‘నోమాడ్‌ల్యాండ్’ సినిమా కంటే ముందు పుస్తకంగా వచ్చి ఎన్నో ప్రశంసలు అందుకుంది. 21వ శతాబ్దం తొలినాళ్లలో ఆర్థికమాంద్యం ప్రపంచాన్ని పట్టి కుదిపేసిన రోజుల్లో ఉపాధిలేక, ఉండటానికి నీడలేక యువత దేశ దిమ్మరులుగా రోడ్లపై తిరిగిన కాలాన్ని జెస్సికా బ్రూడర్ అనే జర్నలిస్ట్ అక్షరబద్ధం చేయాలనుకుంది. ఇందుకోసం మూడేళ్లపాటు రోడ్లపైనే తిరిగింది. మెక్సికో నుంచి కెనడా వరకూ ఉన్న 15,000 కిలోమీటర్ల దూరాన్ని ఓ వ్యానులో ప్రయాణించి ఎంతోమందిని ఇంటర్వ్యూ చేసింది. ఓ ఇల్లంటూ లేకుండా వ్యానులో దేశదిమ్మరిగా తిరిగిన ఆ అనుభవాల్లోంచి పుట్టిన పుస్తకమే ఈ ‘నోమాడ్‌ల్యాండ్’. ఆ పుస్తకం ఇచ్చిన స్ఫూర్తితో దర్శకురాలు క్లోయీ జావ్ అదే పేరుతో సినిమాకి శ్రీకారం చుట్టింది. అయితే రోడ్డు నేపథ్యంగా సాగే సినిమాలు తీయడం తేలికైన వ్యవహారం కాదు. ఎంతో అనుభవం ఉన్న దర్శకులకే అది కత్తిమీద సాము. మరి క్లో నేపథ్యం ఏంటి..?
క్లో తీసినవి మూడు సినిమాలే అయినా అంతర్జాతీయ అవార్డులూ, నామినేషన్లు కలిపి 33 వరకూ అందుకుంది.
క్లోయీ జావ్ పుట్టింది చైనాలో. తండ్రి చైనాలోని ప్రముఖ స్టీల్ కంపెనీ షౌగాంగ్ గ్రూప్‌లో టాప్ ఎగ్జిక్యూటివ్. తల్లి వైద్యరంగంలో పనిచేసేది. మాస్టారు చెప్పిన పాఠాలు వినడం మానేసి పుస్తకాల మధ్యలో జపాన్ కామిక్ పుస్తకాలని పెట్టుకుని ఇష్టంగా చదివే క్లోని ఎలా కట్టడి చేయాలో తండ్రికి అర్థం కాలేదు. ఒక్క ముక్క ఇంగ్లిష్ రాకపోయినా క్లోని లండన్‌లోని ఓ బోర్డింగ్ స్కూల్లో చేర్పించాడు. ఆ తర్వాత క్లో తల్లిదండ్రులు విడిపోయారు. తండ్రి చైనాలో ప్రముఖ హాస్యనటిగా పేరొందిన సాంగ్‌డాండన్‌ని వివాహం చేసుకున్నాడు. ఆమె సినిమాలని చూస్తూనే పెరిగిన క్లో లండన్ నుంచి లాస్‌ఏంజలెస్ వెళ్లి పొలిటికల్ సైన్స్‌లో డిగ్రీపట్టా అందుకుంది. ఆ తర్వాత తనకెంతో ఇష్టమైన సినిమాల్లో అడుగుపెట్టేందుకు న్యూయార్క్ యూనివర్సిటీ టిచ్ స్కూల్ ఆఫ్ ఆర్ట్స్‌లో చేరి సినిమాలని లోతుగా అధ్యయనం చేసింది. నోమాడ్‌ల్యాండ్ కంటే ముందు క్లో తీసిన సినిమాలు రెండే. వీటిల్లో ప్రముఖ హీరో, హీరోయిన్లని తీసుకొచ్చి తన సినిమాల్లో పెట్టుకోలేదామె. ఆ సినిమాలు విడుదలైన తర్వాతే వాళ్లు ప్రముఖ హీరో హీరోయిన్లుగా పేరు తెచ్చుకున్నారు. పాత్రల్లో సహజత్వం ఉట్టిపడాలనే తాపత్రయంతో అలా చేశాననే ఈ దర్శకురాలు తన మూడో సినిమా అయిన ‘నోమాడ్...’కి మాత్రం మెక్‌డొర్మాండ్ అనే ప్రముఖ నటిని ప్రధానపాత్రలో నటింపచేయాలని ముందుగానే ఓ అభిప్రాయానికి వచ్చేసింది. ఎందుకంటే రెండేళ్ల క్రితం జరిగిన ఓ అవార్డుల వేడుకలో మెక్‌డొర్మాండ్ ఉత్తమనటిగా నామినేట్ అయితే... అదే వేడుకలో ఉత్తమ మహిళా దర్శకులకు అందించే 50,000 డాలర్లని క్లో అందుకుంది.
