అగ్రకథానాయిక కాజల్ అగర్వాల్ ఇటీవల తన సింగిల్ లైఫ్‌కి ఫుల్‌స్టాప్ పెట్టేసింది. అక్టోబర్ 30న తన ప్రియుడు గౌతమ్ కిచ్లూతో ఆమె వివాహబంధంలోకి అడుగుపెట్టారు. వివాహానంతరం ఈ జంట హనీమూన్ కోసం మాల్దీవులకు వెళ్లొచ్చారు. ట్రిప్‌లో భాగంగా ప్రపంచంలోనే మొట్టమొదటి నీటి అడుగున ఉన్న 'ది మురాకా హోటల్'లో కాజల్ జంట కొద్దిరోజులపాటు బస చేసింది. దీనికి సంబంధించిన ఫొటోలను కాజల్ సోషల్‌మీడియా వేదికగా అభిమానులతో పంచుకున్నారు కూడా. పర్యాటకులను ఎక్కువగా ఆకర్షించే ఈ హోటల్‌లో ఒకరాత్రి బస చేయాలంటే దాదాపు రూ.38 లక్షలు అవుతుందని.. పదిరోజులపాటు బస చేసినందుకు, ఇతర ఖర్చుల కోసం కాజల్ దాదాపు రూ.5 కోట్లు ఖర్చు పెట్టిందని అప్పట్లో పలు బాలీవుడ్ మీడియాలో వార్తలు వచ్చాయి.
కాగా, తాజా సమాచారం ప్రకారం.. కాజల్ తన హనీమూన్ కోసం ఒక్కరూపాయి కూడా ఖర్చు చేయన్నట్లు తెలుస్తోంది. తమ పర్యాటక రంగాన్ని విదేశీయులకు ముఖ్యంగా భారతీయులకు చేరువచేయాలనే ఆలోచనలో మాల్దీవుల ప్రభుత్వం ఉన్నట్లు సమాచారం. ఈ మేరకు ఏ సెలబ్రిటీకైతే ఇన్‌స్టాగ్రామ్‌లో రెండు మిలియన్ల మంది ఫాలోవర్స్ ఉంటారో వాళ్లు మాల్దీవులకు వచ్చినప్పుడు ఏ హోటల్‌లో బస చేస్తే అక్కడ ఫైవ్‌స్టార్ భోజనాన్ని ఉచితంగా అందిస్తారట. అలాగే ఇన్‌స్టాలో 5 మిలియన్ల కంటే ఎక్కువమది ఫాలోవర్స్ ఉన్న సెలబ్రిటీకి.. ఉండడానికి ఓ హోటల్ రూమ్, భోజనం, ఇద్దరు వ్యక్తులకు రిటర్న్ టిక్కెట్లు ఉచితంగా ఇస్తారట. అందుకే కాజల్ హనీమూన్ కోసం రూపాయి కూడా ఖర్చు చేయలేదని పలు ఆంగ్ల పత్రికల్లో వార్తలు వచ్చాయి.
ఇన్‌స్టా వేదికగా కాజల్ అగర్వాల్‌ని దాదాపు 16 మిలియన్ల మంది ఫాలో అవుతున్నారు. దీంతో ది మురాకా హోటల్ యాజమాన్యమే స్వయంగా ఫోన్ చేసి.. ఫ్రీ టూర్ గురించి చెప్పి కేవలం దుస్తులు, ఇతర బ్యూటీ సామాగ్రి మాత్రమే వెంట తెచ్చుకోమని చెప్పిందట. అలాగే టూర్ ఫొటోల్ని సోషల్‌మీడియా వేదికగా ఫ్యాన్స్‌తో పంచుకోమని తెలియజేసిందట. ఈ మేరకు కాజల్.. ఎప్పటికప్పుడు తన హలీడే ఫొటోల్ని నెట్టింట్లో షేర్ చేసిందని ఊహాగానాలు వినిపిస్తున్నాయి. దీనిపై ఎలాంటి అధికారిక ప్రకటన వెలువడలేదు.
ఇదీ చూడండి :
గౌతమ్‌తో ప్రేమ ఎలా చిగురించిందో కాజల్ మాటల్లోనే..