లంచగొండులకు ముచ్చెమటలు పట్టించే దేశభక్తుడిగా కమల్ హాసన్ నటించిన భారతీయుడు సినిమా అప్పట్లో ఓ సంచలనం. దాదాపు 24 ఏళ్ల తర్వాత హీరో కమల్, దర్శకుడు శంకర్ ఆ సినిమాకు సీక్వెల్‌ను ప్రకటించారు. అప్పటినుంచే ఈ చిత్రంపై ప్రేక్షకుల్లో అంచనాలు పెరిగిపోయాయి. సినిమా షూటింగ్ గతేడాది మొదలుపెట్టారు.
దురదృష్టవశాత్తు ఫ్రిబ్రవరిలో చిత్రీకరణ సమయంలో జరిగిన ప్రమాదంలో ముగ్గురు చనిపోవడంతో అప్పటినుంచే షూటింగ్ ఆగిపోయింది. ఆ తర్వాత కరోనా, లాక్డౌన్లతో చిత్రీకరణ జరగలేదు. ఇంతలో ఆ ప్రాజెక్టు ఆగిపోయిందని వార్తలు పుట్టుకొచ్చాయి. అయితే ఇప్పుడు అభిమానులకు ఊరటనిచ్చే ఓ వార్త చెన్నైలో చక్కర్లు కొడుతోంది. భారతీయుడు2 చిత్రీకరణ పునఃప్రారంభం అవుతుందని కోలీవుడ్ వర్గాలు అంటున్నాయి. వచ్చే ఏడాది జనవరి చివర్లో కానీ, ఫిబ్రవరి ఆరంభంలో కానీ కమల్ షూటింగ్లో పాల్గొంటారని సమాచారం.
నెల రోజుల్లో సినిమా అంతా పూర్తి చేసి ఆ తర్వాత తమిళ రాజకీయాల్లో చురుగ్గా పాల్గొనేందుకు ఆయన ప్రణాళికలు వేస్తున్నట్లు తెలుస్తోంది. లోకేశ్ కనగరాజ్ దర్శకత్వంలో విక్రమ్ సినిమా పనుల్లోనూ కమల్ బిజీగా ఉన్నారు. ఇందులో విలన్ పాత్ర కోసం ఫాహద్ ఫాజిల్‌ను సంప్రదించినట్లు తెలుస్తోంది.
ఇదీ చదవండి:కష్టసమయాల్లోనూ కథానాయికల 'డబుల్ ధమాకా'