ప్రతినాయక, తండ్రి పాత్రలతో సినీ కెరీర్లో రెండో ప్రస్థానాన్ని ప్రారంభించాడు జగపతిబాబు. హీరోగా ఎంతటి అభిమానాన్ని చొరగొన్నాడో, విలనిజం పండించి అంతకు మించి ఆదరణ పొందాడు. ఇప్పుడు ఓ హీరోకి అన్నగా కనిపించబోతున్నాడని సినీ వర్గాల సమాచారం. ఆ హీరో ఎవరంటే? నాని.
నేచురల్ స్టార్ కథానాయకుడుగా దర్శకుడు శివ నిర్వాణ 'టక్ జగదీష్' అనే చిత్రం తెరకెక్కిస్తున్నాడు. ఇది అన్నదమ్ములతో ముడిపడిన కథాంశంగా తెలుస్తోంది. నాని పెద్దన్నయ్యగా జగపతిబాబు నటించబోతున్నాడంటూ ఆసక్తికర వార్త టాలీవుడ్‌లో చక్కర్లు కొడుతుంది. మరి ఇంతకాలం తండ్రి పాత్రలకు కేరాఫ్‌గా నిలిచిన జగపతి.. అన్నగా ఎలా ఆకట్టుకుంటాడు? అసలు ఇందులో వాస్తవమెంత? అంటే.. అధికారిక ప్రకటన రావాల్సిందే.
ఇటీవలే విడుదలైన నాని ఫస్ట్‌లుక్ సినిమాపై ఆసక్తి పెంచుతుంది. షైన్ స్క్రీన్ పతాకంపై ఈ చిత్రాన్ని హరీశ్ పెద్ది నిర్మిస్తున్నారు. ఐశ్వర్య రాజేష్, రీతూ వర్మ కథానాయికలు. తమన్ సంగీతం సమకూరుస్తున్నాడు.

ఇదీ చదవండి: మెగాస్టార్ సినిమాలో చెర్రీ 15 రోజుల షూటింగ్!