చిన్న చిన్న కళ్లు అతనివి. కానీ వెయ్యిమాటలకు సరిపడా భావాలను అవలీలగా పలికిస్తాయి. ఆ ముఖ వర్చస్సుకు.. ఆ సమ్మోహనానికి ఎంతటి వారైనా సరే ఫిదా అవ్వాల్సిందే. నటనకు మించి ఆయనలో అనిర్వచనీయమైన ప్రతిభ దాగుంది. బాలీవుడ్‌గా పిలుచుకునే హిందీ సినిమాకు దిశానిర్దేశం చేసిన వ్యక్తి ఆయన. నటన అంటే కేవలం డైలాగులు బాగా చెప్పటమే అనుకునే రోజుల్లో.. నటుడంటే ఆ పాత్రను ప్రజల మనసుల్లో చిరస్థాయిగా నిలిచిపోయేలా చేసేవాడు అని నిరూపించిన ప్రతిభాశాలి. పంచేది ప్రేమైనా.. పలికించాల్సింది విషాదమైనా.. అతడే చిరునామా అనేంతలా ప్రేక్షకుల హృదయాల్లో చెరగని ముద్ర వేశాడు. పచ్చగడ్డి వేస్తే భగ్గుమనే స్థాయి గొడవలున్నా.. భారత్, పాకిస్థాన్ దేశాలు ఆయన్ను అమితంగా ప్రేమించి.. అత్యున్నతంగా గౌరవించుకున్నాయంటే ఆయన స్థాయి ఏంటో అర్థం చేసుకోవచ్చు. నటనకు ఆయన మకుటమని.. భారతీయ చిత్రపరిశ్రమలో తొలి మెథడ్ యాక్టర్ అని.. ఆల్ టైం గ్రేట్ సత్యజిత్ రే నుంచి ప్రశంసలు అందుకున్న ఆ నటమేరువే.. దిలీప్ కుమార్.
హిందీ సినిమాల్లో దిలీప్ కుమార్ ప్రస్థానం చాలా సాదాసీదాగా ప్రారంభమైంది. ఏడున్నర దశాబ్దాల తర్వాత.. తన గురించి భావితరాలు మాట్లాడుకునేంత గొప్ప నటుడవుతాడని దిలీప్ కుమార్‌ను అప్పట్లో ఎవరూ ఊహించి ఉండరు కూడా. అవిభక్త భారత్‌లో.. 1922 డిసెంబర్ 11న పాకిస్తాన్‌లోని పెషావర్‌లో దిలీప్ కుమార్ జన్మించారు. ఆయన అసలు పేరు మహమ్మద్ యూసుఫ్ ఖాన్. తండ్రి పేరు లాలా గులామ్ శర్వార్ ఖాన్, తల్లి పేరు ఆయేషా బేగం. తన తల్లితండ్రులకున్న 12 మంది సంతానంలో ఒకడైన యూసుఫ్ ఖాన్.. తండ్రితో కలిసి తమకున్న పండ్లతోటలో పనిచేసేవాడు. తండ్రికి పండ్ల వ్యాపారంలో సహకరించేవాడు.
కొన్ని సంవత్సరాల తర్వాత.. శర్వార్ ఖాన్.. పిల్లల చదువు కోసం కుటుంబాన్ని మహారాష్ట్రలోని నాసిక్‌కు మార్చారు. అలా దిలీప్ కుమార్ విద్యాభ్యాసమంతా నాసిక్‌లోనే సాగింది. అక్కడే తర్వాతి కాలంలో గొప్పనటుడిగా పేరు తెచ్చుకున్న రాజ్ కపూర్‌తో పరిచయం ఏర్పడింది. బాల్యమిత్రుడిగా రాజ్ కపూర్‌తో చాలా కలివిడిగా ఉండేవాడు. అనంతరం 1940 ప్రాంతంలో తన తండ్రితో ఏర్పడిన మనస్పర్థల కారణంగా ఇంటి నుంచి బయటికి వచ్చేశాడు దిలీప్‌కుమార్. తనకు ఆంగ్లంలో ఉన్న ప్రావీణ్యంతో ఓ శాండ్ విచ్ స్టాల్ పెట్టుకుని సంపాదించిన 5వేల రూపాయల డబ్బుతో ముంబయికి పయనమయ్యాడు.
