కరోనా వ్యాప్తి తీవ్రమవుతున్న నేపథ్యంలో ప్రఖ్యాత ఆస్కార్ అవార్డు కమిటీ కీలక నిర్ణయం తీసుకుంది. వచ్చే ఏడాది నిర్వహించబోయే ఈ వేడుకల కోసం, కేవలం ఆన్లైన్లో స్ట్రీమింగ్ అయ్యే చిత్రాలకు మాత్రమే అవకాశం కల్పిస్తున్నట్లు తెలిపింది. ప్రస్తుతం ప్రపంచవ్యాప్తంగా థియేటర్లు మూతపడటం వల్లే ఈ నిర్ణయం తీసుకున్నట్లు, అకాడమీ ఆఫ్ మోషన్ పిక్చర్స్.. మంగళవారం ఓ ప్రకటన విడుదల చేసింది. ఆస్కార్ అవార్డుల సుదీర్ఘ చరిత్రలో ఇటువంటి నిర్ణయం తీసుకోవడం ఇదే తొలిసారి.
సాధారణంగా ఆస్కార్‌కు పోటీపడాలంటే లాస్ఏం జిల్స్ కౌంటీలోని కమర్షియల్ మోషన్ పిక్చర్ థియేటర్‌లో కనీసం 7 రోజుల పాటు చిత్రాన్ని ప్రదర్శించాలన్న నిబంధన ఉంది. ఈ ఏడురోజుల వ్యవదిలో రోజుకు కనీసం 3 సార్లు ఆ చిత్రాన్ని ప్రదర్శించాలి. కానీ లాక్డౌన్ నేపథ్యంలో థియేటర్లు మూతపడడం వల్ల ఈ ప్రక్రియ జరగడం కుదరదు. కాబట్టి ఈ నిర్ణయం తీసుకుంది అకాడమీ ఆఫ్ మోషన్ పిక్చర్స్.
పోటీపడే చిత్రాలను ప్రసార వెబ్‌సైట్‌లో విడుదలైన 60 రోజుల్లోపు.. ఆస్కార్ అవార్డు స్క్రీనింగ్ రూమ్‌కు పంపించాలని తెలిపింది. ఒకవేళ థియేటర్లు తెరుచుకుంటే ఈ నిబంధనలు వర్తించవని వెల్లడించింది.
వచ్చే ఏడాది ఫిబ్రవరి 28న జరుగబోయే ఈ ఆస్కార్ అవార్డుల ప్రదానోత్సవాన్ని ఏబీసీ టీవీ ఛానెల్లో ప్రసారం చేయనున్నట్లు తెలిపింది.
ఇదీ చూడండి : బాలీవుడ్ నటుడు ఇర్ఫాన్ ఖాన్ కన్నుమూత