బాలనటుడిగా తెలుగు ప్రేక్షకులకు సుపరిచితుడైన తరుణ్.. 'నువ్వే కావాలి' సినిమాతో కథానాయకుడిగా పరిచయమయ్యారు. కె.విజయ్ భాస్కర్ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ చిత్రం అప్పట్లో యువతను ఊర్రూతలూగించింది. తరుణ్- హీరోయిన్ రిచా నటన, విజయ్ భాస్కర్ టేకింగ్, త్రివిక్రమ్ రచనా శైలితో పాటు, సంగీత దర్శకుడు కోటి అందించిన స్వరాలు యువతనే కాదు, అన్ని వర్గాల ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకున్నాయి. ఉషాకిరణ్ మూవీస్ నిర్మించిన ఈ చిత్రం.. 20 వసంతాలు(అక్టోబరు 13)న పూర్తి చేసుకోబోతోంది. ఈ సందర్భంగా హీరో తరుణ్ చిత్రవిశేషాలను పంచుకున్నారు.
'నువ్వే కావాలి' సినిమా వచ్చి అప్పుడే 20 ఏళ్లు పూర్తయ్యాయంటే నమ్మలేకపోతున్నాను. చిటికెలో ఇన్నేళ్లు గడిచిపోయాయి. ఎంతో ఆనందంగా ఉంది. అప్పటివరకు 20-30 సినిమాల్లో బాలనటుడిగా చేశాను. ఆ తర్వాత సినిమాలు చేయాలని అనుకోలేదు. ఇంటర్ చదివేటప్పుడు రాజీవ్ మేనన్ చేసిన యాడ్లో సరదాగా నటించాను. అందులో నాతో పాటు రిచా కూడా నటించింది. అది చూసి 'నువ్వే కావాలి' సినిమా కోసం నన్ను రిచాను ఎంచుకున్నారు. అలా ఈ సినిమా చేశాం. నిర్మాత రామోజీరావు, స్రవంతి రవికిశోర్, దర్శకుడు విజయ్ భాస్కర్, త్రివిక్రమ్, హీరోయిన్ రిచాలకు ధన్యవాదాలు. మరో విశేషమేమిటంటే నన్ను బాలనటుడిగా 'మనసు మమత' ద్వారా తెలుగు ప్రేక్షకులకు పరిచయం చేసింది ఉషాకిరణ్ మూవీస్. ఈ సంస్థతో నాకు ఎంతో చక్కని అనుబంధం ఉంది. మరోసారి చిత్రబృందానికి నా ధన్యావాదాలు" అని మనసులో మాటలను పంచుకున్నారు తరుణ్.