గంభీరమైన వాచకంతో మాటలే తూటాల్లా దూసుకువస్తుంటే...? అగ్రనటులకు ఏ మాత్రం తీసిపోని ఆహార్యంతో ప్రేక్షకులను పాత్రలకు కట్టిపడేస్తుంటే? అబ్బురపరిచే ఆంగికంతో పాత్రేదైనా.. ఘట్టమేదైనా నేను దిగనంత వరకే.. అనేలా మేటి నటులకూ సవాల్ విసురుతుంటే..? అభినయానికి నిలువుటద్దంలా.. నవరసాల గనిలా.. వెరసి నటనకే నిలువెత్తు రూపంలా ఓ నటుడు వెండితెరను ఏలుతుంటే? ఈ లక్షణాలన్నీ కలిగిన నటుడికి ఓ పేరంటూ పెడితే ఆ పేరే కైకాల సత్యనారాయణ. నాయకుడిగా, ప్రతినాయకుడిగా, హాస్యనటుడిగా, క్యారెక్టర్ ఆర్టిస్ట్‌గా ఒక్కటేంటి కైకాల పోషించని పాత్ర లేదు.
క్యారెక్టర్ ఆర్టిస్టుల్లో సూపర్ స్టార్ స్టేటస్ అనుభవించింది ఒకరు ఎస్వీ రంగారావు అయితే మరొకరు నిస్సందేహంగా కైకాల సత్యనారాయణ. అమాయక చక్రవర్తిలా కామెడీ విలనీ పండించాలన్నా.. ఉంగరాల సాంబయ్య రా అంటూ వెండితెరపై విరుచుకుపడాలన్నా..అది కైకాల సత్యనారాయణే అనే స్థాయి నటుడాయన. పౌరాణికం, జానపదం, చారిత్రాత్మకం, సాంఘికం ఇలా చిత్రమేదైనా సరే .. ఏకకాలంలో ప్రేక్షకులను మెప్పించిన అరుదైన కళాకారుడు. 60 ఏళ్లకు పైగా సినీ ప్రస్థానంలో.. దాదాపు 800 వందల సినిమాలు.. తెలుగు చలనచిత్ర సీమ గర్వించదగిన అగ్రనటీనటులతో పోటాపోటీగా నటించి చూపించిన అద్భుతమైన ప్రస్థానం...కైకాల సత్యనారాయణ సొంతం.
- " class="align-text-top noRightClick twitterSection" data="">
కృష్ణా జిల్లా కౌతవరంలో 1935 జులై 25న జన్మించారు కైకాల సత్యనారాయణ. గుడ్లవల్లేరులో బడి చదువును పూర్తి చేశారు. ఇంటర్మీడియట్ విజయవాడలో చదివి.. గ్రాడ్యుయేషన్ కోసం తిరిగి గుడివాడకు వచ్చారు. కళాశాల చదివే రోజుల్లోనే నాటకాలపైన ఆయనకు విపరీతమైన ఆసక్తి ఏర్పడింది. విజయవాడ హనుమంతరాయ గ్రంథాలయంలో నాటకపోటీల్లో పాల్గొనేవారు. అలా 1952లో ఆచార్య ఆత్రేయ రాసిన నాటకం "ఎవరు దొంగ"ను ప్రదర్శించారు. ఆ నాటకాన్ని చూసిన సినీ దర్శకుడు గరికపాటి రాజారావు.. నీ ముఖవర్చస్సు బాగుందని సినిమాల్లోకి రావాలని ఆహ్వానించారు. డిగ్రీ పూర్తైన తర్వాతే సినీ అవకాశాల కోసం ప్రయత్నిస్తానని సత్యనారాయణ చెప్పటం వల్ల రాజారావు అందుకు అంగీకరించారు. ఎల్వీ ప్రసాద్ దగ్గర అసిస్టెంట్‌గా చేరిన మిత్రుడు కేఎల్ ధర్ కూడా అదే చెప్పటం వల్ల మద్రాసుకు పయనమయ్యారు.
