కుటుంబం పేరు చెప్పుకొని చిత్ర పరిశ్రమకు రావడం సులభమే.. కానీ, స్టార్‌గా నిలదొక్కుకోవడం చాలా కష్టం. ఓర్పు, శ్రమ, పట్టుదల ఉంటే తప్ప ప్రేక్షకుల ఆదరణ దక్కదు. ఇలా కుటుంబ నేపథ్యంతో పరిశ్రమకు వచ్చినప్పటికీ.. శ్రమతో వెండితెరపై తమదైన ముద్ర వేస్తున్నారు కొందరు ముద్దుగుమ్మలు. చక్కటి అభినయం, అందంతో ప్రేక్షకులకు దగ్గరకావడానికి ప్రయత్నిస్తున్నారు.
ఇప్పటికే శ్రుతి హాసన్, కరీనా కపూర్, ఆలియా భట్, సోనమ్ కపూర్ వంటి తారామణులు... ఇదే తరహాలో వచ్చి నటనతో తమదైన ముద్రవేశారు. ఇటీవల కాలంలో మరికొంతమంది వారసురాళ్లు చిత్రరంగంలో అడుగుపెట్టారు. నటీమణులుగా అదృష్టాన్ని పరీక్షించుకోవడానికి సిద్ధమౌతున్నారు. ఇలా సినీ నేపథ్యం ఉన్న హీరోయిన్ల జాబితాను ఓ సారి చూద్దాం..
మహానటి సావిత్రి..
పరిశ్రమకు వచ్చిన కొన్ని రోజుల్లోనే 'మహానటి' అనిపించుకుంది కీర్తి సురేశ్. మలయాళ నిర్మాత సురేష్ కుమార్, నటి మేనక దంపతుల కుమార్తె ఈమె. 2000లో తన తండ్రి నిర్మాతగా వ్యవహరించిన మలయాళ చిత్రం 'పైలట్స్'తో కీర్తి తెరంగేట్రం చేసింది. అంతేకాదు 'అచనేయనెనిక్కిష్టం', 'కుబేరన్' వంటి చిత్రాలు, కొన్ని సీరియల్స్‌లోనూ నటించి పేరు తెచ్చుకుంది. హీరోయిన్‌గా మలయాళ చిత్రం 'గీతాంజలి'లో కనిపించింది.
![film stars daughters turned as actresses-special story](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/6243412_2.jpg)
2016లో 'నేను శైలజ' సినిమాతో కీర్తి సురేశ్ తెలుగుతెరపై కనువిందు చేసింది. 'మహానటి'తో ఉత్తమ నటిగా జాతీయ అవార్డు అందుకుంది. తర్వాత కొన్ని కమర్షియల్ సినిమాల్లో నటించి హిట్లు అందుకుందీ ముద్దు గుమ్మ. ప్రస్తుతం ఆమె చేతిలో 'మిస్ ఇండియా', 'పెంగ్విన్', 'గుడ్ లక్ సఖి', 'రంగ్‌దే' చిత్రాలతో బిజీగా ఉంది.
శ్రీదేవి వారసురాలు
నటి శ్రీదేవి, నిర్మాత బోనీ కపూర్‌ల మొదటి కుమార్తె 'జాన్వి కపూర్'. ఒక్క చిత్రంతోనే అందరి దృష్టిని తనవైపునకు తిప్పుకుందీ అందాల భామ. 2018లో ఆమె తొలి సినిమా 'ధడక్' విడుదలై, మంచి విజయం సాధించింది. దీని తర్వాత ఆమె వరుస సినిమాలతో బిజీ అయిపోయింది. త్వరలో 'గుంజన్ సక్సేనా', 'రూహీ అఫ్జా', 'దోస్తానా 2' సినిమాల్లో సందడి చేయబోతుంది. ఇప్పటికే 'ఘోస్ట్ స్టోరీస్' అనే సిరీస్‌లోనూ నటించి మెప్పించింది.
![film stars daughters turned as actresses-special story](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/6243412_4.jpg)
మెగా ముద్దుగుమ్మ
'ఒక మనసు'తో హీరోయిన్‌గా పరిచయమైన మెగా వారసురాలు, నాగబాబు కుమార్తె నిహారిక. ఆపై 'హ్యాపీ వెడ్డింగ్', 'సూర్యకాంతం' సినిమాల్లో నటించింది. 'ఒరు నల్లనాల్ పాతు సొల్రెన్'తో కోలీవుడ్ ప్రేక్షకుల్నీ అలరించింది. ఇటీవల వచ్చిన 'సైరా నరసింహారెడ్డి'లో ప్రత్యేక పాత్రలో తెరపై కనిపించింది. మరోపక్క నిర్మాతగా వెబ్‌సిరీస్‌లనూ నిర్మిస్తోంది. 'ముద్దపప్పు ఆవకాయ', 'నాన్న కూచి', 'మ్యాడ్ హౌస్' వంటి వెబ్‌సిరీస్‌ల్లో నటించింది. అయితే ప్రస్తుతం ఆమె నటించే తర్వాతి చిత్రాలపై స్పష్టత రాలేదు.
