బాలీవుడ్ సినిమా షూటింగ్‌లకు హిమాచల్ ప్రదేశ్ అనువైన ప్రదేశంగా మారిందని ప్రముఖ నటి కంగనా రనౌత్ చెప్పింది. సైఫ్ అలీ ఖాన్, అర్జున్ కపూర్, జాక్వెలిన్ ఫెర్నాండెజ్, యామీ గౌతమ్ ప్రధాన పాత్రల్లో నటిస్తున్న సినిమా 'భూత్ పోలీస్'. పవన్ కృపాలని దర్శకత్వం వహిస్తున్నారు. ఫాక్స్ స్టార్ స్టూడియోస్ నిర్మిస్తోంది. ఈ సినిమా షూటింగ్ కోసం హిమాచల్ ప్రదేశ్‌లోని డల్హౌసీకి వెళ్లారు. ఈ వార్తను కంగన రీట్వీట్ చేసి స్పందించింది.
'ఇలాంటి సమయంలోనూ ముంబయి నుంచి హిమాచల్‌కు వస్తోన్న అనేక చిత్ర బృందాలకు ఈ చోటు ఎంతో సహకరిస్తోంది. ఈ దేవ భూమి ప్రతి భారతీయుడికి చెందింది. ఈ రాష్ట్రం ద్వారా డబ్బు సంపాదించుకునే వారిని మోసగాళ్లని పిలవరు. ఒకవేళ అలా ఎవరైనా అంటే.. నేను వారి వ్యాఖ్యల్ని ఖండిస్తాను. బాలీవుడ్‌లోని వారిలా మౌనంగా ఉండను' అని శివసేన నాయకుడు సంజయ్ రౌత్ వ్యాఖ్యలకు కంగన కౌంటర్ ఇచ్చింది.
గత నెలలో కంగనను సంజయ్ రౌత్ 'మోసగత్తె' అని అన్నారు. అంతకుముందు ఆమె ముంబయిని పాక్ ఆక్రమిత కశ్మీర్‌తో పోల్చి మాట్లాడటం సహా ముంబయి పోలీసుల్ని విమర్శించిన నేపథ్యంలో ఆయన అలా మాట్లాడారు.