మద్రాసు వెళ్లినా..సినీ అవకాశాలు అంత తేలిగ్గా సత్యనారాయణను వరించలేదు. మిత్రులంతా హీరోలా ఉంటావని ఇచ్చిన ప్రోత్సాహంతో చెన్నపట్టణానికి వచ్చిన సత్యనారాయణ ఎన్నో తిరస్కరణలను ఎదుర్కొన్నారు. కాదనిపించుకున్న ప్రతీసారి ఇంటికి వెళ్లిపోదామనే ఆలోచన ఆయను మెదడును తొలిచినా....తనను తాను నిరూపించుకోవాలనే సంకల్ప బలమే ఆ ఆలోచనలను విరమించుకునేలా చేసింది. ఎంతో కాలం నిరీక్షణ తర్వాత తొలి అవకాశం అందుకున్నారు.
- " class="align-text-top noRightClick twitterSection" data="">
దర్శక నిర్మాత ఎల్వీ ప్రసాద్ ‘కొడుకులు-కోడళ్లు’ అనే సినిమా కోసం నిర్వహించిన ఆడిషన్స్ లో పాల్గొన్నారు. సత్యనారాయణకు ఎల్వీ ప్రసాద్ స్క్రీన్ టెస్టులన్నీ చేసి ఓకే చేశారు. దురదృష్టవశాత్తు ఆ సినిమా ప్రారంభం కాలేదు. మొక్కవోని ధైర్యంతో సత్యనారాయణ దర్శకనిర్మాత బి.ఎ.సుబ్బారావును కలిశారు. ఆయన సత్యనారాయణను ప్రముఖ దర్శకనిర్మాత కె.వి.రెడ్డి వద్దకు పంపితే ఆయన మేకప్ టెస్ట్, వాయిస్ టెస్ట్, స్క్రీన్ టెస్ట్ అన్నీ చేయించి కూడా అవకాశం ఇవ్వలేకపోయారు. అలా ‘దొంగరాముడు’ సినిమాలో తనకు దక్కాల్సిన పాత్ర ఆర్.నాగేశ్వరరావుకు దక్కింది. చివరకు దేవదాసు నిర్మాత డీఎల్ నారాయణ సత్యనారాయణ రూపాన్ని చూసి, అతని గెటప్ నచ్చి,చందమామ బ్యానర్‌పై చెంగయ్య దర్శకత్వంలో తీసిన ‘సిపాయి కూతురు’లో హీరోగా జమున సరసన ఛాన్స్ ఇచ్చారు. అదే సత్యనారాయణకు మొదటి సినిమా. కానీ ఆ సినిమా ఆశించినంత విజయాన్ని సాధించలేదు.
- " class="align-text-top noRightClick twitterSection" data="">
ఎన్టీఆర్‌కు డూప్‌గా
ఎన్టీఆర్‌కు దగ్గర పోలికలుండటం వల్ల సత్యనారాయణ ఖాళీగా ఉండకుండా ఆయనకు డూపుగా చాలా సినిమాల్లో నటించారు. 1960లో ఎన్టీఆర్ చొరవతోనే మోడరన్ థియేటర్స్ వారి ‘సహస్ర శిరచ్ఛేద అపూర్వ చింతామణి’ చిత్రంలో నటుడిగా అవకాశాన్ని అందుకున్నారు. ఆ సినిమా దర్శకుడు ఎస్డీ లాల్ విఠలాచార్య శిష్యుడు కావటం వల్ల సత్యనారాయణలో ఉన్న ట్యాలెంట్‌ను గుర్తించి విఠలాచార్యకు పరిచయం చేశారు. అదే సత్యనారాయణ కెరీర్లో కీలక మలుపు. హీరో వేషాల కోసం వేచి చూడకుండా విలన్లు తక్కువగా ఉన్న ఇండస్ట్రీలో కొరతను తీరుస్తూ అవకాశాలను అందుకోవాలని విఠలాచార్య ఇచ్చిన సలహాను సత్యనారాయణ స్వీకరించారు. SPOT
- " class="align-text-top noRightClick twitterSection" data="">
స్వతహాగా సత్యనారాయణకు ఆల్ రౌండర్‌గా నిరూపించుకోవాలనే కోరిక బలంగా ఉండేది. మంచి అవకాశాలు, విభిన్నమైన పాత్రలను పోషించాలని చాలా తాపత్రయపడేవారు. రొటీన్‌కు భిన్నమైన పాత్రలు ఇవ్వాలని.. తనను తాను నిరూపించుకోగలనని అగ్రనటులకు సవాల్ విసిరే ధైర్యం చేసే వారు. ఆయన నటనపై ఆయనకు అంత నమ్మకం.
