Choreographer Shivashankar master died: ప్రముఖ నృత్య దర్శకుడు శివశంకర్ మాస్టర్(72) కన్నుమూశారు. కరోనాతో చికిత్స పొందుతూ గచ్చిబౌలి ఆస్పత్రిలో తుది శ్వాస విడిచారాయన. ఇటీవల శివశంకర్ మాస్టర్ కుటుంబం కరోనా బారినపడింది. ప్రస్తుతం ఆయన పెద్ద కుమారుడు విజయ్ శివశంకర్ ఇంకా కోలుకోలేదు.
1948 డిసెంబర్ 7న చెన్నైలో జన్మించారు శివశంకర్ మాస్టర్. 10 భాషల్లోని 800 చిత్రాలకుపైగా కొరియోగ్రాఫర్‌గా పనిచేశారు. దాదాపు 30 చిత్రాల్లో నటించారు. పలు భాషల్లో ఉత్తమ అవార్డులు తీసుకున్నారు. 'మగధీర' చిత్రానికి ఉత్తమ కొరియోగ్రాఫర్‌గా జాతీయ ఫిల్మ్ అవార్డు అందుకున్నారు.
1975లో 'పాట్టు భరతమమ్' చిత్రానికి సహాయకుడిగా కెరీర్ ప్రారంభించిన ఆయన 'కురువికూడు' చిత్రంతో నృత్య దర్శకుడిగా మారారు. 'అమ్మోరు', 'సూర్యవంశం', 'అల్లరి పిడుగు', 'అరుంధతి', 'మహాత్మా', 'బాహుబలి 1' చిత్రాలకు కొరియో గ్రాఫర్ పనిచేశారు. కేవలం కొరియోగ్రాఫర్‌గానే కాదు, నటుడిగా వెండితెరపైనా తనదైన ముద్రవేశారు. 2003లో వచ్చి 'ఆలయ్' చిత్రంతో నటుడిగా మారిన శివ శంకర్ మాస్టర్ దాదాపు 30కి పైగా చిత్రాల్లో వైవిధ్య నటనతో నవ్వులు పంచారు. బుల్లితెర పైనా తనదైన ముద్రవేశారు. పలు షోలకు న్యాయ నిర్ణేతగా వ్యవహించారు. ఆయన వద్ద శిష్యరికం చేసిన ఎంతో మంది కొరియోగ్రాఫర్‌లు ప్రస్తుతం టాప్ నృత్య దర్శకులుగా కొనసాగుతున్నారు. శివ శంకర్‌కు ఇద్దరు కుమారులు. విజయ్ శివ శంకర్, అజయ్ శివ శంకర్ ఇద్దరూ డ్యాన్స్ మాస్టర్లే.
సానుభూతి ప్రకటిస్తున్నారు
శివశంకర్ మాస్టర్‌కు మెరుగైన వైద్యం అందించడానికి సోనూసూద్, ధనుష్, చిరంజీవిలు తమవంతు సాయం చేశారు. అయినా మాస్టర్ ప్రాణాలు దక్కలేదు. ఆయన ఇక లేరన్న వార్తతో చిత్ర పరిశ్రమలో విషాద ఛాయలు అలుముకున్నాయి. శివశంకర్ మృతి పట్ల పలువురు సినీ, రాజకీయ ప్రముఖులు విచారం వ్యక్తం చేశారు. ఆయన ఆత్మకు శాంతి చేకూరాలని సామాజిక మాధ్యమాల వేదికగా ప్రార్థించారు.
సోమవారం అంత్యక్రియలు
శివశంకర్ భౌతికకాయాన్ని నవంబరు 29 ఉదయం హైదరాబాద్ పంచవటిలోని స్వగృహానికి తీసుకెళ్లనున్నట్టు ఆయన కుటుంబ సభ్యులు తెలిపారు. సోమవారం మధ్యాహ్నం 2 గంటలకు మహాప్రస్థానంలో అత్యక్రియలు నిర్వహించనున్నారు. చనిపోయే ముందు శివశంకర్ మాస్టర్‌కు కొవిడ్ నెగిటివ్‌గా నిర్ధరణ అయిందని వైద్యులు వెల్లడించారు.
ఇదీ చూడండి: 'ఆ పని చేయొద్దు ప్లీజ్'.. ఫ్యాన్స్‌కు సల్మాన్ విజ్ఞప్తి