Radhe Shyam Movie Story: పునర్జన్మ.. అంతుచిక్కని రహస్యం. మళ్లీ పుడతామో లేదో ఎవరికీ తెలియదు. కానీ, ఒక జన్మలో దక్కించుకోలేని ప్రేమను, మరో జన్మలో పొందడానికి చేసే ప్రయత్నం.. ఊహాను మరో స్థాయికి తీసుకెళ్తుంది. "కమ్ముకుంటున్న ఈ కారు చీకట్లు.. నిన్ను మింగేశాయని విర్రవీగుతున్నాయిరా.. భైరవా.. ఏదో ఒక రోజు ఓడిపోయిన నీ ప్రేమను గెలిపించుకోవడానికి.. ఈ చీకటి కడుపును చీల్చుకుంటూ మళ్లీ పుడతావ్ రా భైరవా" అనే డైలాగ్ వినగానే ప్రేక్షకుడి రోమాలు నిక్కబొడుచుకుంటాయి.
'మళ్లీ పుడతావు' అనగానే ఏదో తెలియని 'ఆశ'.. 'నమ్మకం' కలుగుతాయి. అంతటి శక్తి ఉంది పునర్జన్మలో. అందుకే ఈ నేపథ్యంలో వచ్చే సినిమాలకు ఓ ప్రత్యేకత ఉంటుంది. కథనం ఎంత ఆసక్తికరంగా ఉంటే.. సినిమా అంత గొప్ప అనుభూతినిస్తుంది.
'మగధీర', 'ఈగ', 'అరుంధతి', 'మనం' సహా అప్పట్లో అక్కినేని 'మూగమనసులు', సూపర్‌స్టార్ కృష్ణ 'జన్మజన్మల బంధం'.. ఈ నాటికీ మదిలో చెరగని ముద్రవేయడానికి.. పునర్జన్మ కాన్సెప్ట్‌లోని మ్యాజిక్కే కారణం. ఈ జాబితాలో సరికొత్తగా.. ప్రభాస్, పూజా హెగ్డేల 'రాధే శ్యామ్' (Radhe Shyam Movie) కూడా చేరే అవకాశం ఉంది. ఈ చిత్రం కోసం అభిమానులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ఈ నేపథ్యంలో పునర్జన్మల నేపథ్యంలో తెరకెక్కి ప్రేక్షకుడికి మరచిపోలేని అనుభూతిని మిగిల్చిన సినిమాలపై ఓ లుక్కేయండి.
మూగమనసులు..
ఆదుర్తి సుబ్బారావు దర్శకత్వంలో అక్కినేని నాగేశ్వరరావు, సావిత్రి, జమున కాంబినేషన్లో వచ్చిన ఆల్‌టైమ్ క్లాసిక్ 'మూగ మనసులు'. ఒక జన్మలో ఆస్తులు-అంతస్థుల కారణంగా విడిపోయి మరో జన్మలో కలుసుకోవడమే ఈ సినిమా కథాంశం. ఇప్పటికీ ఈ మూవీ చూస్తే మంచి అనుభూతినిస్తుంది. ఇక ఈ చిత్రంలోని అన్ని పాటలు ఇప్పటికీ యూత్‌ను ఆకట్టుకుంటాయి.
ఇదే కథ ఆధారంగా నాగార్జున, విజయశాంతితో 'జానకి రాముడు' తీసి మంచి సక్సెస్ అందుకున్నారు దర్శకేంద్రుడు రాఘవేంద్రరావు.
దేవదాసు మళ్లీ పుట్టాడు..
అక్కినేని, వాణిశ్రీతో పునర్జన్మల కాన్సెప్ట్ ఆధారంగానే 'దేవదాసు మళ్లీ పుట్టాడు' చేశారు దాసరి నారాయణరావు. ఆ తర్వాత మంజుల కాంబినేషన్లో వచ్చిన 'బంగారు బొమ్మలు' కూడా మళ్లీ పుట్టడం అంశం ఆధారంగా వచ్చిందే.
జన్మజన్మల బంధం..
కృష్ణ, వాణి శ్రీ జోడిగా 'జన్మజన్మల బంధం' సినిమా కూడా పునర్జన్మల నేపథ్యంలోనే వచ్చింది. ఈ సినిమా బ్లాక్‌బస్టర్‌గా నిలిచింది.
ఆత్మబలం..
బాలకృష్ణ, సిల్క్‌స్మిత ప్రధాన పాత్రల్లో వచ్చిన 'ఆత్మబలం'.. ఆశించిన ఫలితాన్ని ఇవ్వలేదు.
సుభాష్ చంద్రబోస్..
ఆ తర్వాత చాలా ఏళ్లకు రాఘవేంద్రరావు దర్శకత్వంలో విక్టరీ వెంకటేశ్ హీరోగా శ్రియ, జెనీలియాలో హీరోయిన్లుగా 'సుభాష్ చంద్రబోస్' తెరకెక్కింది. స్వాతంత్య్ర సంగ్రామం నేపథ్యంలో పునర్జన్మల ఆధారంగా దీనిని రూపొందించారు. ఆ సినిమా అంతగా ఆకట్టుకోలేదు.
