వినోద పరిశ్రమలో మరో విషాదం చోటుచేసుకుంది. కన్నడ బుల్లితెర నటుడు, ఫిట్‌నెస్ ట్రైనర్ సుశీల్ గౌడ (30) ఆత్మహత్యకు పాల్పడ్డారు. కర్ణాటకలోని మండ్యలో తన స్వగృహంలో ఆత్మహత్య చేసుకున్నారు. ఆత్మహత్యకు గల కారణాలు తెలియరాలేదు. పోస్టుమార్టం అనంతరం మృతదేహాన్ని కుటుంబ సభ్యులకు అప్పగించినట్లు మండ్య ఎస్పీ తెలిపారు.
కన్నడ నాట ప్రాచుర్యం పొందిన 'అంతపుర' సీరియల్ ద్వారా గుర్తింపు పొందిన సుశీల్ గౌడ విడుదలకు సిద్ధమవుతున్న 'సలగ' చిత్రంలో పోలీసు అధికారి పాత్ర పోషించారు. సుశీల్ కేవలం నటుడే కాక ఫిట్‌నెస్ ట్రైనర్, మోడల్ కూడా. సుశీల్ మృతి పట్ల 'సలగ' చిత్రంలో ప్రధాన పాత్ర పోషిస్తున్న దునియ విజయ్ దిగ్భ్రాంతి వ్యక్తంచేశారు. సుశీల్ ఆత్మహత్యకు కారణం ఏదైనప్పటికీ.. ఆత్మహత్య ఏమాత్రం పరిష్కారం కాదని పేర్కొన్నారు. ఎప్పటికైనా కన్నడ చిత్రసీమలో టాప్ హీరో కావాల్సిన వ్యక్తి ఇలా తమను వదిలివెళ్లిపోవడం బాధగా ఉందని ఆవేదన వ్యక్తంచేశారు.