ఒక సాధారణ ట్రాఫిక్ పోలీస్ వృత్తిరీత్యా తనకు సంబంధం లేని హత్యకేసును ఛేదించే క్రమంలో ఎదురయ్యే సంఘటనల ఆధారంగా తెరకెక్కిన చిత్రం 'కపటధారి'. ప్రదీప్ కృష్ణమూర్తి దర్శకత్వంలో తెరకెక్కిందీ సినిమా. సుమంత్ ప్రధాన పాత్ర పోషించారు. కాగా.. ఈ చిత్రం ఫిబ్రవరి 19న విడుదల కానుంది. ఈ నేపథ్యంలో చిత్రబృందం ప్రిరిలీజ్ వేడుక ఏర్పాటు చేసింది. ఈ కార్యక్రమానికి నాగార్జున ముఖ్యఅతిథిగా హాజరయ్యారు.
ఈ సందర్భంగా హీరో సుమంత్ మాట్లాడుతూ.. "నేను కొత్త సినిమాలు చేసేందుకు ఎప్పుడూ వెనుకాడలేదు. అది హిట్టయినా.. కాకున్నా పట్టించుకోలేదు. దానికి స్ఫూర్తి మావయ్య నాగార్జున. ఆయన కూడా అన్ని రకాల సినిమాలు చేశారు. నేను కూడా ఆయన దారిలోనే నడవాలనుకుంటున్నా. ఈ సినిమా ఎప్పుడో విడుదల కావాల్సి ఉన్నా కరోనా వల్ల కుదరలేదు. ఈ సినిమాపై నాకు ఎంతో నమ్మకం ఉంది. ఈ సినిమా ఇప్పటికే రెండు భాషల్లో నిరూపించుకుంది. తెలుగులో కూడా అందరినీ అలరిస్తుంది. సినిమాకు అందరూ చాలా కష్టపడ్డారు. వాళ్లందరికీ కృతజ్ఞతలు. భారతీయ సినిమా ఇండస్ట్రీకి తెలుగు ప్రేక్షకులు ఆదర్శం. కరోనా తర్వాత మంచి హిట్లు ఇస్తున్నారు. 'కపటధారి' అందరినీ కచ్చితంగా అలరిస్తుంది" అని తెలిపారు.
నాగార్జున మాట్లాడుతూ.. "ఈ సినిమా గురించి విన్నాను. కన్నడ, ఆ తర్వాత తమిళంలో కూడా బాగా హిట్ అయింది. తెలుగులో కూడా విజయం సాధిస్తుంది. కరోనా తర్వాత సినిమా చూసేందుకు థియేటర్లకు జనం వస్తారా అని అనుకున్నాం. కానీ.. 'క్రాక్', 'ఉప్పెన'తో ఇప్పటికే ప్రేక్షకులు తామేంటో నిరూపించారు. ఈ సినిమా సుమంత్‌కు సెట్ అయ్యింది. డైరెక్టర్, నిర్మాతలకు అందరికీ ఈ సినిమా మంచి పేరు తెచ్చిపెట్టాలి. నటీనటులు, టెక్నీషియన్లకూ ఈ సినిమా మంచి జ్ఞాపకంగా నిలవాలని కోరుకుంటున్నా" అని అన్నారు.
నందితా శ్వేత హీరోయిన్‌గా నటించిన ఈ చిత్రాన్ని ధనంజయన్ నిర్మించారు. నాజర్, జయప్రకాశ్, వెన్నెల కిషోర్ కీలక పాత్రల్లో కనిపించనున్నారు. సిమన్ కె.సింగ్ సంగీతం అందించారు.