బాలీవుడ్ నటుడు సుశాంత్ సింగ్ రాజ్‌పుత్ అనుమానాస్పద మృతి కేసులో.. డ్రగ్స్ కోణంపై నార్కోటిక్స్ కంట్రోల్‌బ్యూరో (ఎన్‌సీబీ) ముమ్మర దర్యాప్తు కొనసాగిస్తోంది. ఇందులో భాగంగా సుశాంత్ సన్నిహితురాలు రియా చక్రవర్తితో రెండో రోజూ విచారణను పూర్తి చేసింది. దాదాపు ఎనిమిది గంటల పాటు ఆమెను విచారించిన అధికారులు.. మంగళవారం కూడా విచారణకు హాజరుకావాలని సమన్లు జారీచేశారు.
డ్రగ్స్ తీసుకొచ్చినా.. వాడలేదు
ఈ కేసులో ఇప్పటికే రియా సోదరుడు షోవిక్ చక్రవర్తి, శామ్యూల్ మిరండాలను అరెస్టు చేయడం వల్ల సోమవారం రియాను అరెస్టు చేస్తారంటూ పెద్ద ఎత్తున ప్రచారం జరిగింది. అయితే, అలాంటిదేమీ జరగలేదు. సోమవారం ఉదయం 9.32 నిమిషాలకు విచారణకు హాజరైన రియాను తన సోదరుడు షోవిక్, మరికొందరితో పాటు విచారించారు. అయితే, తాను డ్రగ్స్ తీసుకొచ్చేదాన్నని.. కానీ, తానెప్పుడూ వాడలేదలేదని రియా అంగీకరించినట్టు సమాచారం. సుశాంత్ డ్రగ్స్ తీసుకొనేవాడని ఆమె తెలిపింది. ఈ కేసులో ఇప్పటివరకు ఎనిమిది మందిని ఎన్‌సీబీ అధికారులు అరెస్టు చేశారు.
సుశాంత్ సోదరిపై కేసు
సుశాంత్ సోదరి ప్రియాంకా సింగ్‌పై నటి రియా చక్రవర్తి కేసు నమోదు చేసింది. సుశాంత్ కేసులో నకిలీ మెడికల్ ప్రిస్క్రిప్షన్లను సృష్టించినందుకు ప్రియాంకతో సహా పలువురిపై పోలీసులకు ఫిర్యాదు చేసింది. రియా తరఫు న్యాయవాది మాన్‌షిండే ఈ విషయాన్ని తెలిపారు.
రియా సహకరిస్తోంది
రియా చక్రవర్తి విచారణలో సహకరిస్తున్నట్టు ఎన్‌సీబీ డిప్యూటీ డీజీ ముతా అశోక్ జైన్ తెలిపారు. ఆది, సోమవారాల్లో ఆమెను విచారించినట్టు పేర్కొన్నారు. సోమవారం ఎనిమిది గంటల పాటు పలు ప్రశ్నించినట్లు ఆయన స్పష్టం చేశారు.