సెంటిమెంట్ లాకులు
ఆత్రేయపురం: ఆత్రేయపురం మండలం లొల్లలాకుల వద్ద ఒక్క సన్నివేశమైనా చిత్రీకరిస్తే ఆ చిత్రం హిట్ అవుతుందన్న సెంటిమెంట్ ఉండటంతో ఈ ప్రాంతానికి ప్రాధాన్యం ఇస్తారు. బుద్ధిమంతుడు, ముత్యాల ముగ్గు, సాక్షి, సీతారామయ్యగారి మనవరాలు, పల్నాటి పౌరుషం, బెండు అప్పారావు ఆర్‌ఎంపీ, అందాల రాముడు, కత్తి కాంతారావు, ఆర్ ఎక్స్ 100, ప్రెసిడెంట్ గారి అల్లుడు... ఇలా 150 వరకు చిత్రాల సన్నివేశాలు ఇక్కడే జరిగాయి. చిత్రీకరణకు వచ్చినవారు ఈ ప్రాంత అభివృద్ధికి కూడా సాయం అందించిన సందర్భాలున్నాయి. కట్టుంగ ఆంజనేయ స్వామి, వసంతవాడ పార్వతీదేవి ఆలయ అభివృద్ధికి నిర్మాత-ఎడిటర్ మోహన్ తదితరులు సాయం అందించారు.

పూల వనం నిండుగా...
కడియం: అందాల సినీ ప్రపంచానికి అదనపు ఆకర్షణ కడియం నర్సరీలు. ఇక్కడ పూ తోటలతో కనువిందుచేసే ప్రదేశాలు ఇట్టే ఆకట్టుకుంటాయి. వందకు పైగా చిత్రాలకు ఈ పూల వనం నిలయమైంది. నాటి సూపర్‌స్టార్ కృష్ణ నుంచి నేటి కథానాయకులు పవన్‌కల్యాణ్, నితిన్, శర్వానంద్ తదితరులకు ఈ ప్రాంతంపై అమితమైన మక్కువ. మంగమ్మ గారి మనవడు, ప్రెసిడెంటుగారి పెళ్లాం, సూత్రధారులు, సీతారామయ్యగారి మనవరాలు, పుట్టింటి పట్టుచీర, భీష్మ వంటి హిట్ చిత్రాల సన్నివేశాలు ఇక్కడే జరిగాయి.

అక్కడ సినిమా తీస్తే.. హిట్టే
దేవీపట్నం: దేవీపట్నం మండలంలోని గోదావరి తీరాన్న ఉన్న గండిపోశమ్మ అమ్మవారి ఆలయానికి అతి దగ్గరలో ఉన్న గ్రామమే పూడిపల్లి. అగ్రహీరోల హిట్‌లతో పూడిపల్లి గ్రామానికి మంచి పేరుతెచ్చింది. 1983లో గ్రామంలో చిత్రీకరించిన తొలిచిత్రమైన నయాకథమ్ రాజేష్‌కన్నా హిందీ చిత్రం హిట్‌కావడంతో పూడిపల్లి గ్రామం పేరు మారుమోగింది. ఈ క్రమంలోనే అదే చిత్రాన్ని తెలుగులో త్రిశూలం పేరిట చిత్రీకరించడంతో హిట్ తెచ్చింది. ఆతరువాత తాండ్రపాపారాయుడు, జానకిరాముడు, ఆపద్బాంధవుడు, బంగారుబుల్లోడు, ఒక్కమగాడు చిత్ర నిర్మాణాలు ఈ గ్రామంలోనే ఎక్కువ రోజులు సాగాయి. రంగస్థలంలో కొన్ని సన్నివేశాలు ఇక్కడి పరిసరాల్లో చిత్రీకరించారు.

స్వాతిముత్యంలో ఆలయం తంటికొండే
గోకవరం: స్వాతిముత్యం సినిమాలో ఆలయం వేదికగా పలు సన్నివేశాలు కనిపిస్తాయి. ఈ కీలక సన్నివేశాలన్నీ తంటికొండ గ్రామంలో వెంకటగిరి కొండపై శ్రీదేవి, భూదేవి సమేత వెంకటేశ్వరుని ఆలయ ప్రాంగణంలో చిత్రీకరించారు. సరిగమలు, అందాల రాముడు, శతమానంభవతి ఇలా పలు చిత్రాలల్లో సన్నివేశాలు ఈ కొండపై చిత్రీకరించారు.

