'ఇస్మార్ట్' సుందరి నిధి అగర్వాల్ తాను చేయబోతున్న క్రేజీ ప్రాజెక్టుల్ని ప్రకటించింది. విజయ్ దేవరకొండతో 'అర్జున్ రెడ్డి 2', తమిళ స్టార్ విజయ్ దళపతి నటిస్తోన్న 65వ చిత్రంలో నటించబోతున్నట్లు తెలిపింది.
తాజాగా సామాజిక మాధ్యమాల వేదికగా అభిమానులతో ముచ్చటించిన నిధి.. పలు ఆసక్తికర విషయాలను వెల్లడించింది. అయితే ఈ విషయాల్లో ఏమాత్రం నిజం లేదు. ఎందుకంటే ఇవన్నీ ఆమె తనపై తాను పుట్టించుకున్న ఊహాగాన వార్తలు.
"ఇప్పటికిప్పుడు మీపై మీరు కొన్ని గాలి వార్తలు సృష్టించుకోమంటే ఎలాంటివి చెప్తారు?" అని ఓ అభిమాని అడిగిన ప్రశ్నకు సరదాగా ఈ సమాధానం చెప్పింది నిధి. "హిందీ, తెలుగు, తమిళ చిత్ర సీమల్లో ముగ్గురు కథానాయకుల్ని కిడ్నాప్ చేయాలనుకుంటే ఎవరిని ఎంచుకుంటారు?" అని ప్రశ్నించగా.. హిందీ చిత్రసీమ నుంచి షారుఖ్ ఖాన్‌ను కిడ్నాప్ చేస్తానని బదులిచ్చింది. "వేదికలపై షారుఖ్ మాట్లాడే విధానం నాకెంతో నచ్చుతుంది. ఆయన నుంచి ఆ మాట తీరును నేర్చుకోవాలి అనుకుంటున్నాను. తెలుగు, తమిళ చిత్రసీమల నుంచి మాత్రం ఏ కథానాయకుడినీ కిడ్నాప్ చేయలేను. ఇక్కడి హీరోలను వాళ్ల అభిమానులు అమితంగా ఆరాధిస్తుంటారు. వాళ్లతో అనవసరమైన గొడవలెందుకు" అంటూ చిరునవ్వులు చిందించింది.
నటిగా తనని తాను నిరూపించుకునే వైవిధ్యభరిత పాత్రలు చేసేందుకు ఆసక్తిగా ఉన్నానని, చక్కటి పీరియాడికల్ కథలు దొరికితే చేయాలనుందని తన మదిలోని కోరికలను బయటపెట్టింది నిధి. ప్రస్తుతం ఈ భామ తమిళ్‌లో 'భూమి' చిత్రంతో పాటు తెలుగులో ఓ సినిమా చేస్తోంది.
ఇదీ చూడండి : 26 ఏళ్లపుడు క్రష్ ఉంది.. మ్యాగీ చేస్తా: మహేశ్