అప్పుడే వాళ్లిద్దరూ కలుసుకున్నారు. తాను తీయబోయే సినిమాలో ప్రధాన పాత్ర అయిన ‘ఫెర్న్’కి డొర్మాండ్‌నే న్యాయం చేయగలదని బలంగా నమ్మింది క్లోయిజా. ఈ సినిమాకోసం ఇద్దరూ నాలుగు నెలలపాటు పూర్తిగా వ్యానుల్లోనే ప్రయాణం చేశారు. 60 సంవత్సరాల వయసులో సర్వంకోల్పోయి దేశదిమ్మరిగా తిరిగే ఫెర్న్ పాత్రకి ప్రాణం పోసింది డొర్మాండ్. వాళ్ల కష్టం వృథా పోలేదు. ఈ సినిమా ఆస్కార్ వేడుకల్లో ఉత్తమ చిత్రంగా ఎంపికైతే, ఉత్తమ దర్శకురాలిగా అవార్డుని అందుకుంది క్లో. ఆస్కార్ చరిత్రలో ఈ ఘనతను సాధించిన రెండో మహిళ క్లో. ఆసియా నుంచి తొలిసారిగా ఈ అవార్డుని అందుకున్న మొదటి మహిళ. ఆస్కార్‌కంటే ముందు గోల్డెన్ గ్లోబ్ అవార్డు అందుకున్నప్పుడే చైనా అధికార పత్రిక ‘గ్లోబల్ టైమ్స్’ మొదటిపేజీలో క్లోపై ప్రశంసల వర్షం కురిపించింది. కానీ 2013లో ఇచ్చిన ఒక ఇంటర్వ్యూలో ‘ఏది నిజమో ఏది అబద్ధమో నేను పుట్టిపెరిగిన గడ్డపై తెలుసుకోవడం కష్టమే’ అని నిర్మొహమాటంగా చెప్పినందుకు చైనా ప్రభుత్వం ఈ సినిమా విడుదలని అడ్డుకుంది. స్థానిక సోషల్‌మీడియా, చైనా యువత మాత్రం ఆమెని ఆకాశానికి ఎత్తేసింది.
‘సినిమాలు నిర్మించుకుంటూ వెళ్లడం నా ఉద్దేశం కాదు. సినిమాలు తీయాలనే పిచ్చి ఉంటే సరిపోదు. ఆ పిచ్చికి ఓ ఉత్సుకత కూడా తోడవ్వాలి. ఆ ఉత్సుకతే నన్ను మంచి సినిమాలవైపు నడిపిస్తుంది’ అని అంటోంది క్లోయిజా. క్లోభర్త జాషువాజేమ్స్ రిచర్డ్స్
సినిమాటోగ్రాఫర్.
- ఇదీ చదవండి : ఆస్కార్ వేడుకలో భారత్ వెలుగులు!