వీపీఎఫ్ (వర్చువల్ ప్రింట్ ఫీ) వసూలు... రెవెన్యూ షేరింగ్ తదితర విషయాలపై మల్టీప్లెక్స్ థియేటర్ల యాజమాన్యాలకీ, నిర్మాతలకీ మధ్య కొన్నాళ్లుగా జరుగుతున్న చర్చల్లో పురోగతి కనిపించడం లేదు. నిర్మాతల డిమాండ్లను మల్టీప్లెక్స్ యాజమాన్యాలు అంగీకరించకపోవడం వల్ల చర్చల్లో ప్రతిష్టంభన కొనసాగుతోంది. ఈ విషయంపై నిర్మాతలు ఆగ్రహంగా ఉన్నట్టు తెలుస్తోంది. తమ సమస్యలు పరిష్కారం కాకపోతే కొత్త సినిమాల్ని విడుదల చేయమని నిర్మాతలు తెగేసి చెప్పినట్టు సమాచారం. దాంతో క్రిస్మస్ సందర్భంగా థియేటర్లలో విడుదల కావల్సిన సినిమాలపై సందిగ్ధత కొనసాగుతోంది.
కొత్త చిత్రాలు విడుదల చేసే ముందు తమ సమస్యలు పరిష్కారం కావాలని, డిమాండ్లను మల్టీప్లెక్స్ యాజమాన్యాలు అంగీకరించాల్సిందేనని యాక్టివ్ ప్రొడ్యూసర్స్ గిల్డ్ కోరుతోంది. రెండు తెలుగు రాష్ట్రాల్లోని అన్ని ప్రాంతాల్లో రెవెన్యూ షేరింగ్ ఒకేలా ఉండాలనీ, రెవెన్యూలో నిర్మాతలకు ఎక్కువ భాగం ఇవ్వాలని, నిర్మాతల నుంచి వీపీఎఫ్ (వర్చువల్ ప్రింట్ ఫీ) వసూలు చేయకూడదని, ప్రదర్శనల్లో ప్రాధాన్యం తెలుగు సినిమాలకే ఇవ్వాలని... ఇలా నిర్మాతల నుంచి పలు డిమాండ్లు ఉన్నాయి. వీటిని అంగీకరించడానికి మల్టీప్లెక్స్ యాజమాన్యాలు ససేమిరా అంటుండడం వల్ల గందరగోళ పరిస్థితి ఏర్పడింది.
రాజీనామా చేశా: నట్టి కుమార్
తెలుగు చలనచిత్ర వాణిజ్య మండలి సంయుక్త కార్యదర్శి పదవికి నట్టి కుమార్ రాజీనామా చేశారు. దీనిపై ఆయన శనివారం అధికారికంగా ఓ లేఖను విడుదల చేశారు. దీనిపై ఆయన మాట్లాడుతూ.. "థియేటర్లను తెరిచేందుకు ప్రభుత్వం నుంచి అనుమతు లొచ్చినా.. చిత్రసీమలోని ఐదుగురు వ్యక్తులు స్వప్రయోజనాల కోసం థియేటర్లు తెరవడానికి మోకాలడ్డుతున్నారు. వచ్చే ఏడాది మార్చి వరకూ థియేటర్లు మూసి ఉంచాలని ప్రయత్నిస్తున్నారు. ఇది సరికాదు. ఇప్పటికే వందలాది మంది సింగిల్ థియేటర్ యజమానులు, వాటిపై ఆధారపడ్డ కార్మికులు, చిన్న సినిమా నిర్మాతలు రోడ్డున పడ్డారు. నాకు చేతిలో అధికారం ఉన్నా ఏమీ చేయలేని పరిస్థితి. అందుకే నా సంయుక్త కార్యదర్శి పదవికి, కార్యవర్గ సభ్యత్వానికి రాజీనామా చేశా. ఈనెల 25 లోపు థియేటర్లు తెరవడంపై స్పష్టమైన ప్రకటన రాకుంటే.. ఆ ఐదుగురి ఇళ్ల ముందు ధర్నా చేస్తా" అన్నారు.
ఇదీ చూడండి : వెంకటేష్ బర్త్డే: ఈ విషయాలు ఎంతో ఆసక్తికరం!