కొత్తదనం అనేది ఇప్పుడు కథలు.. కలయికలకే పరిమితం కావడం లేదు. పాటలు.. ఫైట్ల విషయంలోనూ సినీప్రియులు కొత్తదనం కోరుకుంటున్నారు. ముఖ్యంగా పోరాట ఘట్టాల విషయంలో ఇప్పుడు లెక్కలన్నీ మారిపోయాయి. సినిమాలో ఎన్ని ఫైట్ సీక్వెన్స్‌లు ఉన్నాయన్న దానికన్నా.. వాటిని ఎంత కొత్తగా చూపిస్తున్నారన్న దాని గురించే చర్చించుకుంటున్నారు. ఇక ఇందుకోసం కథానాయకులు కొత్త యుద్ధ విద్యలు నేర్చుకుంటున్నారని తెలిస్తే చాలు.. ప్రేక్షకుల కళ్లన్నీ ఆ సినిమాలపైనే ఉంటున్నాయి. అందుకే అభిమానుల అభిరుచుల్ని దృష్టిలో పెట్టుకునే మన హీరోలు అందుకు తగ్గట్లుగా సన్నద్ధమవుతున్నారు. కొత్త యుద్ధ కళలు నేర్చుకుని సరికొత్త యాక్షన్ హంగామా రుచి చూపించే ప్రయత్నం చేస్తున్నారు..
యుద్ధ విద్యల్లో శిక్షణ
కొత్తదనం అందిపుచ్చుకోవడంలోనూ.. పాత్రల కోసం ప్రయోగాలు చేయడంలోనూ ఎప్పుడూ ముందుంటారు అగ్ర కథానాయకుడు నాగార్జున(Nagarjuna). ఇటీవల కాలంలో యాక్షన్ కథలకు చిరునామాగా నిలుస్తున్న ఆయన.. ప్రస్తుతం ప్రవీణ్ సత్తారు దర్శకత్వంలో ఓ యాక్షన్ థ్రిల్లర్ చిత్రం చేస్తున్నారు. ఇందులో ఆయన మాజీ 'రా' అధికారిగా కనిపించనున్నారు. యాక్షన్‌కు ఎంతో ప్రాధాన్యముంది. అందుకే ఈ చిత్రంలోని పోరాట ఘట్టాల కోసం ప్రత్యేకంగా సన్నద్ధమవుతున్నారు నాగ్. ఇందులో భాగంగా ఆన్‌లైన్ ద్వారా క్రావ్ మాగా, సమురై స్వార్డ్ అనే ఇజ్రాయెల్ యుద్ధ విద్యల్లో శిక్షణ తీసుకుంటున్నట్లు సమాచారం. త్వరలో ప్రారంభం కాబోయే కొత్త షెడ్యూల్‌లో ఆయనపై భారీ యాక్షన్ సీక్వెన్స్ చిత్రీకరించనున్నారని తెలిసింది.
'హరి హర వీరమల్లు'తో అభిమానులకు ప్రత్యేక యాక్షన్ విందును అందించబోతున్నారు పవన్ కల్యాణ్(Pawan Kalyan). క్రిష్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న పాన్ ఇండియా చిత్రమిది. 17వ శతాబ్దం నేపథ్యంలో సాగే కథతో రూపొందుతోంది. ఇందులో పవన్ ఓ వీరోచిత బందిపోటుగా కనిపించనున్నారు. ఇది మొఘలాయిలు, కుతుబ్‌షాహీల శకం నాటి కథ కావడం వల్ల.. ఇందుకు తగ్గట్లుగా పోరాట ఘట్టాలను ప్రత్యేకంగా డిజైన్ చేసినట్లు తెలుస్తుంది. ఈ యాక్షన్‌ఎపిసోడ్ల కోసమే పవన్ పలు ప్రాచీన యుద్ధ విద్యల్లో శిక్షణ తీసుకున్నారని సమాచారం. ముఖ్యంగా ఈటె ముల్లుతో ఆయన చేసే పోరాటాలు ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తాయని సినీవర్గాల్లో ప్రచారం జరుగుతోంది.
వైవిధ్యభరిత కథాంశాలతో
లవర్ బాయ్‌గా పేరు తెచ్చుకున్న విజయ్ దేవరకొండలోని(Vijay devarakonda) ఫైటర్‌ను ఇప్పుడు 'లైగర్'తో(Liger) ప్రేక్షకులకు పరిచయం చేయబోతున్నారు దర్శకుడు పూరీ జగన్నాథ్. మిక్స్‌డ్ మార్షల్ ఆర్ట్స్ కథాంశంతో రూపొందుతున్న పాన్ ఇండియా చిత్రమిది. అందుకే తన పాత్ర కోసం మిక్స్‌డ్ మార్షల్ ఆర్ట్స్‌లో ప్రత్యేక శిక్షణ తీసుకున్నారు విజయ్. అంతేకాదు రోజుల తరబడి కఠిన కసరత్తులు చేసి సిక్స్ ప్యాక్ లుక్‌లోకు మారారు.