ఆహార్యంలో అచ్చం ఎన్టీఆర్‌ను తలపించటం సత్యనారాయణకు ప్రధాన బలం. అందుకే శ్రీకృష్ణార్జున యుద్ధంలో కర్ణుడు, సి.పుల్లయ్య సారధ్యంలో వచ్చిన సంచలన పౌరాణిక రంగుల చిత్రం లవకుశలో భరతుడు, నర్తనశాలలో దుశ్శాసనుడు పాత్రలను పోషించారు. శ్రీకృష్ట పాండవీయం, పాండవ వనవాసం సినిమాల్లో ఘటోత్కచునిగా, శ్రీకృష్ణావతారం, కురుక్షేత్రంలో సుయోధనుడిగా, దానవీరశూరకర్ణలో భీమునిగా, చాణక్య చంద్రగుప్తలో రాక్షస మంత్రిగా, సీతా కల్యాణంలో లంకాధిపతి రావణాసురునిగా.. విలక్షణ పాత్రలు పోషించి మెప్పించారు సత్యనారాయణ.
- " class="align-text-top noRightClick twitterSection" data="">
1967లో వచ్చిన ఉమ్మడి కుటుంబం సినిమాలో ఓ మంచి పాత్ర కోసం సత్యనారాయణ.. ఎన్టీఆర్కే సవాల్ విసిరారు. సినిమాలో కీలకమైన విషాద ఛాయలున్న రెండో అన్నయ్య పాత్ర కావాలని కోరారట. ఆ పాత్ర సత్యనారాయణ చేయగలరో లేదో అనే మీమాంసలో ఎన్టీఆర్ ఉన్న సమయంలో.. రెండు రోజులు షూట్ చేసి తన నటనను చూడాలని కోరారట. నచ్చితేనే సినిమాలో కొనసాగించండి లేదంటే పంపించేయండి అని సత్యనారాయణ ఖరాఖండీగా చెప్పటంతో.. రెండో అన్నయ్య పాత్ర కోసం సత్యనారాయణను ఎంపిక చేశారు. ప్రథమార్థంలో సౌమ్యంగా, ద్వితీయార్థంలో అత్తవారింట్లో అవస్థలు పడే చేతకాని అల్లుడి పాత్రలో సత్యనారాయణ నటన అద్భుతం. గుబురు గడ్డంతో.. విషాద భరిత వదనంతో ఆయన నటిస్తుంటే....ఎన్టీఆర్ ప్రశంసించకుండా ఉండలేకపోయారంట. అదీ సత్యనారాయణ అంటే. ఓ పాత్రకో...ఓ జోనర్ కో పరిమితమైపోయే నటుడు కాదు ఆయన....అందుకే నవరసనటనా సార్వభౌమ బిరుదాకింతుడయ్యారు కైకాల సత్యనారాయణ.
విలన్ గా పాత్రలు వస్తున్నాయి...కానీ క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా విభిన్న భావాలు పలికించే పాత్రలు రావాలంటే....ఎవరో ఒకరిని బతిమాలుకోవాలి. ఈ పద్ధతి ఏ మాత్రం నచ్చేది కాదు సత్యనారాయణకు. అలాంటి పరిస్థితుల్లో విడుదలైన ఓ సినిమా సత్యనారాయణ కెరీర్ గ్రాఫ్‌ను అమాంతం మార్చేసింది. ఇక అక్కడి నుంచి మొదలు విలన్ నుంచి క్యారెక్టర్ ఆర్టిస్ట్ వరకూ ఏ పాత్ర పోషించాలన్నా వినిపించే పేరుగా మారిపోయారు కైకాల సత్యనారాయణ.
