బాలీవుడ్ హీరోయిన్ దీపిక పదుకొణె భావోద్వేగానికి గురై, ఏడ్చేసింది. ఈ సంఘటన 'ఛపాక్' ట్రైలర్ లాంచ్ ఈవెంట్లో జరిగింది. మంగళవారం ఈ కార్యక్రమంలో పాల్గొన్న ఈ భామ.. ఇందులో తన పాత్ర గురించి చెప్పేందుకు మాటలు రావట్లేదంది. తన సినీ కెరీర్‌లో ఇది చాలా ప్రత్యేకమైన ప్రాజెక్టు అని చెప్పింది.
"ట్రైలర్ చూపించిన తర్వాత మేం వేదికపైకి వస్తామని మాత్రమే అనుకున్నా. కానీ మాట్లాడవలసి ఉంటుందని అనుకోలేదు. ట్రైలర్ చూసినప్పుడల్లా, నేను ... దీని గురించి తరువాత మాట్లాడుతా. నన్ను క్షమించండి" అంటూ దీపిక భావోద్వేగానికి గురైంది.
దీపిక పక్కనే ఉన్న దర్శకురాలు మేఘనా గుల్జార్.. "దీపిక.. 'ఛపాక్' పూర్తి ట్రైలర్ ఇప్పటి వరకు చూడలేదు. అందుకే ఇలా ఏడ్చేసింది. ఈ కథతో ఆమెకు ఎమోషనల్గా బంధం ఏర్పడింది" అని చెప్పింది.
తనను నమ్మి 'ఛపాక్'లో ఈ పాత్ర ఇచ్చినందుకు దర్శకురాలు మేఘనాకు దీపిక ధన్యవాదాలు చెప్పింది.
"ఇది నిజంగా నమ్మశక్యం కాని ప్రయాణం. నా కెరీర్‌లో ఇది అత్యంత ప్రత్యేకమైన చిత్రం. మేం ఏదైతే చూశామో.. ఆ కథనే సినిమాగా తీశాం. ప్రేమ, అభిరుచి, బాధ్యత, ఉత్సాహంతో తెరకెక్కించాం. 'ఛపాక్'ను మీరందరూ చూస్తారని ఆశిస్తున్నా" -దీపిక పదుకొణె, హీరోయిన్
యాసిడ్ బాధితురాలు లక్ష్మి అగర్వాల్ జీవితం ఆధారంగా 'ఛపాక్' తీశారు. ఆమె పాత్రలో దీపిక నటించింది. అతిక చౌహన్ కథనందించారు. జనవరి 10న ప్రేక్షకుల ముందుకు రానుంది.
ఇది చదవండి: ఎయిర్పోర్ట్లో యువహీరోతో దీపిక పదుకొణె స్టెప్పులు