ప్రముఖ సంగీత దర్శకుడు ఇళయరాజా.. ప్రసాద్ స్టూడియోస్ డైరెక్టర్‌పై పోలీస్ కేసు పెట్టారు. అతడితో పాటు సిబ్బంది తను పని చేస్తుంటే ఇబ్బంది కలిగిస్తున్నారని చెన్నై కమీషనర్‌కు ఫిర్యాదు చేశారు.
ప్రసాద్ స్టూడియోస్‌లో ఓ స్టూడియోను అద్దెకు తీసుకుని, దాదాపు 40 ఏళ్ల నుంచి పనిచేస్తున్నారు ఇళయరాజా. ఎన్నో సినిమాల పాటలు రికార్డింగ్‌లు ఇక్కడే చేశారు. అలాంటిది ఇప్పుడు స్టూడియోస్ డైరెక్టర్‌గా ఉన్న ఎల్వీ ప్రసాద్ మనవడు సాయిప్రసాద్.. తనను ఇబ్బంది పెడుతున్నారని ఇళయరాజా చెప్పారు. తన సంగీత పరికరాలు కొన్నింటిని విరగ్గొట్టారని ఈ ఫిర్యాదులో పేర్కొన్నారు.
దీనితోపాటే తన స్టూడియోను ఆక్రమించేందుకు సాయిప్రసాద్ ప్రయత్నిస్తున్నారని ఇళయారాజా ఆరోపించారు. ఈ విషయమై సత్వరమే చర్యలు తీసుకోవాలని పోలీసులను కోరారు.
1976 నుంచి సంగీతమందిస్తున్న ఇళయరాజా.. 1300కు పైగా సినిమాల్లో 7000 పాటలకు పైగా రూపొందించారు. ఇందులో తెలుగు, తమిళ, కన్నడ, మలయాళ, హిందీ గీతాలు ఉన్నాయి.