- " class="align-text-top noRightClick twitterSection" data="">
కైకాల లైఫ్ మలుపు తిప్పిన 'శారద'
1973లో కళాతపస్వి కే విశ్వనాథ్ దర్శకత్వంలో వచ్చిన శారద చిత్రం కైకాల సత్యనారాయణ సినీ జీవితాన్ని మలుపు తిప్పిందనే చెప్పుకోవాలి. పెళ్లైన కొన్నాళ్లకే భర్తను కోల్పోయి మానసిక సంఘర్షణకు లోనైన తన చెల్లెలి కాపురాన్ని చక్కదిద్దాలకునే అన్నగా...కైకాల నటన నభూతో నభవిష్యతి. ఈ పాత్రలో ఆయన ఎంత గొప్పగా నటించారంటే ఇక ఆ తర్వాత ఆయన పాత్రల కోసం వెనక్కి తిరిగి చూసుకోవాల్సిన అవసరం లేనంతగా పేరు సంపాదించారు. ఇదే విషయాన్ని పలు మార్లు గర్వంగా చెప్పుకునేవారు. ఈ చిత్రం శతదినోత్సవాన్ని పూర్తి చేసుకోవటం సహా ఆ ఏడాదికి ఉత్తమ చిత్రంగా నంది అవార్డును కైవసం చేసుకుంది. అప్పటి వరకూ విలన్ పాత్రలో.. లేదా ఆహార్యం ఉంది కాబట్టి పౌరాణిక పాత్రలు మాత్రమే చేయగలడు అనుకునే సత్యనారాయణ క్యారెక్టర్ ఆర్టిస్ట్‌గానూ అదరగొట్టగలడని శారద చిత్రం నిరూపించింది.
- " class="align-text-top noRightClick twitterSection" data="">
1977లో తాతినేని రామారావు దర్శకత్వంలో ఎన్టీఆర్ హీరోగా రూపొందిచిన చిత్రమే యమగోల. అందులో తొలిసారిగా యముడి వేషం వేసిన సత్యనారాయణ.. నిజంగా యముండంటూ ఉంటే ఇలానే ఉంటారా అన్న స్థాయిలో నటించారు. ధర్మ పరిరక్షణ ధురంధరుండా..యముండా అంటూ సత్యనారాయణ చెప్పిన ట్రేడ్ మార్క్ డైలాగ్‌కు అయితే హాల్ మొత్తం ఈలలు, గోలలతో నిండిపోయేది. ఎన్టీఆర్ మాస్ మసాలాకు తోడు సత్యనారాయణ యాక్టింగ్ తోడవటం వల్ల.. యమగోల సృష్టించిన ప్రభంజనం అంతా ఇంతా కాదు. యముడి కంటే నరుడే గొప్ప అనేలా సాగే ఆ పాత్రలు, ఆ కథ ద్వారా...ఆ తర్వాత ఇక యముడి పాత్ర అంటే సత్యనారాయణ మాత్రమే గుర్తొచ్చేలా ప్రేక్షకుల హృదయాల్లో పేటెంట్ హక్కులు పొందారాయన.
తనదైన నటనను ప్రదర్శించే పాత్రలు వచ్చిన ప్రతీసారి వెండితెరపై చెలరేగిపోయిన సత్యనారాయణ....మిగిలిన సమయాల్లో విలన్‌గా, కామెడీ విలన్‌గా, క్యారెక్టర్ ఆర్టిస్ట్‌గా మంచి పాత్రలను పోషించారు. కేవలం తెలుగు తెరకే ఆయన పరిమితం కాలేదు. మధ్యలో హిందీ, తమిళ సినిమాల్లోనూ నటించారు.ఇటు ఎన్టీఆర్, ఏఎన్ఆర్ తోనూ అటు దిలీప్ కుమార్ లాంటి ఆల్ గ్రేట్ టైం తోనూ నటించిన అనుభవం సత్యనారాయణ సొంతం.