కెరీర్ ఆరంభం నుంచి వైవిధ్యభరిత కథాంశాలతోనే ప్రయాణం చేస్తున్నారు మెగా హీరో వరుణ్ తేజ్. ఇప్పుడాయన కిరణ్ కొర్రపాటి దర్శకత్వంలో 'గని' సినిమా చేస్తున్నారు. బాక్సింగ్ ఆట నేపథ్యంలో సాగే కథతో రూపొందుతోంది. ఇప్పుడీ చిత్రం కోసమే కిక్ బాక్సింగ్‌లో శిక్షణ తీసుకుని.. ప్రొఫెషనల్ బాక్సర్‌గా మారారు వరుణ్.
ఓవైపు ప్రేమకథలు.. మరోవైపు యాక్షన్ కథలతో సినీప్రయాణాన్ని పరుగులు పెట్టిస్తున్నారు హీరో నాగశౌర్య. ఇప్పుడాయన సంతోష్ జాగర్లపూడి దర్శకత్వంలో 'లక్ష్య' చిత్రం చేస్తున్నారు. ప్రస్తుతం చిత్రీకరణ దశలో ఉంది. ప్రాచీన యుద్ధ కళల్లో ఒకటైన విలువిద్య నేపథ్యంలో సాగే కథతో రూపొందుతోంది. ఇప్పుడీ చిత్రం కోసమే విలు విద్యలో ప్రత్యేక శిక్షణ తీసుకున్నారు శౌర్య. అంతేకాదు ఈ పాత్ర కోసమే ఎంతో శ్రమించి సిక్స్ ప్యాక్ లుక్ సాధించారు.
నాయికలు సై..
కథానాయకులకు దీటుగా మేమూ అదిరిపోయే యాక్షన్ విందు అందిస్తామంటున్నారు కథానాయికలు. అనడమే కాదు.. కార్యరంగంలోకి దూకి ఆయా పాత్రల కోసం కొత్త విద్యలు నేర్చుకుంటున్నారు. గ్లామర్ పాత్రలతో ఎన్నో సినిమాల్లో అలరించిన కాజల్(Kajal Agarwal).. ఇప్పుడు నాగార్జున-ప్రవీణ్ సత్తారు చిత్రంలో స్పైగా కనిపించబోతుంది. ఇప్పుడీ పాత్ర కోసమే మార్షల్ ఆర్ట్స్‌తో పాటు రైఫిల్ షూటింగ్‌లోనూ శిక్షణ తీసుకుంటోంది.
ఇటీవల కాలంలో నాయికా ప్రాధాన్య చిత్రాలతో జోరు చూపిస్తోంది నటి ఈషా రెబ్బ(Eesha rebba). ఇప్పుడామె తన కొత్త చిత్రం కోసం షూటింగ్‌తో పాటు బాక్సింగ్ నేర్చుకుంటోంది.
మణిరత్నం తెరకెక్కిస్తున్న 'పొన్నియన్ సెల్వన్'లో ఓ ప్రధాన పాత్రలో నటిస్తోంది నటి త్రిష(Trisha). విభిన్నమైన పీరియాడికల్ కథాంశంతో రూపొందుతున్న చిత్రమిది. ఇప్పుడీ సినిమా కోసం హార్స్ రైడింగ్‌తో పాటు స్వార్డ్ ఫైటింగ్‌లో శిక్షణ తీసుకుంది త్రిష.
'భరత్ అనే నేను', 'వినయ విధేయ రామ' చిత్రాలతో తెలుగు వారికీ దగ్గరైన ఉత్తరాది అందం కియరా అడ్వాణీ(Kiara Advani). ప్రస్తుతం బాలీవుడ్‌లో వరుస సినిమాలతో జోరు చూపిస్తోంది. ఇప్పుడీ అమ్మడు ఓ కొత్త సినిమా కోసం మార్షల్ ఆర్ట్స్ నేర్చుకుంటున్నట్లు ఇటీవలే సామాజిక మాధ్యమాల ద్వారా తెలియజేసింది.
ఇదీ చూడండి: శ్రియ ఎన్ని సినిమాల్లో నటిస్తుందో తెలుసా?