తమిళ సినిమాలకు కథలు, సంభాషణలు సమకూర్చిన రచయితలందరూ లబ్దప్రతిష్టులే. ముఖ్యమంత్రులు అన్నాదురై, కరుణానిధిలతో మొదలైన ఈ సంప్రదాయం బాలచందర్ దాకా విస్తరించింది. ఎంజీఆర్ సినిమా దైవత్తాయ్‌కు మాటల రచయితగా పరిచయమైన బాలచందర్ మంచి నాటక రచయిత. సంక్లిష్టమైన మానవ సంబంధాలను వాస్తవ దృక్పథంతో సెల్యులాయిడ్ మీదకు ఎక్కించడం బాలచందర్‌తో బాటు కళాతపస్వి కె.విశ్వనాథ్ వంటి కొందరికి మాత్రమే తెలుసు. రజనీకాంత్, కమల్ హాసన్, ప్రకాష్ రాజ్, సరిత వంటి సూపర్ స్టార్లను వెండితెరకు పరిచయం చేసిన ఘనత బాలచందర్‌దే. వీరంతా ఆయన ముందు చూపించే వినయ విధేయతలు ఆయన సంపాదించుకున్న గౌరవ భావానికి, విశిష్ట వ్యక్తిత్వానికి సంకేతం. కథలే ఆయన సినిమాల్లో నిజమైన హీరోలు. 2014, డిసెంబర్ 23న స్వర్గస్తులైన ఈ దాదాసాహెబ్ ఫాల్కే అవార్డు గ్రహీత గురించి గుర్తుచేసుకుందాం.
సన్నిలం అనేది బాలచందర్ ఊరు. తంజావూరు జిల్లాలో నూలు వస్త్రాలపై కలంకారి వంటి రంగుల్ని అద్దటానికి చాలా ప్రసిద్ధి. మెలోడ్రామాకు పరిమతమౌతున్న సినిమాలకు సహజసిద్ధమైన రంగులద్ది మరోచరిత్ర సృష్టించిన బాలచందర్ అన్నామలై యూనివర్సిటీ పట్టభద్రుడు. అకౌంటెంట్ జనరల్ కార్యాలయంలో ఉద్యోగం చేస్తూ తీరిక సమయాల్లో నాటక రచనను ప్రవృత్తిగా మార్చుకున్న ఆయన వాటిని డైరెక్ట్ చేస్తూ ఉండేవారు. ఆయన రాసిన ఒక నాటకం ఎంజీఆర్ దృష్టిని ఆకర్షించింది. అలా ఆయన ప్రోత్సాహంతో 1965లో దైవత్తాయ్ సినిమాకు మాటలు రాసి, స్క్రీన్ ప్లే సమకూర్చారు. ఆ రోజుల్లో సినిమాలు శౌర్యం, వీరత్వం మీదే ఎక్కువగా నడుస్తుండేవి. బాలచందర్ తనదైన శైలిలో మధ్య తరగతి కుటుంబ సమస్యలు, అభిమానాలు, అనుమానాలు, మానసిక సంఘర్షణలు కథా వస్తువులుగా తీసుకొని సినిమాలుగా మలిచే విధానాన్ని అమలు చేసారు. నీరుక్కుమిళి నాటకం అలా సినిమాగా రూపుదిద్దుకుంది. సూపర్ హిట్టయిన ఈ సినిమాలో సన్నివేశాలన్నీ దాదాపు ఒకే సెట్లో ఉంటాయి. కానీ ఎక్కడా మొనాటనీ అనిపించదు. కథా వస్తువులన్నీ మధ్యతరగతి కుటుంబ సమస్యలు కావడం వల్ల పెద్ద స్టార్ల జోలికి వెళ్లకుండా మేజర్ చంద్రకాంత్, ఎదిర్నిచ్చల్ వంటి సినిమాలు తీస్తే ప్రేక్షకులు ఆదరించారు.
