ప్రభాస్ కథానాయకుడిగా రాధాకృష్ణ దర్శకత్వంలో ఓ చిత్రం రూపొందుతోంది. యువీ క్రియేషన్స్, గోపీకృష్ణ మూవీస్ సంయుక్తంగా నిర్మిస్తున్నాయి. పూజా హెగ్డే కథానాయిక. ఇప్పటికే జార్జియా, ఇటలీ తదితర ప్రాంతాల్లో కీలక షెడ్యూల్స్‌ను పూర్తి చేశారు. ఇప్పుడు మిగిలిన చిత్రీకరణ కోసం హైదరాబాద్‌లోనే ప్రముఖ ప్రొడక్షన్ డిజైనర్ ఆర్.రవీందర్ రెడ్డి నేతృత్వంలో ప్రత్యేక సెట్లు సిద్ధం చేస్తున్నారు. తాజాగా దీనిపై ఆర్.రవీందర్ రెడ్డి పంచుకున్న విశేషాలేంటో తెలుసుకుందాం.
- వాస్తవానికి మేం లాక్‌డౌన్ నాటికే 80శాతం సెట్ నిర్మాణ పనులు పూర్తి చేశాం. ఇప్పుడు మిగిలిన పనులనే పరిమిత సిబ్బందితో అన్ని రకాల జాగ్రత్తలు తీసుకుంటూ పూర్తి చేస్తున్నాం.
- ఈ చిత్రం కోసం హైదరాబాద్‌లోని ఓ స్టూడియోలో హాస్పిటల్ సెట్ వేస్తున్నాం. దీంతో పాటు యూరప్ స్ట్రీట్ సెట్, ఓ భారీ షిప్ సెట్ నిర్మాణాలు పూర్తి చేయాల్సి ఉంది. పనులన్నీ పూర్తవ్వడానికి నెల రోజులు పడుతుంది. ఆగస్టులో సినిమా సెట్స్‌పైకి వెళ్తుంది
"1970ల కాలం నాటి నేపథ్యంతో ఇటలీ బ్యాక్‌డ్రాప్‌లో సాగే ప్రేమకథాంశంతో ఈ చిత్రం రూపొందుతోంది. జార్జియా షెడ్యూల్ ముగిసిన వెంటనే హైదరాబాద్‌లో చిత్రీకరణ కొనసాగించేలా కొన్ని సెట్లు నిర్మించాలని అనుకున్నాం. కరోనా - లాక్‌డౌన్ పరిస్థితుల కారణంగా ప్రణాళికలు తలకిందులయ్యాయి. ఇప్పుడు తిరిగి చిత్రీకరణలు జరుపుకోవడానికి అనుమతులివ్వడం వల్ల.. ప్రభుత్వ మార్గదర్శకాలను అనుసరించి సెట్ నిర్మాణ పనులు ప్రారంభించుకున్నాం".
- ఈ చిత్రానికి 'ఓ డియర్', 'రాధే శ్యామ్' పేర్లు పరిశీలనలో ఉన్నాయి. తిరిగి చిత్రీకరణ ప్రారంభించుకునే రోజే ఈ చిత్ర టైటిల్, ప్రభాస్ కొత్త లుక్‌ను రిలీజ్ చేసే అవకాశముందని తెలుస్తోంది.