నటించిన మూడు సినిమాలు వరుసగా ఫ్లాప్ కావడం వల్ల కెరీర్ విషయంలో కొన్నిసార్లు బాధపడ్డానని అంటున్నాడు హీరో నితిన్. ప్రస్తుతం అతడు నటించిన చిత్రం 'భీష్మ'. వెంకీ కుడుముల దర్శకుడు. రష్మిక హీరోయిన్. రేపు(శుక్రవారం) ప్రేక్షకుల ముందుకు రానుందీ సినిమా. ఈ నేపథ్యంలో విలేకర్లతో ముచ్చటించాడు నితిన్. ఆ విశేషాలివే..
నాలుగేళ్లు ఆలస్యం
షాలిని నేను ఒక కామన్ ఫ్రెండ్ వల్ల 2012లో కలుసుకున్నాం. ఆ తర్వాత మేమిద్దరం మంచి స్నేహితులమయ్యాం. ఒకరోజు అనుకోకుండా తనకు నేనే మొదట ప్రపోజ్ చేశాను. తనూ వెంటనే ఓకే చెప్పేసింది. అలా కొన్ని సంవత్సరాల ప్రేమ తర్వాత గతేడాది మా ఇద్దరి ఇళ్లలో విషయం చెప్పాం. పెద్దవాళ్లు వెంటనే ఒప్పుకున్నారు. ఏప్రిల్ 15న నిశ్చితార్థం, ఏప్రిల్ 16న వివాహం చేసుకోనున్నాం. ఇరు కుటుంబ పెద్దలు, సన్నిహితుల సమక్షంలో దుబాయ్‌లో వివాహం జరగనుంది. ఏప్రిల్ 21న హైదరాబాద్‌లో రిసెప్షన్ ఉంటుంది. నిజం చెప్పాలంటే నాలుగేళ్లు ఆలస్యంగా నేను పెళ్లి చేసుకుంటున్నా. ఎందుకంటే ప్రతి ఒక్కరి జీవితంలో పెళ్లి అనేది ఒక పెద్ద అంశం. మానసికంగా సిద్ధం కావడానికి నాకు ఇంత సమయం పట్టింది.
అప్పుడే చెప్పాడు
'శ్రీనివాస కళ్యాణం' షూటింగ్‌లో వెంకీ కుడుముల నన్ను మొదటిసారి కలిశాడు. అప్పుడే నాకు 'భీష్మ' కథకు సంబంధించిన మెయిన్ లైన్ చెప్పాడు. ఆ లైన్‌ను డెవలప్ చేయడానికి చాలా టైం పట్టింది. అలా ఈ ఏడాది ఆరంభంలో 'భీష్మ' విడుదల అవుతుంది. 'అంధాధున్' రీమేక్, 'రంగ్‌దే'తోపాటు మరో సినిమా ఈ ఏడాదిలోనే విడుదల కానుంది. ఈ ఏడాది నాకు చాలా ప్రత్యేకమనే చెప్పాలి.
ప్రేమకథ వద్దనుకున్నా
లవ్‌స్టోరీలను వరుసగా చేయడం వల్ల బోర్ కొట్టలేదు. ఎందుకంటే వేటికవే విభిన్న కథలు. కాకపోతే లవ్‌స్టోరీలు చేయకూడదని మాత్రం అనుకున్నాను. అందుకే ఈసారి కొంచెం విభిన్నమైన కథల్లో నటించాలనుకుంటున్నా. అలా 'అంధాధున్' రీమేక్‌లో నటించనున్నా. లవ్‌స్టోరీ వద్దనుకుంటూనే 'రంగ్‌దే' కథ విన్నా. బాగా నచ్చింది. లైఫ్‌లో తప్పకుండా అలాంటి పాత్ర చేయాలనుకున్నాను అందుకే ఆ సినిమాకు ఓకే చెప్పేశాను.
కెరీర్ విషయంలో కొంచెం బాధపడ్డా
నా కెరీర్‌ను చూసుకున్నప్పుడు కొన్ని విషయాల్లో బాధపడ్డాను. నా గత మూడు సినిమాలు పరాజయం పాలయ్యాయి. అందుకే కథల ఎంపికలో చాలా జాగ్రత్తలు తీసుకోవాలని నిర్ణయించుకున్నా. ఈ కారణంతోనే గతేడాది విరామం తీసుకున్నాను. ఇక నుంచి సినిమాల విషయంలో తగిన జాగ్రత్తలు పాటించాలనుకుంటున్నాను.
'లై' ఆడుతుందనుకున్నా
నేను చివరిగా నటించిన మూడు సినిమాలు ఫ్లాప్ అయ్యాయి. అయితే 'లై' సినిమా మాత్రం విజయం సాధిస్తుందని నమ్మాను. కాకపోతే అది ఆదరణ దక్కించుకోలేకపోయింది. 'ఛల్ మోహన్‌రంగా' చిత్రంపై నాకు అంత నమ్మకం లేదు. 'శ్రీనివాస కల్యాణం' కథ నాకు బాగా నచ్చింది. కాకపోతే అలాంటి కాన్సెప్ట్‌ను ప్రేక్షకులు ఓకే చేస్తారా అని సందేహం ఉండేది.
అదొక సవాలు
'అంధాధున్' రీమేక్ షూటింగ్ జూన్ నుంచి ప్రారంభం కానుంది. మేర్లపాక గాంధీ దర్శకత్వం వహించనున్నాడు. 'అంధాధూన్' ఓ క్లాసిక్ మూవీ. అలాంటి సినిమాను రీమేక్ చేయడాన్ని ఒక ఛాలెంజ్‌గా తీసుకున్నాను.
మంచి కథ వస్తే చేస్తా
బాలీవుడ్‌లో చాలా మంది నటీనటులు వెబ్ సిరీస్‌లు చేస్తున్నారు. నాకూ వెబ్ సిరీస్‌లలో నటించాలని ఇష్టం ఉంది. ఓ మంచి కథ వస్తే తప్పకుండా నటిస్తాను.
'అతడు' సినిమా
ఈ సినిమాలోని ఒక ఫైట్ సీక్వెన్స్ త్రివిక్రమ్‌కు బాగా నచ్చిందని చెప్పారు. 'అతడు' ఫైట్‌లా ఉందని అన్నారు. నిజం చెప్పాలంటే మేం 'అతడు' సినిమాలోని ఫైట్‌నే స్ఫూర్తిగా తీసుకుని ఆ సన్నివేశాల్ని తీశాం.
'శ్రీనివాస కళ్యాణం'తో
'శ్రీనివాస కళ్యాణం' షూటింగ్ సమయంలోనే నాకు పెళ్లంటే ఏంటో తెలిసింది. పెళ్లంటే ఇంత ఉంటుందా అని మొన్న మా ఇంట్లో పెళ్లి పనులు ప్రారంభించినప్పుడే నాకు అర్థమైంది.
- " class="align-text-top noRightClick twitterSection" data="">