నాగేష్ నటించిన సర్వర్ సుందరం సినిమాకు బాలచందర్ సమకూర్చిన సంభాషణలు ఆయనలోని ఒక కొత్త కోణాన్ని ఆవిష్కరింపజేశాయి. ఈ సినిమా మంచి సంభాషణల రచయితగా బాలచందర్‌కు జాతీయ స్థాయిలో గుర్తింపు తెచ్చింది. కృష్ణన్- పంజు సినిమాలకు బాలచందరే సంభాషణలు సమకూర్చేవారు. అవకాశాలు పెరగడం వల్ల చేసే ఉద్యోగానికి, సినిమా వ్యాసాంగానికి లంకె కుదరలేదు. మెయ్యప్పచెట్టి ధైర్యం చెప్పారు. ఉద్యోగానికి గుడ్‌బై చెప్పించి, పూర్తిస్థాయి సంభాషణల రచయితగా వరుసగా మూడు సినిమాలు ఇచ్చి వాటికి దర్శకత్వ బాధ్యతలు కూడా అప్పగించారు. ఇది బాలచందర్ జీవితంలో కీలకమైన మలుపు.
తెలుగు చిత్రసీమకు ఆప్తుడు
తమిళంలో బాలచందర్‌కు ఎంతపేరుందో తెలుగు చిత్రసీమలో కూడా అంతే పేరుంది. తెలుగు చలన చిత్ర పరిశ్రమకు బాలచందర్ సత్తెకాలపు సత్తెయ్య సినిమాతో పరిచయమయ్యారు. తరువాత విభిన్న కోణంతో ఉండే బొమ్మా బొరుసా వంటి సినిమాలు తీశారు. మెగాస్టార్ చిరంజీవిని 47 నాట్కళ్ (47 రోజులు) సినిమాతో తమిళ చిత్రరంగానికి పరిచయం చేశారు. అలాగే అందమైన అనుభవం, ఆడవాళ్లూ మీకు జోహార్లు, తొలికోడి కూసింది వంటి చిత్రాలు బాలచందర్ దర్శకత్వంలోనే వచ్చాయి. ఆచారాలు కట్టుబాట్ల పేరుతో నలిగిపోతున్న స్త్రీ జీవితాలమీద కథ అల్లుకుని జయప్రదతో అంతులేని కథను తెలుగులో తీశారు. మగవాడి దౌర్జన్యాలకు గురి కాకుండా, స్త్రీ స్వతంత్రంగా బతకాలనే నేపథ్యంలో సుహాసినితో సింధుభైరవి నిర్మించారు. తమిళ సినిమా అరంగేట్రంలో ఒక బ్రాహ్మణ యువతి కుటుంబ బాధ్యతలు మోసేందుకు పడుపు వృత్తిలోకి దిగుతుంది. బాలచందర్ తలపోసే ఇలాంటి కథలు వివాదాస్పదమయ్యేవి. పైగా సుఖాంతమయ్యే సినిమాలు చూడటానికి అలవాటు పడ్డ ప్రేక్షక జనానికి విషాదాంతాలను అలవాటు చేశారు. నాగేష్ వంటి హాస్య నటుణ్ని సర్వం సుందరంలో హీరోగా చూపడం బాలచందర్‌కే సాధ్యమైంది. ఇది కథ కాదు సినిమాతో రజనీకాంత్‌ను తెలుగు తెరకు పరిచయం చేసిన ఘనత ఆయనదే. పాత్రలకు అనుగుణంగా నటీనటుల్ని ఎంపిక చెయ్యడం ఆయన పద్ధతి. మరో చరిత్ర కథలో కమల్ హాసన్‌ను హీరోగా అనుకున్నా, హీరోయిన్ కోసం చాలా కాలం అన్వేషించాల్సి వచ్చింది. తెలుగమ్మాయి సరిత తన కథకు సరిపోయే విధంగా ఉందని నమ్మకం ఏర్పడ్డాక సినిమా మొదలెట్టారు. తన సినిమాల్లో నటించేందుకు తొలిరోజుల్లో కమల్ హాసన్, రజనీకాంత్‌లను కూడా కథాపరంగానే ఎన్నుకున్నారు. బాలచందర్ స్కూల్లో వాళ్లిద్దరూ నిత్య విద్యార్థుల్లాగే మెలిగేవారు. అందుకే వారిద్దరూ సూపర్‌స్టార్లుగా ఎదిగారు. బాలచందర్ తీసిన ఇది కథ కాదు, గుప్పెడు మనసు, ఆకలి రాజ్యం చిత్రాలన్నీ ఆణిముత్యాలే. బాలచందర్‌కు ఒకదాని తరువాత మరో సినిమా ప్లాన్ చెయ్యడమంటే ఇష్టం. వీలయినంతవరకు కథ ప్లాట్‌ను తనే తయారు చేసుకుంటారు. స్వయంగా కథా రచయిత కావడంచేత తన ఆలోచనలకు సరిపడే కథలనే సినిమాలుగా మలిచారు. బాలచందర్‌కు ఎంత నిబద్ధత అంటే, అక్కినేని నాగేశ్వరరావు నటించిన దేవదాసు చూశాక జీవితంలో మద్యం ముట్టుకోకూడదని నిర్ణయం తీసుకొని ఆ నిర్ణయానికే కట్టుబడ్డారు. మధ్య తరగతి సినిమాలకే ప్రాధాన్యం ఇచ్చిన బాలచందర్ తన పేరును మబ్బుల్లో ఉన్నట్లు వేసుకునేవారు. ఈ సంప్రదాయాన్ని తర్వాత దాసరి నారాయణరావు అనుకరించారు.