- " class="align-text-top noRightClick twitterSection" data="">
అక్కినేని క్లాసిక్ హిట్ ప్రేమనగర్లో కేశవవర్మ పాత్రలో సత్యనారాయణ జీవించారు. అడవిరాముడు, వేటగాడు సినిమాల్లో విభిన్నమైన కామెడీ విలన్ పాత్రలు పోషించి అద్భుతంగా మెప్పించిన సత్యనారాయణ నటనకు సరికొత్త భాష్యం చెప్పారు. మోసగాళ్ళకు మోసగాడు, దొంగల వేట మొదలైన సినిమాల్లో ఆయన పోషించిన విలన్ పాత్రలు మర్చిపోలేనివి. దేవుడు చేసిన మనుషులు సినిమాలో హాస్యాన్ని పండించి తన పాత్రకు జీవం పోసిన సత్యనారాయణ.. గొప్పనటుడిగా ఎదుగుతున్నావ్ అంటూ ఎస్వీ రంగారావు నుంచి ప్రశంసలు అందుకున్నారట. యస్వీ రంగారావు తదనంతరం ఆయన గంభీర పాత్రలు ఎక్కువ సత్యనారాయణనే వరించాయి. ఆ తర్వాత తరం అగ్రహీరోలైన చిరంజీవి, బాలయ్య నటించిన గూండా, గ్యాంగ్‌లీడర్, సమరసింహారెడ్డి వంటి సినిమాల్లో బాధ్యాతాయుతమైన పోలీసు అధికారిగా నటించి ఆ పాత్రలకే వన్నె తెచ్చారు. తాత మనవడు, చదువు సంస్కారం, తూర్పుపడమర, నేరము శిక్ష, సిరిసిరిమువ్వ, బంగారు కుటుంబం, అన్వేషణ, తాతయ్య ప్రేమలీలలు, బొబ్బిలిరాజా, మంత్రిగారి వియ్యంకుడు, శ్రుతిలయలు, అత్తకు యముడు అమ్మాయికి మొగుడు, రుద్రవీణ, అల్లుడుగారు, ఒంటరిపోరాటం వంటి సాంఘిక చిత్రాల్లో సత్యనారాయణ విభిన్న పాత్రలు పోషించి మెప్పించారు. యమగోల హిట్ ఫార్మూలా యముడి పాత్రను ఆ తర్వాత కొనసాగించిన సత్యనారాయణ యమలీల, యముడికి మొగుడు, రవితేజ దరువు చిత్రాల్లో యముడిగా నటించి యముడి పాత్రకు ట్రేడ్ మార్క్‌గా నిలిచారు.
మరోవైపు సాత్వికమైన పాత్రలకు కూడా సత్యనారాయణ బెస్ట్ ఆప్షన్ అయ్యారు. సంసారం సాగరం, రామయ్య తండ్రి, జీవితమే ఒక నాటకరంగం, దేవుడే దిగివస్తే, తాయారమ్మ- బంగారయ్య, పార్వతీ పరమేశ్వరులు మొదలైన చిత్రాల్లో కీలక పాత్రలు పోషించి విలన్ ఇమేజ్ నుంచి బయటపడి.. కుటుంబ ప్రేక్షకులకు సత్యనారాయణ అభిమాన నటుడయ్యారు. 1976లో దర్శకులు బాపుతీసిన సీతా స్వయంవర్ తో హిందీలో నటించిన సత్యనారాయణ....1977లో శ్రీరామ్ వనవాస్, 1986లో బాలీవుడ్ సూపర్ స్టార్ దిలీప్ కుమార్, అనిల్ కపూర్, నసీరుద్దీన్ షాలతో కలిసి కర్మ సినిమాలో నటించారు. ఒక అశోక్‌కుమార్, ఒక సంజీవ్ కుమార్, ఒక శివాజీ గణేశన్ ముగ్గురూ కలిస్తే సత్యనారాయణ అని ఆ చిత్ర దర్శకుడు సుభాష్ ఘాయ్ సత్యనారాయణను ప్రశంసించటం భాషలతో సంబంధం లేని ఆయన నటనా కౌశలానికి మచ్చు తునక. తమిళంలో కమల్ హాసన్, రజనీకాంత్ వంటి స్టార్ హీరోల సినిమాల్లోనూ పాత్రలను పోషించిన సత్యనారాయణ... వృత్తిమీద ఉన్న అంకిత భావంతో... రమా ఫిలిమ్స్ పేరిట చిత్రనిర్మాణ సంస్థను ప్రారంభించారు. గజదొంగ, ఇద్దరు దొంగలు, కొదమ సింహం, బంగారు కటుంబం, ముద్దుల మొగుడు వంటి ఎనిమిది ప్రయోజనకరమైన చిత్రాలు తీసి విజయం సాధించారు కైకాల సత్యనారాయణ. కొన్ని చిరంజీవి సినిమాలకు సహ నిర్మాతగానూ వ్యవహరించారు.
