James movie review చిత్రం: జేమ్స్; నటీనటులు: పునీత్ రాజ్‌కుమార్, డాక్టర్ శివ రాజ్‌కుమార్, రాఘవేంద్ర రాజ్‌కుమార్, ప్రియా ఆనంద్, శ్రీకాంత్, శరత్ కుమార్, ముఖేష్ రిషి, ఆదిత్య మేనన్ తదితరులు; సంగీతం: చరణ్ రాజ్; ఛాయాగ్రహణం: స్వామి జె గౌడ; కళ: రవి శాంతేహైక్లు; కూర్పు: దీపు ఎస్ కుమార్; నిర్మాత: కిశోర్ పత్తికొండ; దర్శకత్వం: చేతన్ కుమార్; బ్యానర్: కిశోర్ ప్రొడక్షన్స్; విడుదల: 17-03-2022
కన్నడ స్టార్ పునీత్ రాజ్‌కుమార్ నటించిన చివరి చిత్రం 'జేమ్స్'. ఆయన మరణానంతరం ప్రేక్షకుల ముందుకొచ్చింది. తెలుగు ప్రేక్షకులకూ సుపరిచితమైన కథానాయకుడు పునీత్. ఆయన నటించిన ఒకట్రెండు సినిమాలు తెలుగులోనూ విడుదలయ్యాయి. పునీత్ జయంతిని పురస్కరించుకుని 'జేమ్స్' కూడా కన్నడతోపాటు, తెలుగులోనూ విడుదల చేశారు. మరి 'జేమ్స్' చిత్ర కథ ఏంటి? పునీత్‌రాజ్‌కుమార్ ఎలా నటించారు?
James movie story:
కథేంటంటే: సంతోష్‌కుమార్ (పునీత్ రాజ్‌కుమార్) ఓ ప్రైవేట్ సెక్యూరిటీ ఏజెన్సీకి చెందిన బాడీగార్డ్. డ్రగ్స్ మాఫియా నాయకుల్లో ఒకరైన విజయ్ గైక్వాడ్ (శ్రీకాంత్)కి రక్షణగా విధుల్లో చేరతాడు. శత్రువుల నుంచి ప్రాణభయం ఉండటంతో సంతోష్‌ని బాడీగార్డ్‌గా నియమించుకుంటాడు. గైక్వాడ్‌ని, అతడి చెల్లెలు (ప్రియా ఆనంద్)ని పలుమార్లు శత్రువుల నుంచి కాపాడతాడు. నమ్మదగిన వ్యక్తిగా పేరు తెచ్చుకుంటాడు. ఆ తర్వాత అనూహ్యంగా విజయ్ గైక్వాడ్‌నే కిడ్నాప్ చేస్తాడు సంతోష్. తనని తాను జేమ్స్‌గా పరిచయం చేసుకుంటాడు? ఇంతకీ ఈ జేమ్స్ ఎవరు? గైక్వాడ్‌కి రక్షణగా వచ్చి ఆయన్నే కిడ్నాప్ చేయాల్సిన అవసరం ఎందుకొచ్చింది? మాఫియాతో అతనికేమైనా సంబంధం ఉందా? తదితర విషయాలు తెలియాలంటే సినిమా చూడాల్సిందే.
- " class="align-text-top noRightClick twitterSection" data="">
ఎలా ఉందంటే: స్టైలిష్‌గా సాగే యాక్షన్ ప్రధానమైన చిత్రమిది. స్టార్ కథానాయకుడైన పునీత్ రాజ్‌కుమార్‌కి ప్రేక్షకుల్లోనూ, అభిమానుల్లోనూ ఉన్న ఇమేజ్‌కి తగ్గ కొలతలతోనే రూపొందింది. మాఫియా నేపథ్యంలో మొదలయ్యే ఈ సినిమాలోని ఆరంభ సన్నివేశాలు ఆసక్తిని రేకెత్తిస్తాయి. మాఫియా సామ్రాజ్యం కోణంలో కథ మొదలయ్యే తీరు నేరుగా ప్రేక్షకుడిని లీనం చేస్తుంది. ఆర్మీ ఆఫీసర్‌ని పోలిన గెటప్‌తో పునీత్ రాజ్‌కుమార్ స్టైలిష్‌గా తెరపై దర్శనమిస్తాడు. ఆ పాత్రలో ఎంత స్టైల్ ఉంటుందో, పునీత్ అంత ఫిట్‌గా కనిపిస్తాడు. ప్రతీ సన్నివేశంలోనూ హుషారుగా కనిపించారు. అలాంటి నటుడు గుండె పోటుతో దూరమయ్యారనే విషయం ఏ దశలోనూ నమ్మశక్యంగా అనిపించదు. తెరపై ఆయన చేసిన యాక్షన్ ఘట్టాలు, ఆయన కనిపించిన తీరు చాలా బాగుంటుంది. పునీత్ 'పవర్' ఇమేజ్‌కి తగ్గట్టుగా పోరాట ఘట్టాల్ని డిజైన్ చేసిన తీరు కూడా మెప్పిస్తుంది. మాఫియా, రాజకీయం, ఎత్తులు పై ఎత్తులతో ప్రథమార్ధం సాగుతుంది. విరామ సన్నివేశాల్లో మలుపులు ద్వితీయార్ధంపై మరింత ఆసక్తిని రేకెత్తిస్తాయి.