రివర్స్ గేర్
బాలచందర్ కవితాలయ పతాకంపై తమిళంలో సొంతంగా సినిమాలు నిర్మిస్తూ వస్తున్నారు. ఆ మధ్య కథానాయకుడు సినిమాలో రజనీకాంత్ నటించి గురుదక్షిణ చెల్లించుకున్నారు. కమల్ హాసన్ కెరీర్‌ను మలుపు తిప్పిన బాలచందర్‌కు తొలిరోజుల్లో రోడ్డు మీద నడుస్తూ వెళ్తున్న కమలహాసన్ కనిపించారట. కారు ఆపి కమల్‌తో మాట్లాడి, ఆఫీసుకు వచ్చి కలవమన్నారట. అంతే.. అపూర్వ రాగంగళ్‌లో కమలహాసన్ చేత నటింపజేశారు. అలా కమల్ కెరీర్ మలుపు తిరిగింది. కమల్ తన సొంత చిత్రానికి బాలచందర్‌ను నిర్మాతగా వ్యవహరింపజేశారు. తను కొత్తగా తీయబోయే సినిమాలో బాలచందర్ చేత నటింపజేయడమే కాకుండా, ఆ చిత్రానికి కమలహాసనే దర్శకత్వం వహించబోవటం విశేషం. అంటే గురుశిష్యుల పాత్రలు రివర్సు అయ్యాయన్నమాట. తమిళం, తెలుగు భాషల్లో ఏకకాలంలో నిర్మితమైన ఈ చిత్రమే ఉత్తమ విలన్.
పురస్కారాలు, సత్కారాలు
బాలచందర్ తన 49 ఏళ్ల సినీ ప్రస్థానంలో వివిధ భాషల్లో వందకు పైగా చిత్రాలకు నిర్దేశకత్వం వహించారు. బాలచందర్ దర్శకత్వం వహించిన తమిళ చిత్రాలు ఇరుకొరుగళ్ (69), అపూర్వ రాగంగళ్, తన్నీర్ తన్నీర్ (81), అచ్చమిల్లై అచ్చమిల్లై (84) జాతీయ స్థాయిలో పురస్కారాలు సాధించాయి. జాతీయ సమగ్రత కోసం నర్గీస్ పేరిట ఇచ్చే అవార్డులు బాలచందర్‌కు రెండుసార్లు దక్కటం విశేషం. 1987లో బాలచందర్‌ను పద్మశ్రీ బిరుదు వరించింది. 1973లో తమిళనాడు ప్రభుత్వం బాలచందర్‌ను కలైమామణి పురస్కారంతో సత్కరించింది. అక్కినేని నాగేశ్వరరావు స్థాపించిన అంతర్జాతీయ పురస్కారం కూడా బాలచందర్‌కు దక్కింది. 2010 సంవత్సరానికి భారత ప్రభుత్వం బాలచందర్‌కు ప్రతిష్టాత్మక దాదాసాహెబ్ ఫాల్కే అవార్డును బహూకరించింది. ఈ అవార్డును బాలచందర్ తనకు అన్నం పెట్టిన తమిళ చిత్ర పరిశ్రమకు అంకితం చేశారు. బాలచందర్ తీసే తెలుగు సినిమాలకు రచయిత గణేష్ పాత్రో, గీత రచయిత ఆచార్య ఆత్రేయ, సంగీత దర్శకుడు ఎం.ఎస్.విశ్వనాథన్‌ల పాత్ర ఎంతో విశిష్టమైనది. వీరి కలయికలో వచ్చిన సినిమాలన్నీ ఆణిముత్యాలే.
ఇదీ చూడండి : సునీల్ హీరోగా ఆ సూపర్‌హిట్ రీమేక్!