సూపర్‌స్టార్ మహేష్‌బాబు నటించిన 'ఒక్కడు'లో... కర్నూల్లో హీరోయిజం చూపించేందుకు అక్కడ ఫేమస్ అయిన కొండారెడ్డి బురుజును చూపించారు. అప్పట్నుంచి కర్నూలు నేపథ్యంలో వస్తున్న సినిమాల్లో ఈ బురుజు చిరునామాగా నిలిచింది.
ప్రస్తుతం హైదరాబాద్‌లోని రామోజీ ఫిలింసిటీలో ఈ బురుజు కనువిందు చేస్తోంది. 'సరిలేరు నీకెవ్వరు' చిత్రం కోసం ఫిలింసిటీలో కొండారెడ్డి బురుజు సెట్‌ని తీర్చిదిద్దారు. దాదాపు రూ.4.5 కోట్ల వ్యయంతో నిర్మించారు. మహేష్‌బాబు హీరోగా నటిస్తున్న ఈ చిత్రానికి అనిల్ రావిపూడి దర్శకుడు. 14 రీల్స్ నిర్మిస్తోంది. దానికి సంబంధించిన విశేషాలను కళా దర్శకుడు ప్రకాష్ వివరించారు.
" సినిమాలో కొండారెడ్డి బురుజు నేపథ్యంలో కొన్ని కీలక సన్నివేశాల్ని చిత్రీకరించాలి. అందుకోసం ఆ లొకేషన్‌ను పరిశీలించడానికి కర్నూలు వెళ్లాం. మునుపటికన్నా అక్కడ రద్దీ పెరిగిపోయింది. అలాంటి చోట మహేష్‌బాబు లాంటి హీరోతో షూటింగ్ అంటే చాలా కష్టం. జనాన్ని అదుపు చేయలేం. 20 రోజుల పాటు అక్కడే ఉండి షూటింగ్ చేయాలి. నటీనటులు, సాంకేతిక నిపుణులు, ఇతర చిత్రబృందం వందల్లో ఉంటారు. వీళ్లందరినీ వెంటబెట్టుకుని షూటింగ్ చేయడంలో ఇబ్బందులు ఎదురవుతాయి. అందుకే.. అదే సెట్‌ని రామోజీ ఫిలింసిటీలో వేయాలని నిర్ణయించుకున్నాం"
-- ప్రకాష్, కళా దర్శకుడు
బురుజు ఎత్తు, వెడల్పు కొలతలు పక్కాగా తీసుకొని...ఏయే మిశ్రమాలు కలిస్తే బురుజును పోలిన రంగుని సృష్టించగలరో చెక్ చేసుకున్నట్లు ప్రకాష్ చెప్పుకొచ్చారు. వీధుల్లో దుకాణాలు, రోడ్లు, విద్యుత్ స్తంభాలను పక్కాగా ఏర్పాటు చేసినట్లు ఆయన వెల్లడించారు. ఇలాంటి కట్టడాల్ని పునఃనిర్మించాలంటే రామోజీ ఫిలింసిటీకి మించిన వేదిక దొరకదని అభిప్రాయపడ్డారు. రోజుకి మూడొందల మంది, రాత్రీ పగలూ కష్టపడి మూడు నెలల వ్యవధిలో సెట్‌ను నిర్మించినట్లు చెప్పారు.
ఈ సినిమా కోసం ఓ ట్రైన్ సెట్‌ని, ఓ ఇంటి సెట్‌నూ తీర్చిదిద్దారు. ఇందుకోసం హైదరాబాద్ శివారులో 30 ఎకరాల స్థలం లీజుకు తీసుకున్నట్లు చిత్రబృందం వెల్లడించింది. జొన్న తోట మధ్యలో ఆ ఇంటి సెట్ వేసినట్లు చెప్పింది. సినిమాలో సహజత్వం కోసమే ఇలాంటి ప్రయోగాలు చేస్తున్నట్లు దర్శకుడు అనిల్ రావిపూడి వెల్లడించాడు.
ఇవీ చూడండి...