నిర్మాతగా, దర్శకుడిగా, స్క్రీన్‌ప్లే రచయితగా పేరు తెచ్చుకున్న కేసీ బొకాడియా... త్వరలో మరో విభిన్న కథాంశంతో ప్రేక్షకుల ముందుకు రానున్నాడు. తాజాగా ఆయన తెరకెక్కించిన 'నమస్తే నేస్తమా' జనవరి 3న విడుదల కానుంది. ఈ సందర్భంగా ఆదివారం మీడియాతో మాట్లాడాడు. ఇక నుంచి తెలుగులో ఏడాదికి రెండు లేదా మూడు చిత్రాలు చేస్తానని చెప్పాడు.
అగ్ర కథానాయకులతో...
హిందీలో అమితాబ్ బచ్చన్, రజనీకాంత్, షారుఖ్‌ఖాన్, సల్మాన్‌ఖాన్, అక్షయ్‌కుమార్, అజయ్ దేవగణ్, సన్నీ దేవోల్ లాంటి అగ్ర కథానాయకులతో చిత్రాలు నిర్మించాడు బొకాడియా. గతంలో ఆయన హిందీలో నిర్మించిన 'తేరీ మెహర్బానియా' చిత్రానికి రెండో భాగంగా... స్వీయ దర్శకత్వంలో 'నమస్తే నేస్తమా' తెరకెక్కింది. ఇందులో రెండు కుక్కలు కీలక పాత్రలు పోషించాయి. ఈషానియ మహేశ్వరి, నాజర్, బ్రహ్మానందం, సాయాజీ షిండే, తాగుబోతు రమేష్, చమ్మక్ చంద్ర తదితరులు నటించారు. శ్రీరామ్ అతిథి పాత్ర పోషించాడు.
"తెలుగులో నేను తెరకెక్కించిన తొలి చిత్రమిది. చిన్నప్పుడే విడిపోయిన రెండు కుక్క పిల్లల కథాంశంగా రూపొందింది. ఒకటి పోలీసుల దగ్గర, మరొకటి దొంగల దగ్గర పెరుగుతుంది. ఇంతలో ఒక పోలీస్ అధికారి హత్యకి గురవుతాడు. ఆ పాత్రలో శ్రీరామ్ నటించాడు. ఆ పోలీస్‌ను చంపినవాళ్ల మీద రెండు కుక్కలు ఎలా పగతీర్చుకున్నాయి..? మళ్లీ ఎలా కలుసుకున్నాయి..? అనేదే ఆద్యంతం ఆసక్తిగా ఉంటుంది. కుక్కలతో చిత్రీకరణ చేయడం చాలా కష్టం. అయినా వంద రోజులపాటు ఎన్నో వ్యయప్రయాసలకోర్చి వాటితో చిత్రీకరణ పూర్తి చేశాం. బప్పీలహరి, చరణ్ అర్జున్ సమకూర్చిన పాటలు చిత్రానికి ప్రధానబలం"
- కేసీ బొకాడియా, దర్శకుడు
ఇదో కొత్త ప్రయాణం...
నిర్మాతగా, దర్శకుడిగా, స్క్రీన్‌ప్లే రచయితగా ఈ ప్రయాణం ఎంతో సంతృప్తిని ఇచ్చిందని చెప్పాడు కేసీ బొకాడియా. మధ్యలో విరామం వచ్చినా... మళ్లీ తెలుగు సినిమాతో ప్రయాణం రీఎంట్రీ ఇవ్వడంపై ఆనందం వ్యక్తం చేశాడు.
"రాజస్థాన్‌లోని చిన్న గ్రామం మాది. అప్పటికి బొంబాయిలోని చిత్రసీమలో పోటీ ఎక్కువగా ఉండేది. దాన్ని తట్టుకుని 1972లో సంజీవ్ కుమార్‌తో 'రివాజ్' నిర్మించా. దర్శకుడిగా నా తొలి సినిమానే అమితాబ్ బచ్చన్ కథానాయకుడిగా రూపొందించాను. నాకు సన్నిహితుడైన రజనీకాంత్‌తోనూ హిందీలో పలు చిత్రాల్ని తీశాను. మళ్లీ తెలుగు సినిమాతో రీఎంట్రీ ఇవ్వడం ఆనందంగా ఉంది"
- కేసీ బొకాడియా, దర్శకుడు
ఈ సమావేశంలో 'నమస్తే నేస్తమా' సమర్పకులు గౌతమ్ చంద్ రాఠోడ్, రాజ్‌కుమార్ బొకాడియా తదితరులు పాల్గొన్నారు.