ముంబయి డ్రగ్స్(aryan khan drugs case) వ్యవహారం కొత్తమలుపులు తిరుగుతున్నట్లు కనిపిస్తోంది. ఈ ఆపరేషన్‌కు నేతృత్వం వహించిన ఎన్‌సీబీ అధికారి సమీర్ వాంఖడేను టార్గెట్ చేస్తూ మహారాష్ట్ర మంత్రులు ఇప్పటికే ఆరోపణలు చేశారు (ncb raids cruise drugs party). ఈ ఆరోపణలపై వాంఖడే ఇదివరకే దీటుగా బదులిచ్చారు. తాజాగా ఈ వ్యవహారంలో సాక్షిగా ఉన్న ప్రభాకర్ సెయిల్ అనే వ్యక్తి దర్యాప్తు సంస్థ ఎన్‌సీబీపైనే సంచలన ఆరోపణలు చేశాడు. ఈ కేసులో పరారీలో ఉన్న గోసవీ-దర్యాప్తు సంస్థ మధ్య రహస్య ఒప్పందం, ముడుపుల వ్యవహారం నడుస్తోందని చెప్పాడు. మాదక ద్రవ్యాల నియంత్రణ సంస్ధ సీనియర్ అధికారి సమీర్ వాంఖడే సహా ఇతరులకు లంచంగా ఇచ్చేందుకు రూ.18 కోట్ల రూపాయల ఒప్పందం కుదిరిందని ఆరోపించాడు. అంతేకాకుండా ఈ డ్రగ్స్ కేసులో ఎన్‌సీబీ తనతో బ్లాంక్ పంచనామాపై బలవంతంగా సంతకం చేయించుకుందని అన్నాడు.
మరో మలుపు
అక్టోబర్ 3న ముంబయి తీరంలోని క్రూయిజ్ నౌకలో(cruise drug party in mumbai) జరిగిన మాదక ద్రవ్యాల పార్టీలో బాలీవుడ్ నటుడు షారుక్ ఖాన్ తనయుడు ఆర్యన్ ఖాన్ అరెస్ట్ అయిన నాటి నుంచి ప్రధాన రాజకీయ పార్టీల మధ్య విమర్శల పర్వం కొనసాగుతుండగా తాజాగా వెలుగులోకి వచ్చిన ఓ విషయం కలకలం రేపుతోంది. ఆర్యన్ కేసు(mumbai rave party) దర్యాప్తునకు నాయకత్వం వహిస్తున్న మాదక ద్రవ్యాల నియంత్రణ సంస్ధ జోనల్ డైరెక్టర్ సమీర్ వాంఖడేపై లంచం ఆరోపణలు రావడం కేసును మరో మలుపు తిప్పుతోంది. ప్రైవేటు డిటెక్టివ్‌గా ఉన్న కేపీ గోసవి అనే వ్యక్తి ఆర్యన్ కేసులో స్వతంత్ర సాక్షిగా ఉన్నారు. పరారీలో ఉన్న గోసవికి ప్రభాకర్ సెయిల్ అనే వ్యక్తి అంగరక్షకుడు. ఇతడు కూడా ఆర్యన్ డ్రగ్స్ కేసులో సాక్షి. నార్కోటిక్ డ్రగ్స్ కోర్టులో అఫిడవిట్ సమర్పించిన ప్రభాకర్ ఇందులో సంచలన ఆరోపణలు చేశారు. గోసవీ-ఎన్సీబీ మధ్య రహస్య ఒప్పందం, ముడుపుల వ్యవహారం నడుస్తోందని ఆయన సంచలన ఆరోపణలు చేశారు.
రూ.25కోట్లు నుంచి రూ.18కోట్లకు
ఎన్సీబీ తరపున సామ్ డిసౌజ అనే వ్యక్తితో గోసవి ఒప్పందానికి సంబంధించి జరిపిన సంభాషణలను తాను విన్నానని తెలిపారు. ఇద్దరి మధ్య 25కోట్ల రూపాయలకు ప్రారంభమైన ఒప్పందం చివరకు 18కోట్ల రూపాయలకు కుదిరింది అని తెలిపారు. 18కోట్ల రూపాయలలో సమీర్ వాంఖడే వాటా 8 కోట్లు అని పేర్కొన్నారు. ఒప్పందంలో భాగంగా సమీర్ వాంఖడే, గోసవి తనతో ఖాళీ పత్రాలపై సంతకాలు చేయించుకున్నారని తెలిపారు. ఇదంతా అక్టోబర్ 2న అర్ధరాత్రి జరిగినట్లు తెలిపారు. తనతో సంతకాలు చేయించుకున్న తర్వాత గోసవి, డిసౌజా, షారూక్ మేనేజర్ పూజా దద్‌లానీ ఓ కారులో 15 నిమిషాలు సమావేశమైనట్లు వివరించారు. అనంతరం ముంబయిలోని ఓ హోటల్ నుంచి డబ్బు తేవాలని తనను గోసవి పురమాయించినట్లు తెలిపారు. డబ్బు తెచ్చి ముంబయిలోని ట్రిడెంట్ హోటల్ వద్ద సామ్ డిసౌజాకు 38లక్షల రూపాయలు ఇచ్చినట్లు ప్రభాకర్ సెయిల్ వివరించారు. క్రూయిజ్‌పై దాడి జరిగిన తర్వాత ఎన్నో నాటకీయ పరిణామాలు చోటుచేసుకున్నాయని పేర్కొన్నారు. వీటికి సంబంధించిన వీడియోలు, ఆధారాలు తన దగ్గర ఉన్నాయంటూ తెలిపారు. దర్యాప్తు అధికారి సమీర్ వాంఖడే నుంచి తనకు ప్రాణ హాని ఉందని ఆందోళన వ్యక్తం చేశారు.
ఖండించిన ఎన్సీబీ వర్గాలు
అయితే లంచం ఆరోపణలను ఎన్సీబీ వర్గాలు తోసిపుచ్చాయి. ఒక వేళ తమ అధికారులు డబ్బులు తీసుకుంటే నిందితులు జైళ్లో ఎందుకు ఉంటారని ప్రశ్నించాయి. ఈ ఆరోపణలు నిరాధారం అని మండిపడ్డాయి. తమ కార్యాలయంలో సీసీ-కెమెరాలు కూడా ఉన్నాయని తెలిపారు. అక్టోబర్ 2కు ముందు తాము ప్రభాకర్ సెయిల్‌ను ఎప్పుడూ కలవలేదని వివరించారు. తనపై వచ్చిన ఆరోపణలను ఎన్సీబీ అధికారి సమీర్ వాంఖడే కూడా ఖండించారు. అటు ఆర్యన్ ఖాన్‌తో గోసవి దిగిన సెల్ఫీ ఇప్పటికే సామాజిక మాధ్యమాల్లో వైరల్‌గా మారింది. ఆర్యన్‌కు గోసవికి మధ్య ఉన్న సంబంధంపై ఎన్‌సీబీ దృష్టి సారించింది.
ఇదీ చూడండి: జైలులో మత గ్రంథాలు కావాలని అడిగిన ఆర్యన్ ఖాన్