సినీ విమర్శకుడు, నటుడు కత్తి మహేశ్ పార్థివదేహం ఆదివారం అర్ధరాత్రి చిత్తూరు జిల్లాలోని స్వగ్రామం యలమందకు చేరుకుంది. సోమవారం రోజున ఆయన అంత్యక్రియలు నిర్వహించనున్నట్లు బంధువులు తెలిపారు.
గత నెల 26న నెల్లూరు జిల్లా కొడవలూరు మండలం చంద్రశేఖరపురం వద్ద జాతీయ రహదారిపై కత్తి మహేశ్ రోడ్డు ప్రమాదానికి గురయ్యారు. ఆయన ప్రయాణిస్తున్న వాహనం లారీని ఢీ కొట్టింది. మెరుగైన చికిత్స కోసం ఆయణ్ను నెల్లూరు ఆసుపత్రి నుంచి చెన్నైలోని అపోలో ఆస్పత్రికి తరలించారు. తలకు బలమైన గాయాలైనట్లు వైద్యులు గుర్తించారు. చెన్నైలోని అపోలో(Apollo hospital) ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న మహేశ్ వైద్యం కోసం రూ.17లక్షలు మంజూరు చేస్తూ ఏపీ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. చికిత్స పొందుతూ జులై 10న మహేశ్ మృతి చెందారు.
హైవేపై లారీ ఒక్కసారిగా రాంగ్ ట్రాక్‌లోకి రావటం వల్లే ఈ ప్రమాదం జరిగిందని కత్తి మహేశ్ కారు డ్రైవర్ సురేశ్ చెప్పారు. ఘటన జరిగిన సమయంలో కత్తి మహేశ్ సీట్‌బెల్ట్ ధరించలేదని... అందువల్లే బలమైన గాయాలయ్యాయని తెలిపారు. సీటు బెల్టు ధరించిన తనకు పెద్దగా గాయాలవలేదని, ప్రమాదం నుంచి బయటపడ్డానని అన్నారు.
- ఇదీ చదవండి కత్తి మహేశ్‌ను సీటు బెల్టే మోసం చేసిందా?