కమల్‌హాసన్ కథానాయకుడిగా దర్శకుడు శంకర్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న చిత్రం 'ఇండియన్ 2'. గతేడాది చిత్రీకరణ సమయంలో ప్రమాదం జరగడం వల్ల సినిమా షూటింగ్ మధ్యలోనే ఆగిపోయింది. దీనికి తోడు కరోనా వైరస్, లాక్‌డౌన్ మరొక కారణం. ఇదిలా ఉండగానే దర్శకుడు శంకర్ ఇటీవల తెలుగులో రామ్‌చరణ్‌తో, బాలీవుడ్‌లో రణ్వీర్ సింగ్‌తో చిత్రాలకు దర్శకత్వం చేయనున్నట్లు ప్రకటించారు.
అయితే దీనిపై 'ఇండియన్ 2' చిత్ర నిర్మాణసంస్థ శంకర్‌పై మద్రాస్ కోర్టులో కేసు వేసింది. తమ సినిమా పూర్తయ్యే వరకు వేరే సినిమాలకు దర్శకత్వం వహించకుండా చూడాలని కోర్టులో పిటిషన్ వేశారు. ఈ వ్యవహారంపై స్పందించిన కోర్టు.. ఇరువర్గాలు కలిసి కూర్చొని సమస్యను పరిష్కరించుకోవాలని ఆదేశించినట్లు సమాచారం. కానీ సమస్య ఎటు తేలకుండా అక్కడే ఆగిపోయింది.
కమల్ చొరవ
ఈ నేపథ్యంలో హీరో కమల్‌హాసన్ ఈ సమస్య దృష్టిసారిస్తూ పరిష్కారం చేయాలని నిర్ణయించుకున్నారట. ఇప్పటికే అటు నిర్మాతలతో పాటు దర్శకుడు శంకర్‌తోనూ చర్చలు జరుపుతున్న కమల్ త్వరలోనే 'భారతీయుడు 2'సినిమా షూటింగ్ మొదలు పెట్టేందుకు సమావేశాన్ని ఏర్పాటు చేయనున్నారని సమాచారం.
లైకా ప్రొడక్షన్స్ పతాకంపై తెరకెక్కుతున్న 'ఇండియన్ 2'లో కాజల్ అగర్వాల్, సిద్ధార్థ్, రకుల్ ప్రీత్ సింగ్, బాబీ సింహా, సముద్ర ఖని, వెన్నెల కిశోర్, మనోబాల తదితరులు నటిస్తున్నారు. 'ఇండియన్' సినిమా తెరపైకి వచ్చి ఈనెల 9వ తేదీ నాటికి ఇరవై ఐదు సంవత్సరాలు పూర్తి చేసుకొసుంది.
ఇదీ చూడండి: కరోనాతో మరో ప్రముఖ నటుడు మృతి