ETV Bharat / sitara

ఆ కథకు మూడేళ్లు మెరుగులు దిద్దా!

author img

By

Published : Mar 14, 2021, 8:32 AM IST

Updated : Mar 14, 2021, 11:52 AM IST

తొలి సినిమాతోనే బాక్సాఫీసు వద్ద అత్యధిక కలెక్షన్లతో సత్తా చాటిన దర్శకుడు బుచ్చిబాబు సానా. ఆయన దర్శకత్వంలో రూపొందించిన 'ఉప్పెన' చిత్రానికి ప్రేక్షకుల నుంచి విశేషాదరణ వస్తోంది. అయితే ఈ సినిమా తెరకెక్కించే క్రమంలో తాను ఎదుర్కొన్న సంఘటనలను పంచుకున్నారు.

Director Buchi Babu Sana latest interview
ఆ కథకు మూడేళ్లు మెరుగులు దిద్దా!

కొవిడ్‌ కారణంగా దాదాపు ఏడాది ఆలస్యంగా విడుదలైన 'ఉప్పెన'.. బాక్సాఫీసు దగ్గర కలెక్షన్ల సునామీ సృష్టించింది. తెలుగు సినిమా ప్రేమకథల్లో ప్రత్యేక స్థానాన్ని దక్కించుకుంది. ఈ కథ దర్శకుడు బుచ్చిబాబు సానా మానసపుత్రిక. సుకుమార్‌ శిష్యుడిగా పరిచయమై.. ఒక్క సినిమాతోనే ఉప్పెన బుచ్చిబాబుగా గుర్తింపు దక్కించుకున్నాడు. ఈరోజు కోసం అతడుకన్న కలలూ, చేసిన ప్రయాణం గురించి ఏం చెబుతున్నాడంటే..

'ఉప్పెన' సినిమా తీసిన ఉప్పాడ పక్కన కొత్తపల్లి మావూరు. ఉప్పాడ హైస్కూల్లోనే చదువుకున్నా. ఇంటర్మీడియట్‌కి కాకినాడ ఆదిత్యలో చేరా. అక్కడ చదువుకోవడమే నాకు టర్నింగ్‌ పాయింట్‌. చిన్నప్పట్నుంచీ సినిమాలంటే ఇష్టం. నేను కడుపులో ఉన్నప్పుడు అమ్మ ఎక్కువగా సినిమాలు చూసేదనీ అందుకే నాకూ సినిమా పిచ్చి పట్టుకుందనీ అంటుంటారు మా మావయ్యలు. స్కూల్‌ రోజుల్లో సినిమాలు చూసింది తక్కువే కానీ, చూస్తే మాత్రం ఫ్రెండ్స్‌కు ఆ కథ చెప్పేవాణ్ని. నేను చెప్పిన తర్వాత చాలామంది సినిమా చూసొచ్చి సినిమాకంటే నేను చెప్పిన కథే బావుందనేవారు. అదెలాగబ్బా అనుకునేవాణ్ని. కాకినాడ చైతన్య కాలేజీలో డిగ్రీకి చేరాను. అప్పటికే ఇంటర్మీడియెట్‌లో మాకు మ్యాథ్స్‌ చెప్పిన సుకుమార్‌ సర్‌ దర్శకుడిగా మారి 'ఆర్య' తీశారు. అది ఎంత సెన్సేషనో తెలిసిందే. దాంతో సినిమాల్లోకి వెళ్లడానికి నాకో దారి కనిపించింది. సినిమాలంటే ఇంట్లో అస్సలు ఒప్పుకోరు కాబట్టి ముందు హైదరాబాద్‌ వెళ్లాలనుకున్నాను.

అందుకోసమే ఎంబీఏ చేద్దామనుకున్నా. ఐసెట్‌లో మంచి ర్యాంకు సాధించి ఇక్కడ 'ప్రగతి మహా విద్యాలయ'లో సీటు సంపాదించా. ఆ తర్వాత కాకినాడలోని ప్రసాద్‌ సర్‌ సాయంతో సుకుమార్‌ గారిని కలిశాను. 'ముందు ఎంబీఏ పూర్తిచెయ్యి. తర్వాత కచ్చితంగా చేర్చుకుంటా' అన్నారు. ఎంబీఏ చేస్తున్నపుడు 'జగడం', 'ఆర్య-2' సినిమా షూటింగ్‌లు జరిగేవి. కాలేజీ ఒక పూటే ఉండేది. రెండో పూట వీలైతే షూటింగ్‌ జరిగేచోటుకు వెళ్లేవాణ్ని. అప్పుడు నన్ను చూసి 'ఎంబీఏ సర్టిఫికెట్‌ వచ్చాకే' అనేవారు సర్‌. చివరికి ఎంబీఏ పూర్తి చేసి సర్‌ దగ్గరకు వచ్చా.