![film stars daughters turned as actresses-special story](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/6243412_3.jpg)
రాజశేఖర్ కుమార్తెలు..
సీనియర్ నటులు రాజశేఖర్- జీవితల ఇద్దరు కుమార్తెలు శివానీ, శివాత్మిక కథానాయికలుగా మెప్పించేందుకు ప్రయత్నిస్తున్నారు. చిన్న కుమార్తె శివాత్మిక 'దొరసాని' సినిమాతో అరంగేట్రం చేసింది. ఈ చిత్రంలో ఆమె నటనను అందరూ మెచ్చుకున్నారు. ప్రస్తుతం కృష్ణవంశీ 'రంగమార్తాండా', దుర్గ నరేష్ 'విధి విలాసం'లో నటిస్తోంది.
![film stars daughters turned as actresses-special story](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/6243412_5.jpg)
రాజశేఖర్ పెద్ద కుమార్తె శివానీ.. నటిగా అలరించేందుకు సిద్ధమైంది. ఆ మధ్య అడవి శేష్‌తో కలిసి హిందీ హిట్ 'టూ స్టేట్స్'లో నటించినా.. కొన్ని కారణాల వల్ల ఈ చిత్రం ఆగిపోయింది.
![film stars daughters turned as actresses-special story](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/6243412_6.jpg)
సైఫ్ అలీ ఖాన్ బేటీ..
పటౌడీ వారసురాలు, నటులు సైఫ్ అలీ ఖాన్, అమృత సింగ్‌ల కుమార్తె సారా అలీ ఖాన్. ఈ భామ తొలి సినిమాతోనే ఫిల్మ్‌ఫేర్ అవార్డు అందుకుంది. 2018లో 'కేదార్‌నాథ్'తో తెరగేట్రం చేసింది సారా. దీని తర్వాత 'సింబా', 'లవ్ ఆజ్ కల్' సినిమాల్లో కథానాయికగా ఆకట్టుకుంది. ప్రస్తుతం వరుణ్ ధావన్‌తో కలిసి 'కూలీ నెంబరు 1' సినిమాలో నటిస్తుంది. ఈ సినిమా పోస్ట్ ప్రొడక్షన్ దశలో ఉంది.
![film stars daughters turned as actresses-special story](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/6243412_7.jpg)
లిసీ తనయ..
దర్శకుడు ప్రియదర్శన్, నటి లిసీ కుమార్తె కల్యాణి ప్రియదర్శన్.. తెలుగులో పలు చిత్రాలతో ఆకట్టుకుంది. 'క్రిష్ 3' అసిస్టెంట్ ప్రొడక్షన్ డిజైనర్, 'ఇరుముగన్' అసిస్టెంట్ ఆర్ట్ డైరెక్టర్‌గా పనిచేసిన కల్యాణి.. 'హలో'తో నటిగా తెరంగేట్రం చేసింది. 'చిత్రలహరి', 'రణరంగం', 'హీరో' తదితర చిత్రాలతో మెప్పించింది. ప్రస్తుతం ఆమె చేతిలో పలు తమిళ, మలయాళ ప్రాజెక్టులు ఉన్నాయి.
![film stars daughters turned as actresses-special story](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/6243412_1.jpg)
చుంకీ పాండే డాటర్..
ప్రముఖ బాలీవుడ్ నటుడు చుంకీ పాండే కుమార్తె అనన్య పాండే. 2019 'స్టూడెంట్ ఆఫ్ ది ఇయర్ 2'తో ఆమె సినీ ప్రయాణం మొదలైంది. 'పతీ పత్ని ఔర్ ఓ' చిత్రంతో అదే ఏడాది హిట్ అందుకుంది. ప్రస్తుతం ఓ హిందీ ప్రాజెక్టుతో పాటు.. తెలుగులో పూరీ జగన్నాథ్, విజయ్ దేవరకొండ కాంబినేషన్‌లో రాబోతున్న సినిమాకు సంతకం చేసింది.
![film stars daughters turned as actresses-special story](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/6243412_8.jpg)
ఇదీ చూడండి.. మంచు లక్ష్మి కుమార్తె పాటకు నెట్టింట ప్రశంసలు