బాలీవుడ్‌లో ప్రస్తుతం బయోపిక్‌ల యుగం నడుస్తోందనే చెప్పాలి. పలువురు నటీనటులు ప్రముఖ వ్యక్తుల జీవితాల్లో నటించి ఇప్పటికే మెప్పిస్తున్నారు. అంతరిక్షయాత్రికుడు రాకేశ్ శర్మ జీవితాధారంగా ఇప్పుడు ఓ సినిమా తీయనున్నారు. దీనికి 'సారే జహాన్ సే అచ్చా' టైటిల్‌ను కూడా పరిశీలిస్తున్నారట. ఇందులో నటించేందుకు ఫర్హాన్ అక్తర్ చాలా కసరత్తులు చేస్తున్నారట. వ్యోమగామిగా, శారీరక శిక్షణ, మరికొన్ని అంతరిక్షానికి సంబంధించిన అంశాల గురించి తెలుసుకునే పనిలో ఉన్నారని సమాచారం.
అంతరిక్షంలో 1984 ఏప్రిల్ 3న ప్రయాణించిన మొట్టమొదటి భారతీయుడుగా రాకేశ్ శర్మ గుర్తింపు తెచ్చుకున్నారు. అయితే ఈ బయోపిక్కు తొలుత అమిర్‌ఖాన్‌ను తీసుకోవాలనుకున్నారు. కానీ ఆయన మహాభారతాన్ని తెరపైకి తీసుకొచ్చేందుకు దృష్టిసారించారు. దాంతో షారుక్‌ఖాన్ పేరు పరిశీలనలోకి వచ్చింది. ఇతడితో పాటే రణ్‌బీర్ కపూర్, విక్కీ కౌశల్ పేర్లు వినిపించాయి. చివరకు వారందరిని కాదని ఫర్హాన్ అక్తర్‌ను ఎంచుకున్నారు. ఫర్హాన్ ఇప్పటికే భారత్‌కు చెందిన అథ్లెట్ మిల్కాసింగ్ బయోపిక్ 'భాగ్ మిల్కా బాగ్'లో నటించి మెప్పించారు.