93వ ఆస్కార్ వేడుకలకు చరిత్రలో ప్రత్యేకమైన పేజీ ఉండాల్సిందే. కరోనా మహమ్మారి ప్రపంచాన్నంతా స్తంభింపజేసినా, థియేటర్లు వెలవెలబోయినా.. ఈసారి అన్ని విభాగాల్లోనూ గట్టి పోటీ ఉంది. ఉత్తమ దర్శకత్వ విభాగంలో ఇది మరింత హోరాహోరీగా మారింది. ఎన్నడూ లేనివిధంగా ఇద్దరు మహిళా దర్శకులు ఈసారి పోటీలో ఉండటం విశేషం. క్లోయూ జావ్, ఎమెరాల్డ్ ఫెన్నెల్‌లతో పాటు డేవిడ్ ఫించర్, లీ ఐసాక్ చంగ్, థామస్ వింటెబర్గ్‌లు ఆస్కార్ అందుకోడానికి అడుగుదూరంలో ఉన్నారు. ఆ దర్శకుల విశేషాలు చూద్దాం..
‘నోమ్యాడ్‌ల్యాండ్’తో క్లోయీ జావ్, ‘ప్రామిసింగ్ యంగ్ వుమన్’తో ఎమెరాల్డ్ ఫెన్నెల్ ఉత్తమ దర్శకత్వ విభాగంలో పోటీలో ఉన్నారు. వీరిలో ఎవరు ఆ పసిడి ప్రతిమను ముద్దాడిన చరిత్రలో నిలిచిపోతారు. వీరికన్నా ముందు ఈ 93 ఏళ్లలో ఐదుగురు మహిళలే ఈ విభాగానికి నామినేట్ అయ్యారు. 2010లో ది హర్ట్ లాకర్ చిత్రానికిగానూ క్యాథరిన్ బిగెలోను మాత్రమే ఆస్కార్ వరించింది.
హాలీవుడ్ స్వర్ణయుగ పున:సృష్టికర్త
‘ఫైట్ క్లబ్’, ‘గేమ్’, ‘సెవెన్’ లాంటి క్లాసిక్ సినిమాలు తీసిన దర్శకుడు డేవిడ్ ఫించర్. ఆయన సినిమాలకు హాలీవుడ్‌లో ప్రత్యేక అభిమాన గణముంది. ‘ఏలియన్3’తో సినీ రంగంలోకి అడుగుపెట్టిన ఫించర్ మూడు సార్లు ఉత్తమ దర్శకుడిగా ఆస్కార్‌కు నామినేట్ అయ్యారు. ఈ ఏడాది ‘మ్యాంక్’తో పోటీలో ఉన్న ఈయన గతంలో ‘ది సోషల్ నెట్‌వర్క్’(2009), ‘క్యూరియస్ కేస్ ఆఫ్ బెంజమిన్ బటన్’(2008) సినిమాలకు ఉత్తమ దర్శకత్వం విభాగంలో నామినేట్ అయ్యారు. ఆ రెండు సార్లు ఆయనకు నిరాశే ఎదురైంది. హాలీవుడ్‌కు స్వర్ణయుగం లాంటి కాలాన్ని ‘మ్యాంక్’ సినిమాలో అవిష్కరించాడు డేవిడ్ ఫించర్. సిటిజన్ కేన్‌కి కథ, స్క్రీన్‌ప్లే అందించిన రచయిత హెర్మన్ మ్యాంకివిజ్ జీవితం ఆధారంగానే ఈ సినిమా రూపొందింది. దర్శకుడు తండ్రి జాక్ ఫించర్ కథ అందించారు. ఆయన మరణానంతరం డేవిడ్ ఫించర్ దీన్ని గతేడాది తెరకెక్కించారు. ఉత్తమ దర్శకుడు, చిత్రం, నటుడు ఇలా మొత్తం 10 విభాగాల్లో ‘మ్యాంక్’ పోటీ పడుతోంది.
తొలి ఆసియన్- అమెరికన్ దర్శకురాలు
అమెరికాలోని సంచార జీవితాన్ని ఆవిష్కరిస్తూ ప్రేక్షకులకు సరికొత్త అనుభూతిని కలిగించారు చైనీస్ ఫిల్మ్‌మేకర్ క్లోయూ జావ్. ‘సాంగ్స్ మై బ్రదర్స్ టాట్ మి’, ‘ది రైడర్’తో అంతర్జాతీయంగా ప్రశంసలు దక్కించుకున్న ఆమె ‘నోమ్యాడ్‌ల్యాండ్’తో ఉత్తమ దర్శకత్వ విభాగంలో పోటీలో ఉంది. జెస్సికా బ్రూడర్ రాసిన నోమ్యాడ్‌ల్యాండ్: సర్వైవింగ్ అమెరికా ఇన్ ట్వంటీ ఫస్ట్ సెంచరీ అనే పుస్తకం ఆధారంగా తెరకెక్కింది. ఈమెను ఆస్కార్ వరిస్తే ఆ ఘనత సాధించిన తొలి ఆసియన్ మహిళా దర్శకురాలిగా చరిత్రలో మిగిలిపోతుంది.
