ప్రపంచవ్యాప్తంగా ప్రస్తుతం కరోనా వైరస్ సెకండ్ వేవ్ నడుస్తోంది. మనదేశంలోనూ కేసులు రోజుకురోజుకూ భారీగా పెరుగుతున్నాయి. ఇక చిత్రరంగాన్ని తీసుకుంటే ఇప్పటికే చాలామంది ప్రముఖులు కొవిడ్ బారినపడ్డారు. తాజాగా 'ఖిలాడి' చిత్ర దర్శకుడు రమేష్ వర్మకు కొవిడ్ పాజిటివ్‌గా నిర్ధరణ అయింది. ఈ విషయాన్ని స్వయంగా ఆయనే వెల్లడించారు.
"నాకు కొవిడ్ పాజిటివ్‌గా నిర్ధరణ అయ్యింది. ప్రస్తుతం నేను స్వీయనిర్భంధంలో ఉన్నాను. దయచేసి ప్రతి ఒక్కరూ మాస్క్ ధరించండి. అత్యవసర పనులకు మినహాయించి బయట తిరగకుండా ఇంట్లోనే సురక్షితంగా ఉండండి" అంటూ ట్విట్టర్లో పేర్కొన్నారు.
ప్రస్తుతం రమేష్.. రవితేజ కథానాయకుడిగా నటిస్తోన్న 'ఖిలాడి' చిత్రానికి దర్శకత్వం వహిస్తున్నారు. డింపుల్ హయాతీ, మీనాక్షి చౌదరి కథానాయికలు. పెన్ స్టూడియోస్, ఎ స్టూడియోస్ ఎల్ఎల్పీ కలిసి నిర్మిస్తున్న సినిమాకి దేవిశ్రీ ప్రసాద్ సంగీతం అందిస్తున్నారు.