- " class="align-text-top noRightClick twitterSection" data="">
ఎన్టీఆర్‌తో ఉన్న ప్రత్యేక అనుబంధాన్ని కచ్చితంగా చెప్పుకుని తీరాల్సిందే. సత్యనారాయణ ఎదుగుదలలో రామారావు పాత్ర కీలకమని సత్యనారాయణే చాలా సందర్భాల్లో చెబుతారు. సినిమాల్లోకి రావటానికి ఎన్టీఆర్‌కు దగ్గర పోలికలు ఉండటం ఓ కారణమైతే.. నటించి నిరూపించుకోవటానికి అవకాశాలే లేనప్పుడు ఎన్టీఆర్‌కు డూప్ గా చేసిన పాత్రలే ఆయనకు దగ్గర చేశాయి అంటారు సత్యనారాయణ.
ఎన్టీఆర్‌తో కలిసి 'సెంచరీ'
ఎన్టీఆర్, సత్యనారాయణ కలిసి నటించిన సినిమాలు అక్షరాలా 100. ఓ క్యారెక్టర్ ఆర్టిస్ట్, ఓ నటుడు కలిసి నటించిన అత్యధిక చిత్రాల రికార్డు దక్షిణాదిన వీరిదేనేమో. రాముడు-భీముడు సినిమాలో ఎన్టీఆర్ పాత్ర ద్విపాత్రాభినయం కాగా....ఓ పాత్రలో కైకాల సత్యనారాయణే ఎన్టీఆర్‌కు డూప్‌గా వ్యవహరించారు. పతాక సన్నివేశాల్లో, ఫైట్ సీన్లలో నేరుగా సత్యనారాయణే ఎన్టీఆర్ నటించిన సందర్భాలు ఉన్నాయి. ఎన్టీఆర్ పోషించటానికి వీలులేని పాత్రలన్నీ సత్యనారాయణ దగ్గరకు రావటం ప్రారంభించాయి. తన కోసం ఇంత కష్టపడుతున్న సత్యనారాయణ.. నటుడిగానూ నిరూపించుకోవాలని ఎన్టీఆర్ తాపత్రయ పడేవారట. అలా ఎన్నో పౌరాణిక చిత్రాల్లో తన పాత్ర తర్వాత అంత ప్రాధాన్యం ఉన్న పాత్రలను సత్యనారాయణకు ఇప్పించేవారట
- " class="align-text-top noRightClick twitterSection" data="">
ఎన్టీఆర్. ఇద్దరి మధ్య కొన్ని సందర్భాల్లో మనస్పర్థలు వచ్చినా...తమ్ముడూ అంటూ ఆప్యాయంగా పిలుస్తూ క్షమించమని కోరటం ఎన్టీఆర్ పెద్దరికానికి నిదర్శనం అంటారు సత్యనారాయణ. నిప్పులాంటి మనిషి చిత్రంలో స్నేహమేరా జీవితం పాట.. సినిమా పరంగా ఎలా ఉన్నా వాళ్ల నిజజీవిత అనుబంధానికి అద్దం పడుతుంది.
