కరోనా కల్లోలం కారణంగా యువ హీరో నిఖిల్ వివాహం మరోసారి వాయిదా పడింది. వైద్యురాలు పల్లవి వర్మతో గత కొంతకాలంగా ప్రేమలో ఉన్న ఈ కథానాయకుడు.. పెద్దల అంగీకారంతో ఇటీవల నిశ్చితార్థం చేసుకున్నాడు. అయితే వీరి వివాహం ఏప్రిల్ 16న జరగాల్సి ఉండగా.. లాక్‌డౌన్ కారణంగా వాయిదా పడింది. దీంతో ఇరు కుటుంబాల పెద్దలు మే 14న వివాహం చేయాలని నిర్ణయించారు. ఇటీవల లాక్‌డౌన్‌ను మే 17 వరకూ పొడిగిస్తున్నట్లు ప్రకటించడం వల్ల మరోసారి ఈ ఈవెంట్ వాయిదా పడింది.
![nikhil with pallavi](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/7045762_nikhil-1.jpg)
'మొదట్లో ఏప్రిల్ 16న వివాహం జరిపించాలని మా పెద్దలు నిర్ణయించారు. లాక్‌డౌన్ కారణంగా అది మే 14కు మారింది. ఇప్పుడు లాక్‌డౌన్ మళ్లీ పెరగడం వల్ల నిరాశకు గురయ్యాను. నా పెళ్లి వల్ల ఏ ఒక్కరికీ ఇబ్బంది వచ్చినా, సంతోషంగా ఉండలేను. వివాహం అనేది ప్రతి ఒక్కరి జీవితంలో ఓ మధురమైన జ్ఞాపకం. కాబట్టి అది మంచిగానే ఉండాలని ఆశిస్తున్నాను. క్లిష్ట పరిస్థితుల్లో పెళ్లి చేసుకోవడం అనేది సరికాదని అనుకుంటున్నాను. కరోనా నియంత్రణలోకి వచ్చాక ఘనంగా పెళ్లి చేసుకుంటాను' -నిఖిల్, యువ కథానాయకుడు