తమిళ ప్రజలకు అమ్మ, శత్రువుల పాలిట విప్లవ నాయకి. మహిళలకు గర్వకారణమైన 'పురుచ్చి తలైవి' జయలలిత పడిలేచిన కడలి తరంగం. తమిళనాట అగ్రహీరోయిన్‌గా వెలుగొందుతూ.. ఎమ్జీఆర్ ప్రోద్బలంతో ముఖ్యమంత్రిగా కీర్తిని గడించారు. శనివారం(డిసెంబరు 5) ఆమె వర్ధంతి.
వ్యక్తిగతం
జయలలిత.. 1948 ఫిబ్రవరి 24న కర్ణాటకలోని మెలుకోట్లోని బ్రహ్మణ అయ్యంగార్ కుటుంబంలో జన్మించారు. శ్రీశైల మహత్యం సినిమాతో బాలనటిగా వెండితెరపై అరంగేట్రం చేశారు. పాఠశాలలో ఉత్తమ విద్యార్థినిగా అవార్డు అందుకున్నారు.
బాలనటిగా
1965లో విడుదలైన తమిళ చిత్రం 'వెన్నిరా ఆడై'లో జయలలిత ప్రధానపాత్ర పోషించారు. అక్కినేని నాగేశ్వరరావు 'మనుషులు మమతలు'తో తెలుగులోకి ఎంట్రీ ఇచ్చారు. తెలుగులో ఆమె చిత్రం కూడా ఏఎన్ఆర్తోనే చేయడం విశేషం.
బాలీవుడ్లో
'ఇజ్జత్' సినిమాతో 1968లో జయలలిత బాలీవుడ్‌లోనూ అరంగేట్రం చేశారు. తమిళ సూపర్‌స్టార్ ఎం.జీ.రామచంద్రన్‌తో కలిసి 28 చిత్రాల్లో నటించారు.
అత్యధిక సిల్వర్‌జూబ్లీలు
జయలలిత..నటిగా తన కెరీర్లో అత్యధిక సిల్వర్‌జూబ్లీలు (తెలుగులో 28) జరుపుకొన్న చిత్రాలున్నాయి. తమిళంలో 92 చిత్రాల్లో నటించగా.. అందులో 85 సూపర్హిట్లుగా నిలిచాయి. 1965-80 మధ్యలో అత్యధిక పారితోషికం అందుకున్న భారతీయ నటిగానూ ఈమె పేరు తెచ్చుకున్నారు.'కావేరి తందా కలై సెల్వి' బిరుదును ఈమెకు ప్రదానం చేశారు.
ఎమ్జీఆర్ ప్రొద్బలంతో
తమిళ కథానాయకుడు ఎంజీఆర్ తనకు రాజకీయ ఓనమాలు నేర్పించారని జయలలిత పలు సందర్భాల్లో చెప్పారు. 1982లో 'ఆల్ ఇండియా అన్న ద్రవిడ మున్నేట్ర కజగం' (అన్నా డీఎంకే) పార్టీలో చేరి.. 1989 ఎన్నికల్లో బోదినాయక్కనూరు నుంచి తమిళనాడు శాసనసభకు ఎన్నికయ్యారు.
అవమానం తర్వాత ముఖ్యమంత్రిగా
1989 మార్చి 25న అసెంబ్లీలో అప్పటి ముఖ్యమంత్రి కరుణానిధి ఆదేశాల మేరకు జయలలితపై అధికార డీఎంకే పార్టీ సభ్యులు దాడి చేశారు. చిరిగిన చీరతో అసెంబ్లీ నుంచి ఆమె నిష్క్రమించారు.
ఆరుసార్లు ముఖ్యమంత్రిగా
1991లో కాంగ్రెస్ పార్టీతో పొత్తు పెట్టుకుని పోటీ చేశారు. అసెంబ్లీలో జరిగిన దాడికి సానుభూతిగా జయలలిత పార్టీ అత్యధిక మెజారిటీతో గెలుపొంది.. తమిళనాడు చరిత్రలో పిన్నవయస్కురాలిగా, తొలి మహిళా ముఖ్యమంత్రిగా ఎన్నికయ్యారు. 1991 జూన్ 24 నుంచి 1996 మే 12 వరకు మొదటి దశ ముఖ్యమంత్రిగా పనిచేశారు. అనంతరం ఆరుసార్లు సీఎంగా ఎన్నికయ్యారు.
అనూహ్యంగా మరణం
ఇన్ఫెక్షన్తో పాటు డీహైడ్రేషన్‌తో బాధపడిన ఈమె.. 2016 సెప్టెంబరు 22న చెన్నైలోని ఆస్పత్రిలో చేరారు. తీవ్రమైన పల్మనరీ ఇన్ఫెక్షన్, సెప్టిసిమియాతో సతమతమయ్యారు. అదే ఏడాది డిసెంబరు 4న.. సాయంత్రం 4.45 గంటలకు గుండెపోటు కారణంగా జయలలితను వైద్యులు ఐసీయూలో చేర్చారు. డిసెంబరు 5న జయలలిత తుదిశ్వాస విడిచినట్లు ఆస్పత్రి వర్గాలు ప్రకటించాయి. తమిళనాడులో ప్రముఖులైన సీఎన్ అన్నాదురై, ఎంజీఆర్, శివాజీ గణేశన్ తర్వాత అంతటి జనసందోహం జయలలిత అంతిమయాత్రకు హాజరై.. ఆమెకు నివాళులు అర్పించారు.