అలా దిలీప్‌గా మారిన యూసఫ్
1943లో తన తండ్రి ఆర్థిక ఇబ్బందుల్లో కూరుకుపోవటం వల్ల.. దిలీప్‌కుమార్ మళ్లీ ఉద్యోగం చేయటం అనివార్యమైంది. అలా తన పరిచయాలతో.. మలాడ్‌లో బాంబే టాకీస్‌లో ఏదైనా ఉద్యోగం దొరుకుతుందేమో అన్న ఆశతో వెళ్లాడు. అక్కడే బాంబే టాకీస్ యజమాని, ప్రముఖ నటి దేవికారాణి పరిచయం ఏర్పడింది. ఉద్యోగం కోసం అడిగిన దిలీప్‌కుమార్‌ను సినిమాల్లో నటించాల్సిందిగా దేవికారాణి సూచించారు. నెలకు 1250 రూపాయలు వచ్చేలా చేస్తానని హామీ ఇవ్వటం వల్ల... ఆశ్చర్యపోయిన దిలీప్‌కుమార్ అనుకోకుండా నటన వైపు అడుగులు వేశారు. అప్పటివరకూ యూసుఫ్ ఖాన్‌గా ఉన్న పేరును దిలీప్ కుమార్‌గా మార్చింది దేవికారాణినే. ప్రముఖ నటుడు అశోక్ కుమార్, నిర్మాత శశిధర్ ముఖర్జీ పరిచయంతో దిలీప్ కుమార్ సినిమా అవకాశాలు ఊపందుకున్నాయి. ప్రత్యేకించి అతనిలోని సహజ నటనను ఎప్పటికీ వదులుకోవద్దని అశోక్ కుమార్.. దిలీప్ కుమార్‌కు పదేపదే సూచించే వారట. అలా నటనపై పట్టు సాధించిన దిలీప్ కుమార్‌ను బాంబే టాకీస్ నిర్మాణ సారథ్యంలో 1944లో రూపొందిన "జ్వర్ భాటా" ద్వారా దిలీప్ కుమార్ తొలిసారిగా నటుడిగా వెండితెర మీద మెరిశారు.
కెరీర్‌లో మైలురాయి
తొలి చిత్రం అనంతరం 1945లో 'ప్రతిమ', 1947లో 'నౌకా డూబీ' చిత్రంలో నటించినా.. దిలీప్ కుమార్‌కు మాత్రం అంతగా గుర్తింపు రాలేదు. ఆ రెండు చిత్రాలు బాక్సాఫీస్ వద్ద పరాజయం పాలయ్యాయి. 1947లో వచ్చిన 'జుగ్ను' చిత్రం దిలీప్ కుమార్ కెరీర్‌లో మైలురాయి. అక్కడి నుంచి దిలీప్ కుమార్ శకం ఆరంభమైంది. 1948లో విడుదలైన 'షహీద్' చిత్రంతో దిలీప్ కుమార్ స్టార్‌గా మారిపోయాడు. అఫ్పుడే ప్రముఖ నటి కామినీ కౌశల్‌తో దిలీప్ కుమార్‌కు పరిచయం ఏర్పడింది. షహీద్ చిత్రంతో విజయవంతమైన జంటగా వారిద్దరూ పేరు తెచ్చుకున్నారు. ఆ తర్వాత నదియా కేపార్, షబ్నం, అర్జూ వంటి హిట్ చిత్రాల్లో వీరిద్దరూ జంటగా నటించారు.
'లక్కీ మస్కట్' దిలీప్
1949లో తొలిసారిగా తన బాల్యమిత్రుడు రాజ్ కపూర్‌తో కలిసి నటించాడు దిలీప్ కుమార్. అంతకు ముందు 11 చిత్రాలు ఫ్లాప్ కావటం వల్ల తీవ్ర నిరాశలో కూరుకుపోయి ఉన్న రాజ్ కపూర్‌తో కలిసి రొమాంటిక్ మెలో డ్రామా అందాజ్‌లో దిలీప్ నటించారు. ఈ మల్టీస్టారర్ అత్యద్భుత విజయం సాధించి రాజ్ కపూర్ కెరీర్‌కు మళ్లీ ఊపిర్లు ఊదింది. అచ్చం రాజ్ కపూర్ లానే దేవానంద్‌కు 1946-47లో మూడు సినిమాలు వరుస పరాజయం పాలయ్యాయి. ఈ తరుణంలో 1948 దేవానంద్‌తో కలిసి 'జిద్దీ' సినిమాలో నటించారు దిలీప్ కుమార్. ఆ చిత్రం భారీ సక్సెస్ సాధించటం వల్ల దిలీప్ కుమార్ అందరికీ అదృష్టంలా మారిపోయారు. ఆ రోజుల్లో దిలీప్ కుమార్‌ను 'లక్కీ మస్కట్' అని పిలుచుకునేవారు. 1950ల నాటికి హిందీ సినిమా అంటే దిలీప్ కుమార్, రాజ్ కపూర్, దేవానంద్‌ల పేర్లే వినిపించేవి. ఆ స్థాయిలో ప్రేక్షకుల హృదయాల్లో తమ నటనతో స్థానం సంపాదించారు ఈ ముగ్గురు దిగ్గజ నటులు.
ఇదీ చూడండి.. Dilip Kumar: 'ట్రాజెడీ కింగ్' సినీ ప్రస్థానం సాగిందిలా..!
Dilip Kumar: దిలీప్ కుమార్‌కు ప్రముఖుల నివాళి
Dilip Kumar: బాలీవుడ్ దిగ్గజ నటుడు దిలీప్ కుమార్ కన్నుమూత