సూపర్‌స్టార్ రజనీకాంత్ కథానాయకుడిగా శంకర్ దర్శకత్వంలో తెరకెక్కిన బ్లాక్‌బస్టర్ మూవీ 'రోబో'. చిట్టి రోబోగా రజనీ నటన ప్రేక్షకులను కట్టిపడేసింది. 2010లో వచ్చిన ఈ చిత్రం ఎంతటి ఘన విజయాన్ని సొంతం చేసుకుందో అందరికీ తెలిసిందే. 90వ దశకంలోనే ఈ చిత్రం రావాల్సి ఉంది. తొలుత పలువురు హీరోలను అనుకున్నా చివరికి ఈ చిత్రం రజనీతో కుదిరింది.
లోకనాయకుడితో..
అయితే మొదట ఇందులో కథానాయకుడిగా కమల్‌హాసన్‌ను అనుకున్నారు. కథానాయికగా ప్రీతి జింటాను కూడా తీసుకున్నారు. 1998లోనే ఇందుకు సంబంధించిన ఫొటో షూట్ చేశారు. అయితే, ఆ తర్వాత ఈ ప్రాజెక్టు రద్దయింది. శంకర్‌కు ఉన్న విజన్ ప్రకారం అప్పటికి ఆ స్థాయి టెక్నాలజీ అందుబాటులో లేదు. పైగా కమల్‌హాసన్ కూడా వేరే చిత్రాల్లో బిజీగా ఉండటం వల్ల సినిమా ముందుకు సాగలేదు.
తప్పుకొన్న బాలీవుడ్ హీరోలు..
ఆ తర్వాత కొన్నాళ్లకు మళ్లీ శంకర్ 'రోబో'ను తెరకెక్కించేందుకు ప్రయత్నించారు. ఇందులో భాగంగా ఆమిర్‌ఖాన్‌ను కలవగా అప్పటికే ఒప్పుకొన్న చిత్రాల కారణంగా ఆయన ఈ సినిమా చేసేందుకు అంగీకరించలేదు. ఆ తర్వాత బంతి షారుక్ కోర్టులోకి వెళ్లింది. కథానాయికగా ప్రియాంకా చోప్రాను కూడా అనుకున్నారు. కానీ శంకర్ సినిమా ఆలస్యమవుతుందన్న కారణంతో షారుక్ కూడా ఆ తర్వాత తన నిర్ణయాన్ని మార్చుకున్నారు.
ఎట్టకేలకు రజనీని కలిశారు శంకర్. ఆయనకూ కథ నచ్చినందువల్ల 'రోబో' ప్రేక్షకుల ముందుకు వచ్చాడు.
ఇదీ చూడండి: 'ఈ పాట సైనికులకు, వారి భాగస్వాములకు అంకితం'