స్టార్‌లతో అప్పుడే..
ఏ వాతావరణంలో అయితే ఫ్రెండ్లీగా ఉంటుందో అక్కడ బోరూ కొట్టదు, అయిష్టమూ ఉండదు. అందుకే టీమ్‌లో అందరితో ముందు ఫ్రెండ్‌షిప్‌ చేశా. సుక్కు సర్‌ తన డైరెక్షన్‌ టీమ్‌ని రైటింగ్‌లోనూ భాగం చేస్తారు. అలా ఆయన దగ్గర '100 పర్సెంట్‌ లవ్‌', 'వన్‌ నేనొక్కడినే', 'నాన్నకు ప్రేమతో', 'కుమారి 21ఎఫ్‌', 'రంగస్థలం' సినిమాలకు రెండు విభాగాల్లోనూ పనిచేశా. ఆ అనుభవం ఏ ఫిల్మ్‌ స్కూల్‌ కూడా ఇవ్వని నాలెడ్జ్‌ ఇచ్చింది. డౌట్‌ అడిగితే క్లాస్‌లో స్టూడెంట్స్‌కు చెప్పినట్టే విడమర్చి చెప్పేవారు. ఏ లెన్స్‌ ఎందుకు వాడారో, బ్యాక్‌ గ్రౌండ్‌ కలర్‌ ఎందుకు ఎంచుకున్నారో, స్క్రిప్టులో ఏ సీన్‌ ఎందుకు ఎక్కడ పెట్టారో అన్నీ వివరించేవారు.

కథ రాసేటపుడు ఒక్కో సందర్భానికి ఎన్నో వెర్షన్లు చెబుతుంటారు. వాటిలో ఏదైనా బాగా నచ్చితే గుర్తించి అక్కడ బ్రేక్‌ వేయాలి. లేకపోతే మరో వంద వెర్షన్లు చెబుతారు. కాపీ అస్సలు వద్దంటారు. సర్‌తో డిస్కషన్లు జరిగేటపుడు మన అభిప్రాయాలు చెప్పాలన్నా లోతుగా విషయం తెలియాలి. అందుకోసం చాలా పుస్తకాలు చదివేవాణ్ని. నన్నే కాదు, అసిస్టెంట్‌లందరినీ బాగా చూసుకుంటారు. ఎలాంటి పరిమితులూ పెట్టరు. నటీనటులతో కలిసిపోవాలని చెబుతారు. స్టార్‌ హీరోలైన మహేశ్​‌బాబు, ఎన్టీఆర్‌, రామ్‌చరణ్‌లతో సీన్లు వివరిస్తూ, మాట్లాడుతూ ఎంతో సరదాగా ఉండేవాళ్లం. 'రంగస్థలం' సమయంలో చిట్టిబాబు పాత్ర కోసం రామ్‌చరణ్‌తో రోజూ గోదావరి యాసలో మాట్లాడేవాణ్ని. 'వన్‌' సమయంలో మహేశ్​‌ గారి ఇంటికి వెళ్లి గౌతమ్‌తో చిన్న స్కిట్స్‌ చేయించేవాళ్లం. ఎన్టీఆర్‌ గారి ఎనర్జీ లెవెల్స్‌ వేరే స్థాయిలో ఉంటాయి. ఆయనతో కథలు చర్చించేవాళ్లం కూడా. ఈ అమూల్యమైన అనుభవం సుక్కు సర్‌ శిష్యరికంవల్లే సాధ్యమైంది.

