పాకిస్థాన్ ఆల్రౌండర్ షాహిద్ అఫ్రిదీ గతవారం కరోనా బారిన పడ్డాడు. అయితే, అతని ఆరోగ్యం గురించి సామాజిక మాధ్యమాల్లో అనేక వార్తలు వినిపిస్తున్నాయి. ఈ క్రమంలోనే స్పందించిన అఫ్రిదీ.. మొదటి మూడు రోజులు చాలా కఠినంగా అనిపించిందని, ప్రస్తుతం పరిస్థితి క్రమంగా మెరుగుపడుతోందని ఫేస్బుక్ ద్వారా స్పష్టం చేశాడు.
"ఈ వీడియో చేయడానికి కారణం.. కొద్ది రోజులుగా నా ఆరోగ్యం గురించి సోషల్ మీడియాలో విస్తృత ప్రచారం జరగడమే. ప్రస్తుతం నేను బాగానే ఉన్నా. నెమ్మదిగా కోలుకుంటున్నా. కాకపోతే నా పిల్లలను చూడలేకపోతున్నాననే బాధ ఎక్కువగా ఉంది. వారిని కౌగిలించుకోలేకపోతున్నా. వారిని మిస్ అవుతున్నా. కానీ మన చుట్టూ ఉన్న వారిని సురక్షితంగా ఉంచేందుకు ఈ విధంగా చర్యలు తీసుకోవడం చాలా ముఖ్యం."
షాహిద్ అఫ్రిదీ, పాకిస్థాన్ మాజీ క్రికెటర్
ఈ వ్యాధి గురించి పెద్దగా భయపడాల్సిన అవసరం లేదని అఫ్రిదీ తెలిపాడు. కానీ, ఎవరికి వారుగా మహమ్మారితో పోరాడకపోతే, దాన్ని ఓడించడం కష్టమని ఉద్ఘాటించారు. ప్రతి ఒక్కరూ జాగ్రత్తగా ఉండాలని సూచించారు.