విడుదలకు సిద్ధమవుతున్న హీరో రాజశేఖర్ సినిమా 'కల్కి' కథ తనదేనంటూ కార్తికేయ అనే రైటర్.. సినీ రచయితల సంఘంలో ఫిర్యాదు చేశారు. స్పందించిన కథా హక్కుల వేదిక కన్వీనర్ బీవీఎస్ రవి.. రెండు స్క్రిప్టులకు పోలిక లేదని వివరణ ఇచ్చారు.
"ఎన్నో సూపర్ హిట్ సినిమాల ట్రైలర్స్ చూసి తమ కథ అని వచ్చేవాళ్లు చాలామంది ఉంటారు. వాళ్ల కథను, సినిమా కథను మేం చదివి... రెండింటికీ సంబంధం ఉందో లేదో చెబుతాం. సమస్యలను పరిష్కరించడమే మా ఉద్దేశం. పరిష్కారం, తీసుకున్న నిర్ణయం నచ్చకపోతే కోర్టుకు వెళ్లొచ్చని చెబుతాం. 'కల్కి'కి సంబంధించి కార్తికేయ అనే రచయిత ఫిర్యాదు చేశారు. రెండు స్క్రిప్ట్‌లను చదివాం. మాకు ఎటువంటి పోలిక కనిపించలేదు.
ఒకవేళ ఫిర్యాదు చేసిన వ్యక్తి కథ, ఆ కథ ఒకేలా ఉంటే అతడికి పారితోషికం, గుర్తింపు వచ్చేలా చూస్తాం. తగిన న్యాయం జరిగేలా చేస్తున్నాం. ఒకవేళ వాటి మధ్య పోలికలు లేకపోతే ఫిర్యాదు ఇచ్చిన వ్యక్తితో 'మీ కథకు సంబంధం లేదు' అని చెప్పి పంపిస్తున్నాం." - బీవీఎస్ రవి, కథా హక్కుల వేదిక కన్వీనర్
ప్రశాంత్ వర్మ దర్శకత్వం వహించిన ఈ చిత్రం జూన్ 28న ప్రేక్షకుల ముందుకు రానుంది. ఆదాశర్మ హీరోయిన్. టీజర్, ట్రైలర్ ఇప్పటికే సినిమాపై ఆసక్తి రేకెత్తిస్తున్నాయి.
ఇది చదవండి: కల్కిలో రాజశేఖర్ మరోసారి పోలీస్ లుక్