Director Buchi Babu Sana latest interview
సుకుమార్​తో బుచ్చిబాబు

ఆ పేరే ధైర్యం.. భయం!
నా చుట్టూ జరిగే సంఘటనల్నే స్ఫూర్తిగా తీసుకుని కథలు రాసేవాణ్ని. వాటిని నా తోటి ఏడీలకు చెప్పేవాణ్ని. వాటన్నింటిలోకీ 'ఉప్పెన' కథకు మంచి స్పందన రావడం గమనించాను. ఆ కథను సర్‌కు చెప్పాను. 'బాగుందిరా బుచ్చీ. దీన్ని డెవలప్‌ చెయ్యి' అన్నారు. ఎంబీఏలో 'హై రిస్క్‌ హై ప్రాఫిట్‌' అని ఉంటుంది. నా మొదటి సినిమాకు ఈ సిద్ధాంతాన్ని ఫాలో అయ్యా. నేను రాసుకున్న క్లైమాక్స్‌ చాలా రిస్కుతో కూడింది. నా ఆలోచన అక్కడే మొదలైంది.

ఆ తర్వాత దాని చుట్టూ కథ అల్లుకున్నా. దాదాపు మూడేళ్లపాటు కథ మీద పనిచేశా. రోజూ ఉదయం, సాయంత్రం స్క్రిప్టు మొత్తం చదివేవాణ్ని. అలా కనీసం రెండువేల సార్లు కథకు మెరుగులు దిద్దుకున్నా. స్క్రిప్టు సిద్ధమయ్యాక మిగతావన్నీ సుక్కు సర్‌ వెనకుండి చూసుకున్నారు. ఆయన 'మైత్రీ' నిర్మాతల్ని తేవడమే కాదు సహ నిర్మాతగానూ ఉన్నారు. అది ఆనందంగానే అనిపించినా.. సుక్కు శిష్యుడి సినిమా అంటే ప్రేక్షకుల్లో కొన్ని అంచనాలుంటాయి, వాటిని అందుకోగలనా లేదా అన్న భయం వెంటాడేది.

హీరో కోసం ప్రయత్నిస్తున్నపుడు ఇన్‌స్టాగ్రామ్‌లో వైష్ణవ్‌ తేజ్‌ ఫొటోల్ని మా ఏడీ చూపించాడు. వెంటనే సర్‌కు చూపిస్తే ఆఫీసుకు పిలిపించారు. నన్ను దూరంగా ఉండి అన్నీ గమనించమన్నారు. వైష్ణవ్‌ని మొదటిసారి చూసినప్పుడే అతడే 'ఆశీర్వాదం' అని ఫిక్సయిపోయా. అతడి కళ్లు నన్ను ఆకర్షించాయి. కానీ, తనకు అప్పటికి సినిమా ఆలోచన లేదు. కథ నచ్చిన తర్వాత భిక్షు సర్‌, అరుణ మేడమ్‌ల దగ్గర యాక్టింగ్‌లో శిక్షణకు చేర్పించాం.

విజయ్‌ సేతుపతి గారి గురించి ప్రయత్నిస్తే.. 'సైరా కోసం హైదరాబాద్‌ వస్తున్నా కలుద్దాం!' అన్నారు. ఆయన కోసం స్క్రిప్టు మొత్తం తమిళంలోనూ రాయించా. తమిళం వచ్చిన ఏడీని తీసుకువెళ్లా.. ఆయన మాత్రం 'నువ్వు తెలుగులోనే కథ చెప్పు. కథ విన్నాక మాత్రం రెండు రోజులు ఆగి నిర్ణయం చెబుతా' అన్నారు. కథ పూర్తిగా విన్నాక రెండు నిమిషాలు ఆగి తమిళంలో ఏదో చెప్పారు. మావాళ్లు ఒక్కసారిగా చప్పట్లు కొట్టారు. నాకు విషయం అర్థం కాక చూస్తుంటే, 'సర్‌ చేస్తానన్నారు' అని చెప్పారు. హమ్మయ్యా అని ఊపిరి పీల్చుకున్నా. శేషరాయనం క్యారెక్టర్‌ రాస్తున్నపుడే విజయ్‌ సర్‌ను ఆ పాత్రలో ఊహించుకున్నా.

