AlithoSaradaga Bramhanandam: ఆలీ వ్యాఖ్యాతగా ఈటీవీలో ప్రసారమయ్యే ఎంటర్‌టైనింగ్ షో 'ఆలీతో సరదాగా' కార్యక్రమానికి 'కామెడీ కింగ్' బ్రహ్మానందం విచ్చేసి సందడి చేశారు. ఈ సందర్భంగా షో నిర్వాహకులు ఆయనకు ఘన స్వాగతం పలికారు. పుష్పవర్షం కురిపించారు. నవంబరు 29న ఈ ఆసక్తికర ఎపిసోడ్ ప్రసారం కానుంది. ఈ నేపథ్యంలో రెండో ప్రోమోను విడుదల చేశారు. అందులో కొన్ని ఆసక్తికర ప్రశ్నలు, బ్రహ్మానందం చెప్పిన సమాధానాలు మీకోసం..
కన్నెగంటి బ్రహ్మానందం. ఎక్కడ పుట్టారు? ఎక్కడ పెరిగారు? ఎక్కడ చదివారు? ఎక్కడ సెటిల్ అయ్యారు?
బ్రహ్మానందం: ఇవన్నీ ఎందుకురా(నవ్వులు)
మనం ఎక్కడ కలిశామో తెలుసా?
బ్రహ్మానందం: 'చంటబ్బాయి' సినిమా చేస్తుండగా అల్లు రామలింగయ్యగారితో కలిసి చేసే సీన్‌లో ఆయనే నిన్ను పరిచయం చేశారు.
జంధ్యాల ఎక్కడ పరిచయం?
బ్రహ్మానందం: మీ అందరినీ నవ్వించే శక్తి నా దగ్గర ఉందని గుర్తించిన వ్యక్తి జంధ్యాలగారు. ఆ తర్వాత నా బతుకు మీకు తెలిసిందే!
సరకులతో పాటు మీనాన్న తాడు కూడా కొనేవారట!
బ్రహ్మానందం: ఊరుకోవయ్యా(నవ్వులు). మేము ఎనిమిది మంది పిల్లలం. 'ఒరేయ్ నాన్న పిలిచాడురా' అని ఎవరైనా అంటే 'ఓహో ఎవర్ని ఐదో నంబరు’ ఇక వాడు వెళ్లిన తర్వాత ఆర్‌ఆర్ మ్యూజిక్ తప్ప మరొకటి వినిపించేది కాదు. మిమ్మల్ని నవ్వించడానికే ఈ ఏడుపు.
మీ ఎదుగుదల మీ తల్లిదండ్రులు చూశారు కదా?
బ్రహ్మానందం: సత్తెనపల్లి థియేటర్‌లో అమ్మానాన్నలను కూర్చొబెట్టి సినిమా చూపించా. నాన్నకు దూరం నుంచి సరిగా కనపడేది కాదు. థియేటర్‌లో జనం నవ్వులు విని 'ఏంటిరా ఇంతమందిని ఎలా నవ్విస్తున్నావు' అన్న సంఘటన గుర్తొస్తే తెలియని భావోద్వేగం కలుగుతుంది.
చిరంజీవి ఎలా పరిచయం అయ్యారు?
బ్రహ్మానందం: జంధ్యాల గారు చిరంజీవి గారికి పరిచయం చేస్తూ 'ఈయన బ్రహ్మానందం. కాలేజీ లెక్చరర్ అని చెబుతారండీ. ఎంతవరకూ నిజమో తెలియదు' అని అన్నారు. ఆ తర్వాత నాకు తెలిసిన విషయాలన్నీ చిరుతో చెబుతుంటే 'మీరు ఇక్కడ ఉండటానికి వీల్లేదు. మీరు సినిమాల్లో ఎలా నటించాలో నేను చూసుకుంటా' అని అన్నారు. మొదటిసారి విమానం ఎక్కింది ఆయనతోనే!
- " class="align-text-top noRightClick twitterSection" data="">
నటుడు అయిన తర్వాత అందుకున్న మొదటి అవార్డు!
బ్రహ్మానందం: సైరాభాను గారు వేదికపై ఉండగా, దిలీప్‌కుమార్‌గారి చేతుల మీదుగా తొలిసారి అవార్డు అందుకున్నా. నా ఆనందానికి అవధులు లేవు.
ఎవరైనా సన్మానం చేస్తే ఇంటికి వచ్చి నేలపై పడుకుంటారట!
బ్రహ్మానందం: చాలా గమ్మత్తైన విషయం. నాకు సన్మానమై ఇంటికి రాగానే లుంగీ కట్టుకుని, దుప్పటి వేసుకుని నేలపై పడుకుంటా. అది ఇంట్లో వాళ్లకూ అలవాటై పోయింది. నేను సన్మానం నుంచి రాగానే నా ముఖాన లుంగీ, దుప్పటి పడేస్తారు(నవ్వులు)
'వివాహభోజనంబు' చేస్తుండగా చాలా జరిగాయట!
బ్రహ్మానందం: ఇసుకలో పీకల్లోతు దిగిపోయి ఉండగా, ఎదుట వ్యక్తి డైలాగ్‌లు చెబుతున్నారు. షాట్ గ్యాప్‌లో నేను అలాగే ఇసుకలో ఉండిపోయా. ఈలోగా అక్కడకు కుక్క వచ్చింది. ఏదో అనుకుని కాలు ఎత్తుతుందేమోనని భయపడిపోయా(నవ్వులు)
ఫారిన్ షూటింగ్ వెళ్లాలంటే కాంబినేషన్ అడుగుతారట!
బ్రహ్మానందం: అవును! ఆలీ కాంబినేషన్ అయితే నాకు సుఖంగా ఉంటుంది.
బ్రహ్మానందం అంటే హ్యాపీనా? బ్రహ్మిగాడు అంటే హ్యాపీనా?
బ్రహ్మానందం: ఎవరు పిలిచినా పలకడం మన బాధ్యత కదా. మీమ్స్ క్రియేట్ చేసిన వాళ్లకు చేతులెత్తి నమస్కారం చేస్తున్నా. కొన్ని కారణాల వల్ల ఇటీవల నేను సినిమాల్లో నటించలేకపోయినా, నన్ను మర్చిపోకుండా చేసేది వాళ్లే.
ఇదీ చూడండి: హాస్య'బ్రహ్మా'.. నీ నవ్వుకు సలామ్