లాక్‌డౌన్ ఎత్తివేస్తూ తెలంగాణ ప్రభుత్వం శనివారం నిర్ణయం తీసుకుంది. సినిమా థియేటర్లను యథావిధిగా తెరచుకోవచ్చని స్పష్టం చేసింది. చిత్రసీమకు ఇది ఊరట కలిగించే విషయమే. ప్రదర్శనలు నిలిచిపోయి దాదాపు రెండు నెలలైంది. పదుల సంఖ్యలో సినిమాలు విడుదల ముంగిట ఆగిపోవల్సి వచ్చింది. ఇప్పుడు ఆ చిత్రాలన్నీ విడుదలకు సన్నద్ధమవుతున్నాయి. అయితే ఆంధ్రప్రదేశ్‌లో ఇంకా లాక్‌డౌన్ నిబంధనలు కొనసాగుతూనే ఉన్నాయి. తెలుగు సినిమాకు 60 శాతం మార్కెట్ అక్కడే ఉంది. రెండు తెలుగు రాష్ట్రాల్లో విడుదలైతేనే అందరికీ మేలు జరుగుతుంది. అందుకే నిర్మాతలు ఆంధ్రప్రదేశ్‌లోనూ అనుమతులు ఇచ్చేవరకు వేచి చూడక తప్పని పరిస్థితులు నెలకొన్నాయి.
పరిమిత వ్యయంతో తెరకెక్కిన సినిమాలు, ఇదివరకు విడుదలైనవి తెలంగాణలో ప్రదర్శించుకునే అవకాశాలు ఉన్నప్పటికీ ప్రదర్శనకారులు ఆసక్తి చూపడం లేదు. పాత సినిమాపై ప్రేక్షకులు మొగ్గు చూపడం లేదని ప్రదర్శనకారులు చెబుతున్నారు. తొలి దశ కరోనా తర్వాత థియేటర్లు తెరిచిన వెంటనే, ఓటీటీలో విడుదలైన సినిమాల్ని థియేటర్లలో ప్రదర్శనకు ఉంచారు. వాటికి ప్రేక్షకుల ఆదరణ కరవవడం వల్ల వెంటనే థియేటర్ల నుంచి తొలగించారు. ఈసారి కొత్త సినిమాలు విడుదలయ్యే వరకు వేచి చూడనున్నారు.
ప్రభుత్వం దగ్గరికి..
తొలి లాక్‌డౌన్ తర్వాత చిత్ర పరిశ్రమకు ప్రభుత్వం పలు రాయితీల్ని ప్రకటించింది. థియేటర్ల కరెంటు బిల్లుల రద్దు, ప్రదర్శనల విషయంలో వెసులుబాటు తదితర విషయాల్లో ప్రభుత్వం హామీ ఇచ్చింది. అయితే ఇప్పటివరకు ఆ హామీలు నెరవేరకపోవడం వల్ల థియేటర్ యాజమాన్యాలు మరోమారు ప్రభుత్వం దగ్గరికి వెళ్లనున్నాయి. ఆ హామీలపై ప్రభుత్వం స్పందించేవరకు థియేటర్లను తెరవకూడదని తెలంగాణ ఎగ్జిబిటర్స్ అసోసియేషన్ నిర్ణయించింది. ఆ మేరకు త్వరలోనే తెలంగాణ రాష్ట్ర సినిమాటోగ్రఫీ శాఖ మంత్రిని వారు కలవనున్నారు.
మల్టీప్లెక్స్‌లు రెడీ
సింగిల్ స్క్రీన్ థియేటర్లు ఇప్పట్లో తెరుచుకునే అవకాశాలు లేకపోయినా మల్టీప్లెక్స్‌లు మాత్రం సిద్ధంగా ఉన్నాయి. తెలంగాణలో 600కిపైగా థియేటర్లు ఉన్నాయి. అందులో 250కిపైగా ఉన్న మల్టీప్లెక్స్‌ల్లో ప్రదర్శనలు షురూ అయ్యే అవకాశాలు ఉన్నాయి. మల్టీప్లెక్స్ థియేటర్లు ఒక రాష్ట్రంతో సంబంధం లేకుండా దేశవ్యాప్తంగా ఒకే గొడుగు కింద ఉంటాయి. వాటిలో ఆంగ్ల, హిందీ సినిమాలు విడుదలయ్యే అవకాశాలున్నాయి. ప్రభుత్వం నుంచి సానుకూల స్పందన లభిస్తే సింగిల్ థియేటర్లు ప్రదర్శనల్ని షురూ చేసేందుకు సిద్ధం కానున్నాయి. సినిమాలు విడుదల కావడమే ఇప్పుడు కీలకంగా మారింది. ఆంధ్రప్రదేశ్‌లో పరిస్థితుల ఆధారంగానే కొత్త చిత్రాలు ప్రేక్షకుల ముందుకు రానున్నాయి.
ఇదీ చూడండి: Theatres: తెలంగాణలో థియేటర్లు ఆ రోజు నుంచి ఓపెన్!