తెలుగు తెర విలక్షణ నటుడు ఎస్వీ రంగారావుపై రచయిత సంజయ్ కిశోర్ మహానటుడు పుస్తకాన్ని ఫొటోలతో విశదీకరించి రచించారు. ఈ పుస్తకావిష్కరణ వేడుక భాగ్యనగరంలో జరిగింది. కార్యక్రమానికి హాజరైన చిరంజీవి.. ఎస్వీ రంగారావును స్ఫూర్తిప్రదాతగా కొనియాడారు.
" ఎస్వీ రంగారావు తెలుగువారిగా పుట్టడం మన అదృష్టం. అలాంటి మహానటుడిని ఒక్కసారీ నేరుగా చూడలేదు. ఒక్కసారీ కలవలేదు. ఆయనతో ఒక్క ఫొటో కూడా లేదనే లోటు నా జీవితాంతం ఉంటుంది. నా ఆరాధ్య నటుడు, అపారంగా అభిమానించే వ్యక్తి ఎస్వీ రంగారావు. ఆయన పేరుమీద వచ్చిన పుస్తకాన్ని ఆవిష్కరించడం నిజంగా భగవంతుడు నాకు ఇచ్చిన అవకాశం. ఎస్వీఆర్, సావిత్రి, కన్నాంబ నటనకు భూత, భవిష్యత్ వర్తమానాలు ఉండవు. వారిది సహజ నటన. ఎస్వీ రంగారావు సినిమాలు చూసి ఎంతో నేర్చుకోవచ్చు. ఆయన ఒక ఎన్‌సైక్లోపిడియా. ఆయనపై అంత అభిమానం పెరగడానికి కారణం మా నాన్న. నా చిన్నప్పుడు నాన్న నాటకాలు వేస్తుండేవారు. ఆర్థిక సమస్యల కారణంగా ఆయనెప్పుడూ మద్రాసు వెళ్లి అవకాశాల కోసం ప్రయత్నించలేదు. అయితే, ఎస్వీఆర్‌తో కలిసి ‘జగజంత్రీలు’, ‘జగత్ కిలాడీలు’ చిత్రాల్లో చిన్న పాత్రలు వేసే అవకాశం వచ్చింది. ఇంటికి వచ్చిన తర్వాత ఎస్వీఆర్, ఆయన నటన గురించి నాన్న చెబుతుండేవారు. ఆ విధంగా రంగారావు మీద అభిమానం పెరిగింది. నేను నటుడిని అవ్వాలని కోరిక కలగడానికి బహుశా అప్పుడే బీజం పడి ఉంటుంది".
-- చిరంజీవి, సినీనటుడు
రామ్‌చరణ్ సినిమాల్లోకి వస్తానన్నప్పుడు ఎస్వీఆర్ సినిమాలు చూపించానని చిరు చెప్పుకొచ్చారు. ఎస్వీఆర్‌పై పుస్తకం రాసినందుకు సంజయ్ కిశోర్‌ను ప్రశంసించారు. తొలి ప్రతిని ఆవిష్కరించి పెండ్యాల హరినాథ బాబుకి అందజేశారు. కార్యక్రమానికి తనికెళ్ల భరణి, బ్రహ్మానందం, రోజా రమణి, తమ్మారెడ్డి భరద్వాజ హాజరయ్యారు.