ఇక, హీరోయిన్‌ కోసమైతే మూడువేల ఫొటోలు చూసుంటా. మొదట ఒకమ్మాయిని ఎంపిక చేశాం. కానీ, హీరోతో కెమిస్ట్రీ సరిగ్గా కుదరలేదు. మళ్లీ హీరోయిన్‌ కోసం వెతకడం మొదలుపెట్టాం. దాంతో షూటింగ్‌ మొదలవ్వడానికి బాగా ఆలస్యమైంది. చివరికోరోజు 'పూరీ కనెక్ట్స్‌' ద్వారా కృతి ప్రొఫైల్‌ వచ్చింది. ముంబయి నుంచి రప్పించాం. అందంగా ఉంది కానీ, యాక్టింగ్‌లో అనుభవం లేదు. కొద్దిరోజులు మేమే శిక్షణ ఇచ్చాం. నిర్మాతలు నవీన్‌ సర్‌, రవి గారు అడిగినవన్నీ కాదనకుండా ఇచ్చారు. సినిమా లొకేషన్స్‌ అన్నీ నేను చిన్నపుడు తిరిగినవే. ఉప్పాడలో నా ఫ్రెండ్స్‌తోపాటూ ఊళ్లోవాళ్ళూ షూటింగ్‌ సమయంలో మాకు బాగా హెల్ప్‌ చేశారు.

చాలా సీన్లు సముద్రంలో, సముద్రం ఒడ్డునా చేశాం. కృత్రిమంగా అవన్నీ సృష్టించవచ్చు కానీ అలా చేయలేదు. మీసాలు తిప్పడమే మగతనం అనుకుంటాడో అబ్బాయి.. కానీ ఓ అమ్మాయి దృష్టిలో ఏది మగతనమో చెబుతుందీ కథ. సాంఘిక, శారీరక కట్టుబాట్లకంటే ప్రేమ గొప్పదని చెప్పాలనుకున్నా. కానీ అది పది నిమిషాలే ఉండాలి. మిగతా రెండు గంటలూ కథని ఆసక్తిగా మలచాలి. సుక్కు సర్‌ శిష్యరికంవల్ల ప్రతి సీనూ, మాటా మిగతా వాటితో లింకుగా ఉండేలా తీశా.

అదే బ్యానర్‌లో మళ్లీ!
2020 ఏప్రిల్‌ 2.. ఉప్పెన రిలీజ్‌ అవ్వాల్సింది. అప్పటికి 'నీ కన్ను నీలి సముద్రం' పాటతో ఒక్కసారి అందరి దృష్టీ 'ఉప్పెన' వైపు మళ్లింది. రీరికార్డింగ్‌ పూర్తయింది చెన్నై వచ్చి చూడమన్నారు దేవీ సర్‌. అంతలోనే లాక్‌డౌన్‌ ప్రకటించారు. కానీ, ఆ ఒక్క పాటతోనే 'ఉప్పెన' ఎప్పుడు వస్తుందా? అని జనాలు ఎదురుచూశారు. ఏదైనా మనమంచికే అనుకోవాలి. ఈసారి ప్రేమికుల రోజు సందర్భంగా రిలీజ్‌ చేశాం. సరిగ్గా అప్పుడే థియేటర్లలో వంద శాతం సీట్లకు అనుమతి ఇచ్చారు. జనాలు థియేటర్లకు వరసలు కట్టారు.

'ఉప్పెన' కాస్తా.. పెను ఉప్పెనగా మారింది. చిన్న ప్రేమకథకు ఈ స్థాయి స్పందన రావడానికి కారణం నా ఎంబీఏ నేపథ్యం కూడా. చిరంజీవి గారి కుటుంబానికి చెందిన హీరో అయితే సినిమాకు మంచి క్రేజ్‌ వస్తుందని ఏరికోరి వైష్ణవ్‌ని ఎంచుకున్నా. విజయ్‌ సేతుపతికి జాతీయస్థాయిలో పేరుంది. ఆయనుంటే సినిమా రీచ్‌ అదే స్థాయిలో ఉంటుందని పట్టుబట్టా. ప్రేమకథకు పాటలు చాలా ముఖ్యం. దేవీశ్రీ గారి వల్ల ఆలోటు తీరింది. ఆపైన బ్లాక్‌ బస్టర్లు ఇచ్చిన 'మైత్రీ' బ్యానర్‌.. వీటన్నిటితో సినిమా ప్రకటించిన రోజునుంచీ జనాల్లో ఆసక్తి ఏర్పడింది. 'శ్రీమంతుడు', 'జనతా గ్యారేజ్‌', 'రంగస్థలం' తర్వాత మైత్రీ బ్యానర్‌లో వచ్చిన బ్లాక్‌ బస్టర్‌ 'ఉప్పెన'. ఈ సినిమా రూ.100 కోట్లు వసూలు చేసింది. ఎన్టీఆర్‌ హీరోగా ఈ బ్యానర్‌లోనే నా తదుపరి సినిమా ఉంటుంది.

