"వివాదాస్పద కథాంశాలే ప్రేక్షకుల్ని త్వరగా ఆకర్షిస్తాయి. అందుకే ఆ తరహా సినిమాలు తీస్తుంటాను" అని అన్నారు దర్శకుడు రామ్‌గోపాల్ వర్మ. కరోనా విస్తృతితో పోటీ పడుతూ, వేగంగా సినిమాలు తీసి ప్రేక్షకుల ముందుకు తెస్తున్నారు. ఇటీవలే 'పవర్‌స్టార్'తో ప్రేక్షకుల్ని పలకరించిన ఆయన.. ఇప్పుడు 'థ్రిల్లర్'తో సిద్ధమయ్యారు. అప్సర రాణి ప్రధాన పాత్రలో నటించింది. 'ఆర్జీవీ వరల్డ్ థియేటర్.కామ్' ద్వారా శుక్రవారం విడుదలవుతోంది. ఈ నేపథ్యంలో మీడియాతో ముచ్చటించారు వర్మ.
కరోనా పరిస్థితుల మధ్య వరుస చిత్రాలతో ప్రేక్షకుల్ని పలకరించడం మీకెలా సాధ్యమవుతోంది?
ఆర్జీవీ: చిత్రీకరణలకు ఎన్ని అవరోధాలైనా ఉండొచ్చు. పరిస్థితుల్ని అర్థం చేసుకుని దానికి తగ్గట్లుగా కథల్ని తయారు చేసుకోగలిగినప్పుడు, తగ్గ టెక్నీషియన్స్ దొరికినప్పుడు ఎన్ని చిత్రాలైనా చేసెయొచ్చు. దాన్నే నేనిలా చేతల్లో చూపిస్తున్నా. ప్రస్తుతం కరోనా తీవ్రత బాగా ఉంది కాబట్టి.. భద్రతాపరంగా అన్ని జాగ్రత్తలు తీసుకుంటూనే చేస్తున్నాం.
ఏటీటీలో 'పే ఫర్ వ్యూ' పద్ధతి ద్వారా వసూళ్లు ఎలా ఉన్నాయి?
ఆర్జీవీ: మేం ఏం చేసినా అన్ని రకాలుగా కలిసొస్తున్నాయి. ఇలా వచ్చిన 'పవర్‌స్టార్' ఫలితంపై సంతృప్తిగా ఉన్నా. పరిస్థితులకు తగ్గట్లుగా మన ఆలోచనా విధానాల్ని మార్చుకోగలిగినప్పు ఏదైనా మంచి ఫలితాన్నే ఇస్తుంది. ఇక్కడ నిడివి సమస్యలు లేవు. నేనెంచుకున్న కథల్ని దీనికి తగ్గ బడ్జెట్‌లోనే డిజైన్ చేసుకుంటున్నా.
'థ్రిల్లర్' చిత్రం ఎలా ఉండబోతుంది?
ఆర్జీవీ: శృంగారభరితంగా ఉండే ఓ సస్పెన్స్ థ్రిల్లర్ కథాంశంతో ఈ చిత్రాన్ని రూపొందించాం. ఇలాంటి థ్రిల్లర్ జోనర్‌లో మరిన్ని సినిమాలొస్తాయి. ఈ చిత్రాన్ని 'ఆర్జీవీ వరల్డ్ థియేటర్'లో 11 భాషల్లో విడుదల చేస్తున్నాం.
ప్రస్తుతం ఓటీటీలో మీపై వస్తున్న 'పరాన్నజీవి', 'ఆర్జీవీ' తదితర చిత్రాలపై మీ స్పందనేంటి?
ఆర్జీవీ: నేనంతగా పట్టించుకోను. ప్రస్తుతం నా సినిమాలతో తీరిక లేకుండా ఉన్నా. పక్కవాళ్ల గురించి ఆలోచించే సమయం అసలు లేదు.
