దిగ్గజ కథానాయకుడు నందమూరి తారకరామారావు, ప్రముఖ దర్శకుడు కె.రాఘవేంద్రరావు కాంబినేషన్లో వచ్చిన అద్భుతమైన చిత్రం 'అడవి రాముడు'. ఈ సినిమా వచ్చి నేటికి 43 ఏళ్లు పూర్తయింది. ఈ సందర్భంగా ఆ జ్ఞాపకాలను ఆయన నెమరవేసుకున్నారు. అడవి రాముడ్ని గుర్తు చేసుకుని.. నటీనటులు, సాంకేతిక నిపుణులు, డిస్ట్రిబ్యూటర్లు, ఎగ్జిబిటర్లకు శుభాకాంక్షలు తెలియజేశారు. తన జీవితంలో ఏప్రిల్ 28 మరపురాని రోజు అని పేర్కొన్నారు.

"అడవి రాముడు" సినిమా రికార్డులు
- 4 సెంటర్లలో ఓ సంవత్సరం పాటు ఆడిన 'అడవి రాముడు'
- 8 సెంటర్లలో 200 రోజులు ఆడిన చిత్రం
- 35 సెంటర్లలో 100 రోజులు ప్రదర్శితమైన సినిమా
- నెల్లూరు కనకమహల్ థియేటర్లో ప్రతిరోజూ 5 షోలతో 100 రోజులు ఆడిన 'అడవి రాముడు'.
బంగారానికి తావి అబ్బినట్టు 2017లో ఇదే రోజున తన సమర్పణలో 'బాహుబలి' రెండో భాగం విడుదల కావడం మరింత ఆనందాన్ని కలిగిస్తోందని రాఘవేంద్రరావు అన్నారు. 'అడవి రాముడు' ఆహా అనిపిస్తే, 'బాహుబలి' ప్రపంచవ్యాప్తంగా సాహో అనిపించిందని గుర్తు చేసుకున్నారు.

ఈ సందర్భంగా 'బాహుబలి' దర్శకుడు రాజమౌళి, సంగీత దర్శకుడు కీరవాణి, నిర్మాతలు శోభు యార్లగడ్డ, ప్రసాద్ దేవినేని తదితరులకు ప్రత్యేక శుభాకాంక్షలు తెలిపారు రాఘవేంద్రరావు. ఈ రెండు పండుగలను ఒకేరోజు అందించిన ఏప్రిల్ 28, కరోనాను తుదముట్టించేందుకు వేదికగా మారాలని అభిప్రాయపడ్డారు. ఈ వైరస్ను తరిమికొట్టే మహాయజ్ఞంలో పాలుపంచుకుంటున్న వైద్య సిబ్బందికి, పోలీసు విభాగానికి, పారిశుద్ధ్య కార్మికులకు ధన్యవాదాలు తెలియజేశారు.
