో ఏడు పదుల వయసులోనూ ప్రేక్షకుల్ని అలరిస్తున్న ఆయన తాజాగా తన కెరీర్‌కు సంబంధించి కొన్ని ఆసక్తికర విషయాలను ఓ ఇంటర్వ్యూలో చెప్పారు.
ఎన్నో సంవత్సరాల నుంచి వరుసగా సినిమాల్లో నటించడం వల్ల లాక్‌డౌన్‌లో ఇంట్లో కూర్చోవడం కొద్దిగా బోర్ అనిపించిందని ఆయన తెలిపారు. అంతేకాకుండా అవకాశాల కోసం ఇటీవల చిరంజీవి, పవన్‌కల్యాణ్, త్రివిక్రమ్, వినాయక్‌లకు తాను ఫోన్ చేశానని అన్నారు. పవన్ కల్యాణ్ హీరోగా క్రిష్ దర్శకత్వంలో రానున్న సినిమాలో తాను ఓ పాత్ర చేసినట్లు కోటా పేర్కొన్నారు. చాలారోజుల తర్వాత పవన్ సినిమాలో నటించడం తనకి ఆనందంగా ఉందని.. అవకాశాలు వస్తే తాను నటించడానికి సిద్ధంగానే ఉన్నానని ఆయన వివరించారు.
చిరంజీవి కథానాయకుడిగా నటించిన 'ప్రాణం ఖరీదు'తో కోటా శ్రీనివాసరావు నటుడిగా వెండితెరకు పరిచయమయ్యారు. తెలుగులోనే కాకుండా పలు దక్షిణాది భాషల్లోనూ ఆయన నటించారు. సహాయ నటుడిగా, ప్రతినాయకుడిగా ఎంతో మంది అగ్ర, యువ హీరోల సినిమాల్లో ఆయన కనిపించారు. 'ప్రతిఘటన', 'అహ! నా పెళ్ళంట!', 'యముడికి మొగుడు', 'ఖైదీ నం.786', 'బొబ్బిలి రాజా', 'సీతారత్నంగారి మనవరాలు', 'మెకానిక్ అల్లుడు', 'అతడు', 'ఛత్రపతి', 'గబ్బర్‌సింగ్' ఇలా చెప్పుకుంటూ వెళితే ఎన్నో చిత్రాలు ఆయనలోని నటుడికి నిదర్శనం.
ఇదీ చూడండి: లక్ష్మీపతి పాత్రకు తొలుత అనుకున్నదెవరినో తెలుసా?