క్లోయీ జావ్ బీజింగ్‌లో పుట్టింది. తండ్రి చైనాలో ప్రముఖ పారిశ్రామికవేత్త. సినిమాలంటే చిన్నతనం నుంచే ఆసక్తి. చైనీస్ దర్శకుడు వాంగ్ కార్ వై చిత్రాలను ఇష్టపడేది. చదువుకోసం బ్రిటన్, అక్కడి నుంచి అమెరికాకు వెళ్లింది. ఇక్కడే సినిమా తీయాలని ఆలోచన బలపడింది. న్యూయర్క్‌లో ఫిల్మ్ ప్రొడక్షన్ కోర్సు కూడా చేసింది. ‘సాంగ్స్ ఆఫ్ మై బ్రదర్స్ టాట్ మీ’ చిత్రంతో ఆరంగేట్రం చేసిన ఆమె ఇండిపెండెంట్ ఫిల్మ్ మేకర్‌గా మంచి పేరు సంపాదించింది.
కూతురి మరణాన్ని దిగమింగి..
‘అనదర్ రౌండ్’తో అకాడమీ అవార్డు రేసులో ఉన్నారు డానిష్ డైరెక్టర్ థామస్ వింటెబెర్గ్. జేమ్స్‌బాండ్ విలన్ మ్యాడ్స్ మికెల్సన్ ఇందులో నటించారు. ఈ దర్శకనటుల ద్వయం మొదట చేసిన ‘ది హంట్’ చిత్రానికీ పలు వేదికలపై ప్రశంసలు దక్కాయి. ‘అనదర్ రౌండ్’ చిత్రం రెండు విభాగాల్లో పోటీ పడుతోంది. నలుగురు ఉపాధ్యాయులు రోజు పనివేళల్లో కొంత మద్యం తాగితే వృత్తి, వ్యక్తిగతంగా ఎలాంటి ప్రభావం ఉంటుందో తెలుసుకోవాలని అనుకుంటారు. ఈ ప్రయోగం ఎటు దారితీసిందనేది మిగతా కథ. సినిమా చిత్రీకరణ ప్రారంభమైన నాలుగురోజులకే దర్శకుడి ముద్దుల కూతురు రోడ్డు ప్రమాదంలో చనిపోయింది. ఆ బాధను దిగమింగి సినిమాను పూర్తిచేశాడాయన. ఇప్పుడు ఆస్కార్‌ను ముద్దాడేందుకు అడుగు దూరంలో ఉన్నాడు.
వలస జీవితాల ఆత్మావిష్కరణ
అమెరికాకు వలసవెళ్లిన ఓ కొరియన్ కుటుంబం జీవన పోరాటాన్ని కవితాత్మకంగా తెరకెక్కించాడు అమెరికన్ దర్శకుడు లీ ఐసాక్ చంగ్. గతేడాది తీసిన ‘మినారి’తో ఇప్పటికే అవార్డులు, ప్రశంసల్లో మునిగితేలుతున్నాడీ దర్శకుడు. ఈయన తల్లిదండ్రులు దక్షిణ కొరియాకు చెందినవారు. అక్కడ నుంచి మెరుగైన జీవితం కోసం వలసవచ్చే కొరియన్లలాగే వారూ అట్లాంటాకు వలసొచ్చారు. లీ పుట్టి పెరిగిందంతా అమెరికాలోనే. తను బాల్యంలోనే అక్కడినుంచి అర్కన్సస్‌కు వచ్చారు. అక్కడ వారి కుటుంబం సాగించిన జీవనపోరాటం స్ఫూర్తిగానే ‘మినారి’ని తెరకెక్కించాడు దర్శకుడు. లక్కీ లైఫ్(2010), అబిగైల్ హర్మ్(2012)లను తెరకెక్కించిన ఆయనకు ‘మినారి’తో మంచి గుర్తింపు దక్కింది.
మొదటి చిత్రంతోనే..
బ్రిటన్‌కు చెందిన నటి, రచయిత అయిన ఎమెరాల్డ్ ఫెన్నెల్ తెరకెక్కించిన ‘ప్రామిసింగ్ యంగ్ వుమన్’ చిత్రానికి గానూ పోటీలో ఉన్నారు. స్నేహితురాలి మరణానికి ప్రతిగా క్యాసి అనే యువతి ఎలా ప్రతీకారం తీర్చుకుందనే కథాంశంతో ఇది తెరకెక్కింది. ఆమె తెరకెక్కించిన విధానం, స్క్రీన్‌ప్లే, ఎంచుకున్న కథాంశాలకు సర్వత్రా ప్రశంసలు కురుస్తున్నాయి. ఎమెరాల్డ్ దర్శకురాలిగా కంటే ముందే నటిగా సినీ ప్రపంచానికి పరిచయం. అల్బర్ట్ నోబ్స్(2011), అన్నా కరెనినా(2012), ది డానిష్ గర్ల్ లాంటి చిత్రాల్లో నటించారామె. ‘కాల్ ది మిడ్‌వైఫ్ వెబ్ సిరీస్ ద్వారా అంతర్జాతీయంగా గుర్తింపు పొందారు. ఆమె మెగాఫోన్ పట్టి తెరకెక్కించిన తొలిసారే ఆస్కార్ బరిలో ఉండటం విశేషం.
*ఏడెళ్ల వయసులో నువ్వు ఏమవుతావని వాళ్లమ్మ అడిగినప్పుడు ‘‘హత్యలు, నేరాల చుట్టూ తిరిగే కథలు రాస్తా. అమెరికాలో నటిగా స్థిరపడతా’’ అని సమాధానం ఇచ్చారట¨ ఎమెరల్డ్ ఫెన్నెల్. అనుకున్నట్లుగానే ముందుగా నటిగా నిరూపించుకుందీమె.