వర్మ చిత్రాలు ఇకపై ఏటీటీకే పరిమితమవుతాయా? లేక థియేటర్లోనూ చూడొచ్చా?
ఆర్జీవీ: ఇక్కడ నేను దేనికి పరిమితవుతా అన్నది సమస్య కాదు. థియేటర్లు ఎప్పుడు తెరచుకుంటాయన్నది ముఖ్యం. ప్రస్తుతం నేను తీస్తున్న 'ఎంటర్ ది గర్ల్ డ్రాగన్' సినిమాను థియేటర్‌లో చూపించాలనే ఎదురు చూస్తున్నా. కంటెంట్ విషయంలో థియేటర్లు, ఓటీటీ అని ప్రత్యేకంగా ఏం ఉండదు. కాకపోతే కొన్ని చిత్రాల్ని ఓటీటీలోకి తీసుకొస్తే అనుకున్న స్థాయిలో రాబడి రాదు. అందుకే పరిస్థితులు అనుకూలించే వరకు వేచి చూడక తప్పదు.
ఓటీటీకి సెన్సార్.. జరిగే పని కాదు
"ఓటీటీ కంటెంట్‌ను సెన్సార్ పరిధిలోకి తీసుకురావాలని అందరూ అంటున్నారు. అది జరిగే పని కాదు. 1952లో ఈ సెన్సార్ యాక్ట్‌ను తీసుకొచ్చారు. ఇప్పుడు అనేక దేశాల నుంచి ఇన్ని ఓటీటీ వేదికలు వస్తున్నప్పుడు.. వాటిలో వచ్చే కంటెంట్ మొత్తాన్ని సెన్సార్ చేయడం అసాధ్యం. దీని కోసం ఎన్ని సెన్సార్ బోర్డు ఆఫీసుల్ని ఏర్పాటు చేస్తారు? ఎంత మంది సిబ్బందిని నియమిస్తారు? దీనికి తోడు త్వరితగతిన సెన్సార్ చేయడమన్నది అన్నింటి కన్నా పెద్ద సవాల్. గ్లోబల్‌గా అందరం ఒకటిగా కనెక్ట్ అయిపోయి ఉన్నప్పుడు ఐదారుగురు కూర్చోని.. ఎవరేం చూడొచ్చు, ఏం చూడకూడదు? అని ఎలా నిర్ణయిస్తారు.
మునుపటిలా కాదు
"కరోనాకు వ్యాక్సిన్ వస్తోంది.. వచ్చింది' అని కొద్దినెలలుగా వింటూనే ఉన్నాం. ఏదైనా నిజంగా ఆ వ్యాక్సిన్ ప్రజల చేతుల్లోకి వచ్చే దాకా ఏం చెప్పలేం. నా దృష్టిలో ఈ క్లిష్ట పరిస్థితుల నుంచి చిత్ర పరిశ్రమ కుదటపడటానికి డిసెంబరు వరకు సమయం పట్టొచ్చు. ఒకవేళ ఇప్పట్లో థియేటర్లు తెరచుకున్నా.. ఒకప్పటి స్థాయిలో వందల కోట్ల రూపాయల వసూళ్లను తిరిగి చూడటం కష్టమే. ఎందుకంటే థియేటర్ల నిర్వహణ భారం పెరుగుతుంది. దీనికి తోడు ఓటీటీకి అలవాటు పడిన ప్రేక్షకులు ఎంత మేర థియేటర్లకు వస్తారన్నది ఇప్పుడే తెలియదు. ఫలితంగా బయ్యర్ల మార్కెట్లు పడిపోతాయి. నిర్మాతలు ఈ పరిస్థితులకు తగ్గట్లుగా తమ సినిమాల్ని తక్కువకు అమ్ముకోలేరు. కాబట్టి వీటన్నింటినీ దృష్టిలో పెట్టుకుంటే మునుపటి స్థాయిలో వసూళ్లు చూడలేకపోవచ్చు"