సినిమాల్లో ఒక్కసారి గుర్తింపు తెచ్చుకుంటే డబ్బుతో పాటు పేరు ప్రఖ్యాతలూ వస్తాయి. అదే హాలీవుడ్ చిత్రాలైతే ఈ ప్రాధాన్యం మరీ ఎక్కువ. సాధారణంగా హీరోహీరోయిన్లకు ఎక్కువగా ఇలా గుర్తింపు వస్తుంది. కానీ ఓ కుక్క దశ తిరిగి రాజభోగాలు అనుభవించిన సంగతి మీకు తెలుసా! హాలీవుడ్ చిత్రాల్లో నటించిన రిన్ టిన్ టిన్ అనే శునకం ఈ లగ్జరీ జీవితాన్ని గడిపింది
రిన్ టిన్ టిన్ ఎంతలా సేవలు చేయించుకుందంటే ఈ శునకం కోసం ప్రత్యేకంగా ఓ వ్యక్తిగత నౌకరుండే వాడు. ప్రయాణించడానికి ఓ లిమోసిన్ కారు, డ్రైవర్, ఓ మేకప్‌మ్యాన్ ఉండేవాళ్లు. స్టూడియోకు వచ్చినపుడు ఈ కుక్క కోసం 5 గదుల డ్రెస్సింగ్ రూమ్ కాంప్లెక్సు ఉండేది. ఇలా సకల సదుపాయాలను అనుభవించింది రిన్ టిన్ టిన్.
1918లో పుట్టిన రిన్ టిన్ టిన్ దాదాపు 27 హాలీవుడ్ చిత్రాల్లో నటించింది. జర్మన్ షెపర్డ్ జాతికి చెందిన ఈ శునకాన్ని ఓ అమెరికన్ సైనికుడు రక్షించి ఆశ్రయం కల్పించాడు. అనంతరం ఈ కుక్కకు మిలిటరీ శిక్షణ ఇచ్చాడు. ఈ శునకం చేసే విన్యాసాలు చూసిన హాలీవుడ్ దర్శకులు తమ సినిమాల్లో వరుసపెట్టి ఆఫర్లిచ్చారు.
ఇలా పదేళ్ల పాటు హాలీవుడ్లో గుర్తింపు తెచ్చుకున్న రిన్ టిన్ టిన్ 1932లో చనిపోయింది. ఈ శునకం జీవితం ఆధారంగా 1950లో 'ఎడ్వెంచెర్స్ ఆఫ్ రిన్ టిన్ టిన్' అనే అమెరికన్ సిరీస్ వచ్చింది. అప్పట్లో ఈ టీవీ సిరీస్ ప్రేక్షకుల్ని విపరీతంగా అలరించింది. రిన్ టిన్ టిన్ చనిపోయినా.. హలీవుడ్లో నటించిన అదే జాతికి చెందిన కుక్కలకు రిన్ టిన్ టిన్ 1, రిన్ టిన్ టిన్ 2 అని పేర్లు పెట్టి మరీ ఆకట్టుకున్నారు దర్శకులు.
- " class="align-text-top noRightClick twitterSection" data="">