కొత్తదనం నిండిన కథలకు, బలమైన భావోద్వేగాలకు నెలవు దర్శకుడు కిషోర్ తిరుమల సినిమాలు. ఇప్పుడాయన 'రెడ్' చిత్రంతో తొలిసారి ప్రేక్షకుల్ని థ్రిల్ చేసేందుకు సిద్ధమయ్యారు. రామ్ హీరోగా నటించారు. స్రవంతి రవికిశోర్ నిర్మించారు. మాళవిక శర్మ, అమృత అయ్యర్, నివేదా పేతురాజ్ కథానాయికలు. సంక్రాంతి కానుకగా జనవరి 14న థియేటర్లలోకి వస్తోంది. ఈ నేపథ్యంలో హైదరాబాద్‌లో విలేకర్లతో శనివారం ముచ్చటించారు కిషోర్ తిరుమల.
సంక్రాంతి అనగానే ప్రేక్షకులు కుటుంబ కథా చిత్రాలే ఆశిస్తుంటారు. మీరేంటి థ్రిల్లర్‌తో వస్తున్నారు?
వాస్తవానికి థ్రిల్లర్ చిత్రాలెప్పుడూ ఆద్యంతం ఒకే టోన్‌లో సాగుతుంటాయి. 'రెడ్' అలా కాదు. దీంట్లో మంచి ఫ్యామిలీ డ్రామా, చక్కటి ప్రేమకథ, బలమైన మహిళా పాత్రలు.. ఇలా కమర్షియల్ సినిమాలో ఉండాల్సిన అన్ని అంశాలు మిళితమై ఉంటాయి. థ్రిల్లర్ అన్నది ఓ 30శాతమే. అందుకే ప్రేక్షకులు దీన్ని మంచి ఫ్యామిలీ ఎంటర్‌టైనర్‌లా చూస్తారు తప్ప థ్రిల్లర్ సినిమాలా కాదు.
'చిత్రలహరి' వంటి హిట్ తర్వాత ఈ రీమేక్ కథను ఎంచుకోవడానికి కారణమేంటి?
కథ బాగుంది. ఈ జానర్ నాకూ కొత్తగా ఉంటుంది అన్న ఉద్దేశంతో ఎంచుకున్నా. ఇది రీమేక్ కథయినా.. కథనం సాగే విధానం, సన్నివేశాలు, మాటలు అన్నీ చాలా కొత్తగా ఉంటాయి. దాదాపు ఐదు నెలలు శ్రమించి స్క్రిప్ట్ సిద్ధం చేశా. ఎందుకంటే దీంట్లో కథా నేపథ్యమే మాతృక నుంచి తీసుకున్నా. దాని చుట్టూ అల్లుకున్న మిగతా అంశాలన్నీ ఇక్కడి ప్రేక్షకుల అభిరుచికి తగ్గట్లుగా తీర్చిదిద్దుకున్నవే. అందుకే ప్రేక్షకులు తెరపై చూస్తున్నప్పుడు.. ఎక్కడా రీమేక్ సినిమా చూస్తున్నామన్న భావన కలగదు.
'ఇస్మార్ట్ శంకర్' చూసి రామ్‌ను ఈ కథలోకి తీసుకున్నారా?
లేదు. రామ్‌తో నేనిప్పటికే రెండు చిత్రాలు చేశా కదా. మా ఇద్దరికి మంచి సింక్ ఉంటుంది. మాతృక చూసినప్పుడే ఈ కథ ఆయనకైతేనే బాగుంటుంది అనిపించి, తనను తీసుకున్నా. 'ఇస్మార్ట్ శంకర్' తర్వాత రామ్ నుంచి మాస్ ప్రేక్షకులు ఎలాంటి అంశాలు కోరుకుంటారో.. అవన్నీ ఈ చిత్రంలో ఉంటాయి. ఇది థ్రిల్లర్ డ్రామా కాబట్టి కాస్త కొత్త కోణంలో ఉంటుంది. రామ్ ద్విపాత్రాభినయం చేసిన తొలి చిత్రమిది. అందుకే ఆ పాత్రలు, సంభాషణలు పలికే తీరు విషయంలో చాలా జాగ్రత్తలు తీసుకున్నాం. రెండు పాత్రలు భిన్నంగా అందర్నీ మెప్పించేలా సాగుతాయి.
ముగ్గురు కథానాయికల్ని తీసుకున్నారు... గ్లామర్ కోసమా?
అలా ఏం లేదు. సినిమాలో ముగ్గురు నాయికల్నీ కథానుగుణంగానే ఎంపిక చేసుకున్నాం. ఏ పాత్రా కథలో ఇరికించినట్లు ఉండదు. ముగ్గురికి సమాన ప్రాధాన్యం ఉంటుంది. వాళ్లలో ఎవరు లేకపోయినా కథ ముందుకు నడవదు. దీంట్లో నివేదా పోలీస్ అధికారిణిగా కనిపిస్తుంది. చాలా బలమైన, నటనకు ప్రాధాన్యమున్న పాత్ర ఆమెది. అమృత, మాళవికలవి పక్కింటి అమ్మాయి తరహా పాత్రల్లా ఉంటాయి. మధ్యతరగతి ప్రేక్షకులు బాగా కనెక్ట్ అవుతారు.
వ్యక్తిగతంగా ఎలాంటి జానర్స్ ఇష్టపడతారు. కొత్తగా చేస్తున్న సినిమాలేంటి?
ఏ జానర్‌కు అదే ప్రత్యేకం. నేనైతే ప్రేమకథలు, ఫ్యామిలీ ఎంటర్‌టైనర్లను బాగా ఇష్టపడతా. సినిమాల విషయానికొస్తే.. ప్రస్తుతం శర్వానంద్‌తో 'ఆడాళ్లు మీకు జోహార్లు' చేస్తున్నా. లాక్‌డౌన్‌లో ఈ స్క్రిప్ట్‌తో పాటు మరో రెండు కథలు సిద్ధం చేసుకున్నా. మంచి స్క్రిప్ట్, సమయం దొరికితే వెబ్ సిరీస్ చేస్తా. ఇప్పుడైతే నా దగ్గర సినిమాలకు సరిపడా కథలే ఉన్నాయి.