మెగాస్టార్ మెచ్చిన ఊరు
చిరంజీవి మనవూరి పాండవులు చిత్రీకరణ గుమ్మళ్లదొడ్డి గ్రామంలోనే జరిగింది. బొబ్బిలిసింహం, ప్రెసిడెంట్‌గారిపెళ్లాం, సీతారత్నంగారి అబ్బాయి, పెళ్లి సందడి ఇలా ఇక్కడ తీసిన సినిమాల్లో చాలా వరకు హిట్లుగా నిలిచాయి. హీరో శ్రీకాంత్ ఆలయానికి జనరేటర్ బహూకరించారు. కేంద్ర మంత్రిగా చిరంజీవి ఈ ఆలయ అభివృద్ధికి రూ.10 లక్షలు కేటాయించారు.

శతమానం భవతి వేదిక గూడాల
అల్లవరం: అల్లవరం మండలం గూడాల గ్రామంలో పోలిశెట్టి భాస్కరరావు మండువా లోగిలి అష్టాచమ్మా, శతమానం భవతి తదితర చిత్రాలకు వేదికైంది. ఉయ్యాలా జంపాలా చిత్రీకరణ భీమనపల్లి, కూనవరం పరిసరాల్లోనే జరిగింది. దర్శక, నిర్మాతలు, హీరోలు విజయానికి ఇదో సెంటిమెంట్ ప్రాంతంగా భావిస్తారు.

గిరి అందాల లోగిలి... మారేడుమిల్లి
మారేడుమిల్లి: సహజ సిద్ధమైన వాతావరణానికి నెలవైన మారేడుమిల్లి ప్రాంతంలో సినిమా చిత్రీకరణలు జోరుగా సాగుతున్నాయి. సంపూర్ణ రామాయణం, గోరింటాకు, జైలుపక్షి, నాయుడుగారి కుటుంబం, బాల రామాయణం, సింధూరం, లయన్, గమ్యం వంటి చిత్రాలు షూటింగులు మారేడుమిల్లిలోనే జరిగాయి. ఆర్.నారాయణమూర్తి నిర్మించే పలు చిత్రాలకు ప్రధాన వేదిక ఈ ప్రాంతమే. అల్లు అర్జున్ నటిస్తున్న ‘పుష్ప’ చిత్ర షూటింగుతో ఈ ప్రాంతం సందడిగా మారింది. కాటేజీలు, వసతి గృహాలు నిర్మించడంతో సినీ యూనిట్లు ఇక్కడే ‘బస’ చేసి షూటింగులు జరుపుతున్నారు. ఫలితంగా ఈ ప్రాంతంలో వ్యాపారాభివృద్ధి జరిగింది.

కోనసీమే చిరునామా
పి.గన్నవరం: కోనసీమ పల్లెల్లో అనేక సినిమాలు రూపుదిద్దుకున్నాయి. ప్రముఖ దర్శకుడు కె.రాఘవేంద్రరావు నిర్మాతగా ‘ది మార్నింగ్‌రాగ’ పి.గన్నవరం అక్విడక్టు, నరేంద్రపురంలో చిత్రీకరించారు. ‘జీవనజ్యోతి’ కోనసీమలోని పలు ప్రాంతాల్లో 1975లో తెరకెక్కింది. ఈ చిత్రం అప్పట్లో ‘స్వర్ణనంది’ గెలుచుకుంది. దేవత చిత్రంలోని ‘ఎల్లువొచ్చి గోదారమ్మ’ పాట పెదపట్నం సమీపంలోని గోదావరి చెంతన చిత్రీకరించారు. ‘గద్దలకొండ గణేష్’ చిత్రంలోని ఈ పాటను రీమేక్ చేసి ఎదుర్లంక సమీపంలో చిత్రీకరించారు. ‘అమ్మోరు’ చిత్రంలో పలు సన్నివేశాలు అయినవిల్లి, ముక్తేశ్వరంరేవులో తెరకెక్కించారు. రాజేంద్రప్రసాద్ హీరోగా చిత్రీకరించిన ‘లేడీస్ టైలర్’ చిత్రం పి.గన్నవరం మండలం మానేపల్లిలో అగ్రభాగం షూటింగ్ జరుపుకొంది.
