దర్శకుడు త్రివిక్రమ్ చేయబోయే కొత్త సినిమాపై అభిమానుల్లో సందిగ్ధం నెలకొంది. ఇప్పటికే ఆయన హీరో ఎన్టీఆర్‌తో తన తర్వాతి చిత్రం చేయనున్నానంటూ ప్రకటించారు. కానీ ఇప్పుడా చిత్రం సెట్స్‌పైకి వెళ్లడానికి ఆలస్యమవ్వనుందని తెలిసింది. దీంతో మాటల మాంత్రికుడు తన నిర్ణయాన్ని మార్చుకున్నారట. ఈ విరామ సమయంలో మహేశ్‌తో ఓ మూవీ చేసేందుకు సిద్ధమయ్యారని వినికిడి. ప్రిన్స్ ప్రస్తుతం నటిస్తున్న 'సర్కారు వారి పాట' తర్వాత ఆయన 28వ సినిమాగా ఇది రూపొందనుందట. ఇప్పటికే చర్చలు కూడా జరిగాయని త్వరలోనే అధికార ప్రకటన వచ్చే అవకాశముందని ట్విట్టర్లో ట్రెండింగ్ అవుతోంది. దీంతో త్రివిక్రమ్ తన తర్వాతి సినిమా చేసేది మహేశ్‌తోనా? లేదా ఎన్టీఆర్‌తోనా? అని అభిమానులంతా ఆలోచనల్లో పడ్డారు. మరి దీనిపై స్పష్టత రావాలంటే మాటల మాంత్రికుడు నోరు విప్పేవరకు వేచి ఉండాల్సిందే.
ఒకవేళ త్రివిక్రమ్.. మహేశ్‌తో సినిమా ప్రకటిస్తే పదకొండేళ్ల తర్వాత మూడోసారి ఈ కాంబో రిపీట్ అయినట్లు అవుతుంది. ఇప్పటికే వీరిద్దరి కాంబినేషన్లో వచ్చిన 'అతడు', 'ఖలేజా' విడుదలై అలరించాయి.
ఎన్టీఆర్ సినిమా ఆలస్యం అందుకేనా?
త్రివిక్రమ్ చెప్పిన కథకు ఎన్టీఆర్ కొన్ని మార్పులు అవసరమని భావించినట్లు టాలీవుడ్ వర్గాలు అంటున్నాయి. దీంతో ఈ ప్రాజెక్టును పక్కనపెట్టి బుచ్చిబాబు సానా దర్శకత్వంలో నటించేందుకు తారక్ సిద్ధమయ్యారని ప్రచారం జరుగుతోంది. అయితే దీనిపై ఎలాంటి అధికారిక ప్రకటన రాలేదు.
ఇదీ చూడండి: 'అప్డేట్ ఇవ్వండయ్యా!': ట్విట్టర్లో తారక్ ఫ్యాన్స్ ట్రెండింగ్