అరుంధతి..
2009లో వచ్చిన..'అరుంధతి' (Arundhati) ఒక సంచలనం. కోడి రామకృష్ణ దర్శకత్వంలో అనుష్క ప్రధాన పాత్రలో వచ్చిన ఈ సినిమా హిస్టరీ క్రియేట్ చేసింది. ఈ మూవీ చిన్న పిల్లల నుంచి పెద్దల దాకా అందరినీ ఆకట్టుకుంది.
మగధీర..
Magadheera Story: ఇక అదే ఏడాది వచ్చిన 'మగధీర'.. ఇండస్ట్రీ రికార్డులను బ్రేక్ చేసింది. రామ్ చరణ్, కాజల్ కాంబినేషన్లో దర్శకధీరుడు రాజమౌళి తెరకెక్కించిన ఈ చిత్రం.. ప్రేక్షకుడికి సరికొత్త అనుభూతిని పంచింది. 400 ఏళ్ల తర్వాత జన్మించడం, 100 మందిని చంపడం, పాటలు, డైలాగులు.. ఒక్కటేమిటి.. సినిమాలోని అన్ని విభాగాలు ప్రేక్షకులను మరోస్థాయిలో ఆకట్టుకున్నాయి.
ఆ తర్వాత రాజమౌళి దర్శకత్వంలోనే వచ్చిన 'ఈగ' కూడా సంచలనం సృష్టించింది. స్టార్ హీరోలు లేకున్నా.. గ్రాఫిక్స్ మాయాజాలం, కథాబలంతో బ్లాక్‌బస్టర్‌గా నిలిచింది.
మనం..
Manam Story: మనం.. సినిమా ఒక ప్రత్యేకమైన అనుభూతినిస్తుంది. అక్కినేని కుటుంబంలోని మూడు తరాల హీరోలు కలిసి నటించడం, నాగేశ్వరరావుకి ఆఖరి చిత్రం కావడం విశేషం. ఇక ఈ సినిమా కథ, పాటలు అందరినీ అలరించాయి.
విజయ్ ఆంటోనీ 'బేతాళుడు', పూరీ జగన్నాథ్ దర్శకత్వంలో ఆయన కుమారుడు హీరోగా వచ్చిన 'మెహబూబా' కూడా పునర్జన్మల నేపథ్యంలో వచ్చినవే. ఈ మధ్య కాలంలో యాంకర్ ప్రదీప్ ప్రధాన పాత్రలో వచ్చిన కామెడీ ఎంటర్టైనర్ '30రోజుల్లో ప్రేమించడం ఎలా' కూడా ఈ జాబితాలోకి వచ్చే చిత్రమే. కానీ ఇది అంతగా ఆకట్టుకోలేకపోయింది.
తెలుగులోనే కాక హిందీలోనూ పునర్జన్మల ఆధారంగా ఎన్నో మధురమైన సినిమాలు వచ్చాయి. వాటిలో కొన్ని..
- మధుబాల ప్రధాన పాత్రలో వచ్చిన 'మహల్'
- దిలీప్ కుమార్, వైజయంతి మాల కాంబినేషన్లో వచ్చిన 'మధుమతి' ఒక క్లాసిక్
- 1967లో తెలుగు 'మూగ మనసులు' రీమేక్‌గా వచ్చిన 'మిలన్' అక్కడా సూపర్ హిట్ అయింది సునీల్ దత్, నూతన్, జమున ప్రధాన పాత్రల్లో నటించారు.
- వహీదా రెహమాన్, రాజ్‌కుమార్‌ల 'నీల్ కమల్'
- శతృఘ్న సిన్హా, గీతారాయ్ల 'మిలాప్'
- రాజేశ్ ఖన్నా, హేమా మాలినిల 'మెహబూబా' కూడా ఎవర్గ్రీన్.
- రిషీ కపూర్ 'కర్జ్'
- 1995లో సల్మాన్, షారుక్ ప్రధాన పాత్రల్లో వచ్చిన 'కరన్ అర్జున్' సూపర్ హిట్టయింది.
- షారుక్, దీపికల కాంబినేషన్లో వచ్చిన 'ఓం శాంతి ఓం' సెన్సేషన్ క్రియేట్ చేసింది.
- 'మగధీర'కు ఫ్రీమేక్‌గా దివంగత సుశాంత్ సింగ్ రాజ్‌పుత్, కృతిసనన్ ప్రధానపాత్రలో వచ్చిన 'రాబ్తా' ఈ జాబితాలోకే వస్తుంది.
ఇలా చాలా సినిమాలు పునర్జన్మల నేపథ్యంలో వచ్చాయి. మరి ఎన్నో అంచనాల మధ్య వస్తున్న 'రాధే శ్యామ్' కూడా ఓ క్లాసిగ్గా మిగిలిపోతుందో లేదా చూడాలి. సంక్రాతి కానుకగా జనవరి 14న (Radhe Shyam Release Date) ఈ సినిమా ప్రేక్షకుల ముందుకురానుంది.
ఇవీ చూడండి:
Radhe shyam song: 'రాధేశ్యామ్' రెండో పాట అప్డేట్