మలయాళ, తెలుగులో సాహసిక దర్శకురాలిగా అత్యధిక సినిమాలకు దర్శకత్వం వహించిన మహిళగా గిన్నిస్ రికార్డులకెక్కారు విజయ నిర్మల. ఆమె ఏకంగా 42 సినిమాలకు దర్శకత్వం వహించింది. తన జీవిత భాగస్వామి కృష్ణతో 50 చిత్రాల్లో నటించి రికార్డు నెలకొల్పిన విజయనిర్మల జయంతి (ఫిబ్రవరి 20, 1944) ఈరోజు. ఈ సందర్భంగా నిర్మలమ్మ గురించి కొన్ని విశేషాలు...
తమిళ చిత్రాల్లో బాలనటిగా...
విజయనిర్మల పుట్టింది మద్రాసులో. పుట్టిన రోజు 20 ఫిబ్రవరి 1944. సమర్ది శకుంతలాదేవి, రామమోహనరావు తల్లిదండ్రులు. ఆమెకు ఒక అన్నయ్య, ఇద్దరు తమ్ముళ్లు. నిర్మలమ్మకు నాట్యం మీద అభిరుచి ఉండటం గమనించిన తండ్రి తిరు వెంకట ముదలియార్ వద్ద భరతనాట్యంలో శిక్షణ ఇప్పించారు. ఆమె నాట్యం చేయడం గమనించిన విజయ నిర్మల స్నేహితుడు ఒక తమిళ చిత్రంలో నటించే అవకాశాన్ని కలిపించాడు. ఆ సినిమా పేరు 'మచ్చరేకై' (1953). అందులో బాల హీరో పాత్రలో విజయనిర్మల నటించింది. బాలతారగా నటించిన మూడవ చిత్రం 'మనంపోల్ మాంగల్యం'లో ఒక రైలులో బిచ్చమెత్తుకునే అమ్మాయి పాత్ర చేసి అందరిని ఆకట్టుకుంది.
పాండురంగ మహత్మ్యం సినిమాలో బాలనటిగా ...
మహారాష్ట్రకు చెందిన భక్త పుండరీకాక్షుని కథ ఆధారంగా ఎన్.ఎ.టి సంస్థ 'పాండురంగ మహత్మ్యం' (1957) చిత్రాన్ని నిర్మించింది. విజయనిర్మల గతంలో బాలనటిగా నటించిన ‘మచ్చరేకై’ సినిమాను రామారావు చూసి ఉండడం వల్ల విజయనిర్మలను ఎంపికచేసి 'జయకృష్ణా ముకుందా మురారి' పాటలో బాలకృష్ణుని వేషం ఆమె చేత వేయించారు. తరువాత 'భూకైలాస్' (1958) చిత్రంలో 'రాముని అవతారం రఘుకుల సోముని అవతారం' అనే పాటలో సీత పాత్రలో బాలనటిగా చివరిసారిగా కనిపించింది.
మలయాళ చిత్రంలో హీరోయిన్‌గా...
1964 మలయాళ నిర్మాత పారీకుట్టి ప్రముఖ ఛాయాగ్రాహకుడు విన్సెంట్ దర్శకత్వంలో 'భార్గవి నిలయం' అనే సినిమాతో హీరోయిన్‌గా విజయనిర్మలను పరిచయం చేశారు. అంతేకాదు.. మలయాళంలో రూపుదిద్దుకున్న తొలి హార్రర్ చిత్రం కూడా ఇదే. ఈ సినిమా సూపర్ హిట్‌గా నిలిచి విజయనిర్మలకు మంచి పేరు ఆర్జించి పెట్టింది. ఈ చిత్ర విజయంతో విజయ మలయాళ చిత్రాల్లో హీరోయిన్‌గా బిజీ అయిపోయింది.
రంగులరాట్నంతో తెలుగులో...