సత్యనారాయణ, ఎన్టీఆర్ అన్నయ్య ఒకే ఫ్రేములో ఉంటే ఒక సింహం, ఒక ఏనుగు ఢీకొన్నట్లు ఉండేది.. నన్ను నంబర్ వన్ విలన్‌వి అని అన్నగారు మెచ్చుకునేవారని చెబుతారు సత్యనారాయణ. ఉమ్మడి కుటుంబం సినిమాలో సెంటిమెంట్ పండించే రైతు పాత్రను ఇస్తే.. విలన్‌గా చేసేవాడికి సెంటిమెంట్ క్యారక్టరా అన్నవాళ్లు ఉన్నారు. ఆ పాత్రతో ప్రేక్షకులచేత కన్నీరు పెట్టించి నటుడిగా తనేంటో నిరూపించుకునే అవకాశాన్ని ఎన్టీఆర్ కల్పించారంటూ చాలాసార్లు కృతజ్ఞతలు చెప్పుకుంటారు సత్యనారాయణ. ఎన్టీఆర్ రాజకీయ రంగప్రవేశం చేసినప్పుడు...ఆయన పార్టీ నిర్మాణానికి రూపకల్పన చేస్తున్నప్పుడు...ప్రచార ప్రణాళికలు..అధికారం కైవసం చేసుకోవటం ఇలా ప్రతీ సందర్భంలోనూ తెలుగుదేశం పార్టీ వ్యవస్థాపక సభ్యుడిగా సత్యనారాయణ ఎన్టీఆర్‌కు తోడుగా నిలిచారు. చంద్రబాబు ఆహ్వానం మేరకు 1996లో మచిలీపట్నం ఎంపీగా గెలిచి లోక్ సభకు వెళ్లారు. ఆ మరుసటి ఎన్నికల్లో ఓటమి పాలవటం వల్ల రాజకీయాల నుంచి పూర్తిగా నిష్క్రమించారు. అలా సత్యనారాయణ కెరీర్లో ఎన్టీఆర్‌ది ప్రత్యేక అనుబంధం.
- " class="align-text-top noRightClick twitterSection" data="">
1959 నుంచి ఇప్పటివరకూ 62 సంవత్సరాల సినీ ప్రస్థానంలో కైకాల సత్యనారాయణ మొత్తం ఆరు తరాల నటులతో కలిసి నటించారు. నాగయ్య గారి తరం నటుల నుంచి మహేశ్‌బాబు సినిమాల వరకూ సత్యనారాయణ విభిన్నమైన పాత్రలను పోషిస్తూనే ఉన్నారు. మొత్తం 800 పై చిలుకు చిత్రాల్లో నటించిన అనుభవం ఉన్న సత్యనారాయణ...తన నటనతో ఎన్నో అవార్డులను సత్కారాలను అందుకున్నారు.
నటుడిగా సత్యనారాయణ పౌరాణిక, సాంఘిక, చారిత్రక, జానపద పాత్రలు చేసారు. హాస్య, ప్రతినాయక, నాయక, భూమికలెన్నిటినో పోషించారు. తాను పోషించిన వైవిధ్యమైన పాత్రలకు గుర్తుగా "నవరస నటనా సార్వభౌమ" అనే బిరుదు పొందారు. గత కొన్నేళ్లుగా సినిమాలకు పూర్తి దూరంగా ఉన్న సత్యనారాయణ.. పూర్తిగా విశ్రాంతి తీసుకుంటున్నారు. మహేశ్‌బాబు మురారి చిత్రంలో సత్తిపండుగా కుటుంబ ప్రేక్షకులను ఆకట్టుకున్న సత్యనారాయణ...ఆ తర్వాత రవితేజతో కలిసి ఇడియట్, జూనియర్ ఎన్టీఆర్ తో కలిసి నరసింహుడు, చిరంజీవితో అందరివాడు సినిమాల్లో నటించారు. కోడి రామకృష్ణ అనుష్కతో తీసిన సూపర్ హిట్ సినిమా అరుంధతిలో సత్యనారాయణ పోషించిన తాతయ్య పాత్రే ఆయన యాక్టివ్‌గా కనిపించిన చివరి రోల్. 2019లో బాలకృష్ణ నటించిన ఎన్టీఆర్ కథానాయకుడులో దర్శకుడు హెచ్ఎం రెడ్డి పాత్రలో, అదే ఏడాది మహేష్ బాబు మహర్షి చిత్రంలో హీరోయిన్ పూజా హెగ్డే తాతయ్య పాత్రలో తళుక్కున మెరిశారు సత్యనారాయణ.
ఏమైనా తెలుగు వారి హృదయంలో చెక్కు చెదరని స్థానం కైకాల సత్యనారాయణది. నవరస నటనా సార్వభౌమునిగా ఆయన సాగించిన ప్రస్థానం....చేసిన సినిమాలు...పోషించిన పాత్రలు అన్నీ భావితరాల నటులకు ఆదర్శం. నటన అంటే ఇవ్వగలిగే సరైన నిర్వచనం.
- " class="align-text-top noRightClick twitterSection" data="">