ఇక సెకండాఫ్‌లో భావోద్వేగాలకి పెద్ద పీట వేసే ప్రయత్నం చేశారు. ఫ్లాష్ బ్యాక్ ఎపిసోడ్‌లు, ఆర్మీ నేపథ్యాన్ని ఆవిష్కరిస్తూ సినిమా సాగుతుంది. అవి కొంచెం సాగదీతగా అనిపించినా ఆ వెంటనే యాక్షన్ హంగామా మొదలవుతుంది. కథ, కథనాలు, డ్రామా కంటే కూడా దర్శకుడు పునీత్ రాజ్‌కుమార్ ఇమేజ్‌నే నమ్ముకుని చేసినట్టు అనిపిస్తుంది. కథనం పరంగా దర్శకుడు మరికొన్ని జాగ్రత్తలు తీసుకునుంటే బాగుండేది. పలువురు నటులు అతిథి పాత్రల్లో మెరవడం చిత్రానికి మరిన్ని హంగులు జోడించినట్టైంది. పరిచయ గీతంలో రచితారామ్, శ్రీలీలతోపాటు, ఆషికా రంగనాథ్‌ల మెరుపులు ప్రధాన ఆకర్షణగా నిలుస్తాయి. పునీత్ సోదరులైన శివరాజ్‌కుమార్, రాఘవేంద్ర రాజ్‌కుమార్‌లు అతిథి పాత్రల్లో చేసే సందడి కూడా అభిమానుల్ని మరింతగా మెప్పిస్తుంది. కథ, కథనాలు ఊహకు తగ్గట్టే సాగినా పునీత్ స్టైలిష్ అవతారం, ఆయన చేసిన యాక్షన్ హంగామా కిక్ ఇచ్చేలా ఉంటాయి.
James movie actors:
ఎవరెలా చేశారంటే: పునీత్ రాజ్‌కుమార్ తన పాత్రలో ఒదిగిపోయారు. ఇదివరకెప్పుడూ కనిపించనంత కొత్తగా పక్కా స్టైలిష్ అవతారంలో ఆయన సందడి చేస్తారు. యాక్షన్ ఘట్టాల్లోనూ చాలా హుషారుగా నటించారు. ప్రియా ఆనంద్ పాత్రకి చెప్పుకోదగ్గ ప్రాధాన్యమేమీ లేదు. శరత్ కుమార్ ప్రతినాయకుడిగా కనిపిస్తారు. శ్రీకాంత్ బలమైన పాత్రలో కనిపిస్తారు. ముఖేష్ రుషి, ఆదిత్య మేనన్ తదితరులు అలవాటైన పాత్రలే చేశారు. సాంకేతికంగా సినిమా ఉన్నతంగా ఉంది. ముఖ్యంగా కెమెరా మాయాజాలం సినిమాకి మరింత రిచ్‌నెస్‌ని తీసుకొచ్చింది. సంగీతం పర్వాలేదనిపిస్తుంది. దర్శకుడు చేతన్ కుమార్ స్టైలిష్ మేకింగ్ ఆకట్టుకుంటుంది. ఇలాంటి సినిమాలకి బలమైన కథ, కథనాలు కూడా తోడైతే ఫలితాలు వేరుగా ఉంటాయి. నిర్మాణ విలువలు ఉన్నతంగా ఉన్నాయి.
బలాలు
+ పునీత్ రాజ్‌కుమార్ నటన
+ విరామ సన్నివేశాలు
+ స్టైలిష్ మేకింగ్
బలహీనతలు
- ప్రేక్షకుడి ఊహకు తగ్గట్టుగా సాగే కథ, కథనాలు
చివరిగా: జేమ్స్.. అభిమాన అప్పూ స్టైలిష్ రూపాన్ని గుండెల్లో మరింత పదిలం చేసుకునేలా!
గమనిక: ఈ సమీక్ష సమీక్షకుడి దృష్టి కోణానికి సంబంధించింది. ఇది సమీక్షకుడి వ్యక్తిగత అభిప్రాయం మాత్రమే!
ఇదీ చూడండి: పునీత్‌కు ఓటీటీ సంస్థ నివాళి.. ఫ్రీగా ఐదు సినిమాలు చూసే ఛాన్స్