1966లో ప్రముఖ దర్శకనిర్మాత బి.ఎన్.రెడ్డి 'రంగులరాట్నం' చిత్రాన్ని ప్రారంభిస్తూ చంద్రమోహన్‌ని హీరోగా తీసుకున్నారు. అతని చెల్లెలు పాత్రను విజయనిర్మలకు ఆఫర్ చేశారు బి.ఎన్.రెడ్డి. ఈ చిత్రం తరువాత విజయనిర్మలకు తెలుగులో అవకాశాలు మెరుగవడం వల్ల మలయాళ చిత్రాల్లో నటించడం దాదాపు మానుకుంది. అడపాదడపా 'సిత్తి', 'పణమా పాశమా' వంటి చిత్రాల్లో నటిస్తూ తన పయనాన్ని తెలుగు చిత్రసీమ వైపు నడిపించింది.
మీసాల కృష్ణకు దగ్గరై...
బాపు దర్శకునిగా తొలిసారి మెగాఫోన్ పట్టుకున్న సినిమా నందనా ఫిలిమ్స్ బ్యానర్ మీద నిర్మించిన 'సాక్షి'. అందులో కృష్ణ, విజయనిర్మల హీరో, హీరోయిన్లు. 'సాక్షి' సినిమా తొలి సన్నివేశ చిత్రీకరణ జరుగుతున్నప్పుడు వీరి పరిచయం ఏర్పడింది. అలా వారిద్దరూ కలిసి మూడు నాలుగు సినిమాలు చెయ్యగానే పెళ్లి చేసుకోవాలని తీర్మానించుకున్నారు.
1969 మార్చి 24న తిరుపతిలో ఇద్దరూ పెళ్లి చేసుకుని, పులిదిండి వెళ్లి మరలా గుడిలో దండలు మార్చుకున్నారు. పెళ్లి చేసుకున్న తరువాత ఆమె కెరీర్‌కు ఫుల్ స్టాప్ పడినట్లే అని అందరూ భావించారు. కానీ వారిద్దరూ కలిసి యాభైకి పైగా సినిమాల్లో జంటగా నటించి రికార్డు సృష్టించారు. మొత్తంగా తెలుగులో విజయనిర్మల వందకు పైగా చిత్రాల్లో నటించారు.
అనంతరం దర్శకురాలిగా 1973లో 'కవిత' అనే మలయాళ చిత్రం చేసింది. తరువాత తెలుగులో 'మీనా' చిత్రానికి దర్శకత్వ బాధ్యతలు నిర్వహించింది. 'మీనా' చిత్రం సూపర్ హిట్‌గా నిలిచి విజయనిర్మలకు దర్శకురాలిగా నీరాజనాలు పలికింది. అలా దర్శకురాలిగా పేరుతెచ్చుకున్న విజయనిర్మల తీసిన చిత్రాల్లో అద్భుత విజయాలతో పాటు కొన్ని పరాజయాలు ఉన్నాయి.
మరిన్ని విశేషాలు...
తన సినీప్రస్థానంలో 42 సినిమాలకు దర్శకత్వం వహించి అంతకు ముందు ఇటలీ దర్శకురాలు పేరిట వున్న 27 సినిమాల మహిళా దర్శకత్వ రికార్డును తిరగరాసింది నిర్మలమ్మ. గిన్నిస్ రికార్డును అందుకుంది. ఇది కేవలం ఒక తెలుగు మహిళకే సాధ్యమైన విశేషం. ఆమెకు ప్రతిష్టాత్మక 'రఘుపతి వెంకయ్య' రాష్ట్ర అవార్డును ఇచ్చి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం గౌరవించింది. విజయకృష్ణ బ్యానర్ మీద ఎన్నో సినిమాలు నిర్మించారు. ఇంతటి గొప్ప నటి, దర్శకరాలు జూన్ 27, 2019న దూరతీరాలకు పయనమయ్యారు.