ఫ్రేమ్‌ కట్టించుకుంటా!

చిరంజీవితో బుచ్చిబాబు

ఈ సినిమా విషయంలో చిరంజీవి గారికి ప్రత్యేకంగా థ్యాంక్స్‌ చెప్పాలి. వైష్ణవ్‌కు మొదట కథ వినిపించాక 'పెద్ద మామయ్యకి చెబుతారా' అన్నాడు. వారం గడువు ఇచ్చారు. ఆ ఏడు రోజులూ ఎన్నో రిహార్సల్స్‌ చేశా. చిరంజీవిగారే హీరో అయితే ఎలా కథ చెబుతానో అలా చెప్పా. కథ మొత్తం విన్నాక ఇది మంచి హిట్‌ ఫార్ములా అని చెప్పి.. 'నువ్వు చేస్తావా, నన్ను చేయమంటావా' అని వైష్ణవ్‌తో అన్నారు. నిజానికి వేరే సినీ కుటుంబం వాళ్లయితే ఫస్ట్‌ సినిమాకు ఇలాంటి ప్రాజెక్టు ఓకే చేయకపోవచ్చు! షూటింగ్‌ జరుగుతున్నన్ని రోజులూ ఎలా వస్తోందని వాకబు చేసేవారు చిరంజీవి. సినిమాను డిస్ట్రిబ్యూటర్లకి అమ్మకుండా సొంతంగా రిలీజ్‌ చెయ్యమని నిర్మాతలకు సూచించారు. కలెక్షన్లు అనుకున్నంతగా రాకుంటే వాళ్లతో తాను చేయబోతున్న సినిమాకు ఆ మేరకు కోత పెట్టమన్నారు. ఇంకెవరైనా అయితే ఇవన్నీ చేస్తారనుకోను. (ఈ సినిమా రూ.100 కోట్లు వసూలు చేసింది). 'కథ చెప్పినదానికంటే సినిమా ఇంకా బాగా తీశావ్‌' అంటూ నాకో లేఖ రాశారు. దాన్ని ఫ్రేమ్‌ కట్టించి మా ఇంట్లో పెట్టుకుంటా.

మా తాత పేరు సానా బుచ్చి రాయుడు. ఆయన పేరే నాకు పెట్టారు. నాన్న వెంకట్రావు రైతు. అమ్మ గంగా భవాని. నా శ్రీమతి తార. మేనమామ కూతురే. మాకు ఒక పాప జ్ఞాప్తిక. నాకో చెల్లి.. విజయ, డాక్టర్‌. తను మెడిసిన్‌లో చేరాక 'జీవితంలో నువ్వెప్పుడు సెటిల్‌ అవుతావ్‌!' అంటూ నామీద బాగా ఒత్తిడి పెరిగిపోయింది. 'ఉప్పెన' వచ్చేదాకా రోజూ ఏదోరకంగా ఆ ఒత్తిడి ఉందంటే నమ్మండి!

మా గురువు గారు ఒక మాట అంటుంటారు.. 'సినిమాకన్నా ఏదీ ముఖ్యం కాదు. ఆఖరికి ఆరోగ్యం కూడా' అని. అనడమే కాదు స్క్రిప్టు గురించే 365 రోజులూ, 360 డిగ్రీల కోణంలో ఆలోచిస్తూ ఉంటారు. నాకూ అదే అలవాటైపోయింది. ఈ విజయంతో నా బాధ్యత మరింత పెరిగింది. ఈ సినిమా రిలీజ్‌ తర్వాత తెలుగు హీరోలూ, దర్శకులందరూ కొత్త ప్రయత్నం చేశారని ఫోన్‌చేసి మరీ మెచ్చుకున్నారు. కొవిడ్‌ తర్వాత ప్రేక్షకులు థియేటర్లకు వస్తారా రారా అన్న సందేహం ఉండేది. 'ఉప్పెన' ఆ సందేహాల్ని పటాపంచలు చేసి ఇండస్ట్రీకి ధైర్యం ఇచ్చినందుకు ఇంకా సంతోషంగా ఉంది.

Last Updated : Mar 14, 2021, 11:52 AM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.